ఈసీ వర్సెస్ విపక్షం...బీజేపీకి షాక్ ఇచ్చేలా జగన్ !

ప్రస్తుతం చూస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ జాతీయ స్థాయిలో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి.

Update: 2026-09-26 03:28 GMT

ప్రస్తుతం చూస్తే కేంద్ర ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేస్తూ జాతీయ స్థాయిలో విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నుంచి వామపక్షాలు ఇతర పార్టీలు అన్నీ కలసి ఈసీ విశ్వసనీయతను ప్రశ్నిస్తూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు ఎక్కు పెడుతున్నాయి. అయితే దక్షిణాది నుంచి బలమైన రాజకీయ గొంతుకలేవీ ఇందులో పెద్దగా వినిపించలేదు, కాంగ్రెస్ మూడు రాష్ట్రాలలో అధికారంలో ఉండడంతో సహజంగా విమర్శలు చేస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఈసీ తీరు మీద కామెంట్స్ వచ్చాయి. తమిళనాడులో టీవీకే స్పందన తెలియాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఏపీ నుంచి విపక్షంలో ఉన్న వైసీపీ ఈసీ వివాదం నేపధ్యంలో ఘాటైన వ్యాఖ్యలు చేయడమే కాదు ఏకంగా దేశంలోని జాతీయ ప్రతిపక్షలు కూడా చేయని చట్ట సవరణ డిమాండ్ ని కేంద్ర ప్రభుత్వం ముంచు పెట్టి బిగ్ షాక్ ఇచ్చింది. వైసీపీ అధినేత సుదీర్ఘమైన ట్వీట్ చేయడం ద్వారా ఈసీ తీరు మీద తమ పార్టీ రియాక్షన్ ఏంటో చెప్పారు.

ఆ చట్టంలో మార్పులు :

ఇదిలా ఉంటే 2023లో చేసిన చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని జగన్ డిమాండ్ చేయడం విశేషం. అప్పట్లో వైసీపీ మద్దతు ఇచ్చిన ప్రధాన ఎన్నికల కమిషనర్- ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం- పదవీకాలం- చట్టం, 2023ని ఇప్పటి పరిస్థితుల నేపథ్యంలో మళ్లీ సమీక్షించాలని జగన్ కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అధికార పార్టీ చొరవ తీసుకుని అందరిలో ప్రస్తుతం ఉన్న భయాలను తొలగించి సరైన విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాన మంత్రి సభ్యులుగా ఉండే ముగ్గురు సభ్యుల కమిటీ ద్వారా ఎన్నికల కమిషనర్‌ను నియమించేలా ఈ చట్టానికి సవరణ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక పరీక్ష రాసే విద్యార్ధిని పరీక్షాధికారిని నియమిస్తే ఆ అధికారి ఎంత నిజాయితీపరుడైనప్పటికీ ఆరోపణలు వచ్చే అవకాశం ఉంటుందని జగన్ వ్యాఖ్యానించారు. అందువల్ల ఈ మొత్తం ప్రక్రియను తటస్థ వ్యక్తులతో కూడిన వ్యవస్థతో మార్చడం ఎల్లప్పుడూ మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా చేయడం వల్ల ఎన్నికల సంఘం పట్ల ప్రజలలో గౌరవాన్ని విశ్వాసాన్ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తుందని ఆయన అన్నారు.

ప్రజలకు విశ్వాసం :

దేశంలో రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలంటూ జగన్ ఘాటు కామెంట్స్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగబద్ధ సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందని ఆయన అన్నారు. అంతే కాదు ఎన్నికల సంఘం నిర్ణయాల మీద ఈసీలో ఉన్న ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న జాతీయ మీడియా కధనాలను జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఓటర్ల జాబితాల నిర్వహణపైన కూడా అనేక సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారన్న జాతీయ మీడియా కథనాలు ప్రజల్లో తీవ్రమైన ప్రశ్నల సందేహాలను రేకెత్తించాయని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం లేదా పునరుద్ధరించడం వంటి విషయాలలో ఏయే అభ్యంతరాలు నమోదయ్యాయి, వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, రాజ్యాంగ వ్యవస్థ ఎంత పారదర్శకంగా పనిచేసింది అనే అంశాలపై ప్రజలకు స్పష్టత అవసరం అని జగన్ నొక్కి చెప్పారు. అందువల్ల ఈ విషయాలపై ప్రజలకు భరోసా కల్పించే ఈసీ తక్షణం చర్యలు చేపట్టాలని కోరారు.

ఓటు హక్కు రక్షించాలి :

దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని మరింతగా బలోపేతం చేయాలని, అలాగే ప్రతి పౌరుడి ఓటు హక్కును రక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు ప్రజలు నిర్భయంగా ఆ హక్కును వినియోగించుకునే విధంగా వ్యవస్థలను పటిష్టం చేయాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో పారదర్శకత ఉండటమే కాదని అది కచ్చితంగా ఉన్నట్లుగా ప్రజలకు కనిపించాలని జగన్ కోరారు. ఇదిలా ఉంటే ఏపీలో కూడా సర్ ప్రక్రియను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని జగన్ ఆరోపించారు. వైసీపీ అనేక సందర్భాలలో చేసిన విజ్ఞప్తులను పట్టించుకోలేదని జగన్ అన్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో కూడా డివిజన్ల పునర్విభజన తీరుపై ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వ్యక్తం చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చారని ఆయన నిందించారు. ఇటువంటి చర్యలు ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిస్సందేహంగా బలహీనపరుస్తాయని అన్నారు.

Tags:    

Similar News