జగన్ షెడ్యూల్.. వచ్చే వారం ఫుల్ బిజీ.. స్పెషలేంటి?

ఇక తాజాగా దసరా నవరాత్రులకు కూడా ఆయన రాష్ట్రంలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఏమైందో కానీ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చేవారం మొత్తం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు.;

Update: 2025-10-05 13:00 GMT

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఒక్కసారిగా ఫుల్ బిజీ అయిపోయారు. 16 నెలల క్రితం అధికారం కోల్పోయిన జగన్.. వారంలో ఒకటి, రెండు రోజులు మాత్రమే కార్యకర్తలు, నాయకులకు అందుబాటులో ఉంటున్నారని, మిగిలిన సమయం అంతా బెంగళూరులోనే గడుపుతున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక తాజాగా దసరా నవరాత్రులకు కూడా ఆయన రాష్ట్రంలో లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఏమైందో కానీ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చేవారం మొత్తం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుబడుతున్న మాజీ సీఎం జగన్ ఇన్నాళ్లు మీడియా సమావేశాల్లో విమర్శలకు మాత్రమే పరిమితమయ్యారు. అయితే ఇక నుంచి పంథా మార్చాలని, స్పీడు పెంచాలని జగన్ డిసైడ్ అయినట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో 9వ తేదీన మెడికల్ కాలేజీలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనకు జగన్ సిద్ధమయ్యారు. అంతేకాకుండా పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేసేందుకు 7వ తేదీన అంటే మంగళవారం పార్టీ నేతల అత్యావసర సమావేశాన్ని నిర్హిస్తున్నారు.

గత నెలలో పార్టీ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించిన జగన్ ఆ తర్వాత బెంగళూరు వెళ్లిపోయారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడం, గత వారం అంతా వరుస సెలవులు కావడంతో జగన్ రాష్ట్రానికి తిరిగి రాలేదు. దీంతో వచ్చేవారం అంతా బిజీ కార్యక్రమాలను రూపొందించారు. ఈ వారం రోజులు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని జగన్ భావిస్తున్నారు. నకలీ మద్యం తయారీ, శాంతిభద్రతల సమస్యలు, పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం వంటి అంశాలపై ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారని అంటున్నారు.

ఈ క్రమంలో మరోసారి ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ నెల 7న తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. రీజనల్ కోఆర్డినేటర్ల, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు హాజరుకానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రజా పోరాటాలు సహా అనేక అంశాలపై ఈ కీలక భేటీలో చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అదేవిధంగా 8న జగన్ భీమవరం వెళ్లనున్నారు. మాజీ ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరావు ఇంట వివాహ వేడుకకు హాజరు కానున్నారు. ఆ తర్వాత అక్కడి కేడర్ తో సమావేశం నిర్వహిస్తారని చెబుతున్నారు.

ఇక 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో జగన్ పర్యటన ఖరారైంది. ఆ జిల్లా పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని ఆయన సందర్శించనున్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తున్న జగన్.. నర్సీపట్నంలో నిరసన దీక్ష చేస్తారని అంటున్నారు.

Tags:    

Similar News