విశాఖకు జగన్.. తోడురాని నేతలు.. రీజనేంటి?
అయితే.. జగన్ పర్యటనలో విశాఖకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దగా కనిపించలేదు.;
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా విశాఖలో పర్యటించారు. ప్రఖ్యాత సింహా చలం దేవస్థానంలోని రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గోడ కూలిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. మొత్తం 8 మంది ఈ ప్రమాదంలో మృతి చెందగా.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాజీసీఎం మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు హుటాహుటిన విశాఖకు వెళ్లారు. అక్కడి నుంచి చంద్రపాలెం మండలానికి వెళ్లి.. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
చంద్రపాలెం మండలంలో ఉమా మహేష్, శైలజ దంపతులు అప్పన్న నిజరూప దర్శనం కోసం ప్రమాదంలో చిక్కుకుని ఊపిరా డక మృతి చెందారు. వీరి కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందే వరకు బాధిత కుటుంబాల పక్షాన పోరాటం చేస్తామని చెప్పారు. కానీ, అప్పటికే సీఎం చంద్రబాబు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ విషయాన్ని బాధిత కుటుంబానికి చెందిన ఒకరు జగన్‌కు చెప్పారు. ప్రభుత్వం పరిహారం ప్రకటించిందన్నారు. అనంతరం.. మరో కుటుంబాన్ని కూడా.. జగన్ పరామర్శించారు. వారికి కూడా ధైర్యం చెప్పారు.
అయితే.. జగన్ పర్యటనలో విశాఖకు చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దగా కనిపించలేదు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నవారు కూడా.. ఈ పర్యటనలో కనిపించకపోవడం గమనార్హం. అయితే.. దీనిపై రాజకీయ విమర్శలు వస్తున్న నేపథ్యంలో పార్టీ అధినేతే వారిని ఈ పర్యటనకు దూరంగా ఉండమని చెప్పారని.. అందుకే కీలక నేతలు ఎవరూ రాలేదని నాయకులు చెప్పుకొచ్చారు. అంతేకాదు.. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నాయకులు సహక రించాలని జగన్ పిలుపునిచ్చారని.. అందుకే వారు ఆయా పనుల్లో పడి.. జగన్ పర్యటనకు దూరంగా ఉన్నారని తెలిపారు.
జగన్ శవ రాజకీయాలు: టీడీపీ
మరోవైపు.. జగన్ పర్యటనపై టీడీపీ నాయకులు నిశిత విమర్శలు చేశారు. తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబాలను ఇబ్బంది పెట్టి.. రాజకీయంగా తాను రీచార్జ్ అయ్యేందుకు జగన్ శవరాజకీయాలు చేస్తున్నారని.. జిల్లాకు చెందిన నాయకులు విమర్శలు గుప్పించారు. వైసీపీ హయాంలోనే సదరు గోడను నిర్మించారని.. నాణ్యలేని నిర్మాణం కారణంగానే ఇప్పుడు.. భక్తులు మృతి చెందారని.. దీనికి వైసీపీ అధినేత ముందు సమాధానం చెప్పాలని పల్లా శ్రీను వ్యాఖ్యానించారు. అయితే.. దీనిపై వైసీపీ నాయకులు కూడా రివర్స్ అయ్యారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఎదురు దాడి చేశారు.