30న శ్రీకాకుళం జైలుకు జగన్.. మాజీ మంత్రి అప్పలరాజు విషయంలో కీలక నిర్ణయం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ నెల 30న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఈ నెల 30న శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ రోజు వైసీపీకి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శిస్తారని వైసీపీ కార్యాలయం ప్రకటించింది. ప్రస్తుతం మాజీ మంత్రి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉండగా, మాజీ సీఎం జగన్ ఆయనతో ములాఖత్ అవ్వనున్నారు. ఈ పరిణామం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే మాజీ మంత్రి అప్పలరాజు విషయంలో వైసీపీ అధినేత జగన్ రెడ్డి తీరుపై ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయని అంటున్నారు. అయినప్పటికీ తన పార్టీ సహచరుడికి భరోసా ఇవ్వడానికే జగన్ రెడ్డి మొగ్గు చూపడం విశేషంగా వ్యాఖ్యానిస్తున్నారు.
మాజీ మంత్రి అప్పలరాజుతో మిలాఖత్ అవ్వాలని జగన్ రెడ్డి నిర్ణయించడం ఆసక్తి రేపుతోంది. కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసును తారుమారు చేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలతో మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అప్పలరాజు తప్పు చేశారనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అనుకూల మీడియా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కథనాలు ప్రచురిస్తోంది. రోడ్డు ప్రమాదం కేసును సరిగా డీల్ చేయలేకపోయారని, ప్రమాదానికి కారణమైన మాజీ మంత్రి కుమారుడు అరవ్ వర్మను తప్పించబోయి మరికొరిని పంపి అప్పలరాజు బుక్ అయ్యారని వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే సాధారణ రోడ్డు ప్రమాదం కేసులో కూటమి ప్రభుత్వం కావాలనే రాజకీయ కక్ష సాధిస్తోందని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి భావిస్తున్నారు. అంతేకాకుండా 18 ఏళ్ల చిన్న పిల్లోడు రోడ్డు ప్రమాదం చేస్తే, తండ్రిపై కేసు నమోదు చేస్తారా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం పర్యటనలో ఉండగా, జగన్ రెడ్డి చేసిన ఈ ఆరోపణ బూమరాంగ్ అయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జగన్ రెడ్డి సరిగా స్పందించలేకపోయారనే విమర్శలను మూటగట్టుకున్నారని అంటున్నారు. అయినప్పటికీ వైసీపీ అధినేత మాత్రం వెనక్కి తగ్గకుండా ఈ విషయంలో మాజీ మంత్రి అప్పలరాజుకు బాసటగా నిలిచేందుకే నిర్ణయించడం హాట్ టాపిక్ అవుతోంది.
కాగా, మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టును రాజకీయ కక్ష సాధింపుగానే మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి భావిస్తున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతల వేధింపులను గురిచేయడమే లక్ష్యంగా కేసులు నమోదు చేస్తున్నారని, అప్పలరాజును ఆ లక్ష్యానికి అనుగుణంగానే అరెస్టు చేయించారని మాజీ ముఖ్యమంత్రి ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే పార్టీ నేతలకు మానసికంగా ధైర్యం ఇవ్వాలని భావించి శ్రీకాకుళం జైలుకు వెళ్లి అప్పలరాజుతో ములాఖత్ అవ్వాలని నిర్ణయించారని చెబుతున్నారు.