పవన్ విషయంలో జగన్ ఎందుకలా ?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ మధ్య కాలంలో మీడియా సమావేశాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. అంతే కాదు ఆయన ఎక్కడికి అయినా పర్యటనలకు వెళ్ళినప్పుడు కూడా మీడియాను అడ్రస్ చేస్తున్నారు. అయితే ఆయన ఫోకస్ అంతా చంద్రబాబు ఆ తరువాత లోకేష్ మీదనే పెడుతున్నారని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ కూటమిలో మిత్రులు అయిన జనసేన బీజేపీ గురించి పెద్దగా ప్రస్తావించడం లేదు అని గుర్తు చేస్తున్నారు ఇక ఏ మాత్రం వీలు అయితే కేంద్ర ప్రభుత్వం అంటూ ఒకటి రెండు మంచి మాటలు చెబుతున్నారు. మరి దీని వెనక జగన్ రాజకీయ వ్యూహం ఏమిటి అన్నదే చర్చగా ఉంది.
పవన్ ఊసే లేకుండా :
ఏపీలో గతంలో అయితే పవన్ ని వైసీపీ ఎంతో ఎక్కువగా విమర్శించింది. తాము అధికారంలో ఉన్న అయిదేళ్ళ కాలంలో పవన్ ని బాగా టార్గెట్ చేసింది. ఇక దశలో అయితే చంద్రబాబుని పక్కన పెట్టి మరీ పవన్ నే లక్ష్యంగా చేసుకున్నారు. దాని ఫలితం ఏమిటి అన్నది 2024 ఎన్నికలు రుజువు చేశాయి. పవన్ ని వైసీపీ అప్పట్లో అంతగా విమర్శించడానికి కారణం ఆయన పార్టీని లైట్ తీసుకోవడం. అంతే కాదు అతి ధీమాగా ఉండడం. కానీ పవన్ ని అంటే ఒక బలమైన సామాజిక వర్గం మండిపోతుంది అన్నది వైసీపీకి అర్ధం అయ్యేసరికి పుణ్య కాలం గడచిపోయింది. దాంతో సీఎం గా ఉన్నపుడు జగన్ వ్యక్తిగత విషయాల మీద కూడా విమర్శలు చేసిన జగన్ గత పదహారు నెలలుగా విపక్షంలో ఉన్నపుడు మాత్రం ఆయన ఊసే ఎత్తడం లేదు.
వ్యూహాత్మకంగానే :
ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. అయితే అందులో జనసేనకు 21 సీట్లు బీజేపీకి 8 సీట్లు ఉన్నాయి. ఇక మిగిలిన 135 సీట్లు టీడీపీకే ఉన్నాయి. టీడీపీ అలా పెద్దన్నగా ఉంది. ఇక మొత్తం మంత్రులలో 20 మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక ప్రభుత్వంలో ఆధిపత్యం కూడా ఎక్కువగా టీడీపీదే అవుతోంది. దాంతోనే టీడీపీనే వైసీపీ వ్యూహాత్మకంగా టార్గెట్ చేస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే పవన్ ని విమర్శించడం వల్ల లాభం పెద్దగా లాభం ఏమీ లేకపోగా భారీగా నష్టం అయితే వాటిల్లుతోందని కూడా అంచనా వేస్తోంది.
ఆ సామాజిక వర్గం కోసం :
ఏపీలో రాజకీయం మారాలంటే బలమైన కాపు సామాజిక వర్గం చేతిలోనే ఉంది. మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో 70 దాకా ప్రభావితం చేసే సత్తా కాపులలో ఉంది. వారు ఎవరిని కరుణిస్తే వారే సీఎం చెయిర్ లో కూర్చుంటారు 2014లో టీడీపీకి మద్దతు ఇచ్చిన కాపులు 2019 నాటికి వైసీపీ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకున్నారు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి మొత్తానికి జై కొట్టేశారు. దాంతో వైసీపీకి దారుణమైన ఫలితాలు వచ్చాయి. అయితే ప్రతీ ఎన్నికకూ కాపులు తమ నిర్ణయాన్ని మార్చుకుంటారు. ఆ విధంగా ఏపీలో ఒక ట్రాక్ రికార్డు అయితే 1983 నుంచి ఉంది. అందుకే 2029 ఎన్నికల మీద ఆశతో ఉన్న వైసీపీ కాపులను దగ్గర చేసుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలో వారు ఎంతగానో అభిమానించే పవన్ కళ్యాణ్ విషయంలో సైలెంట్ గా ఉండడమే బెటర్ అని వైసీపీ అధినాయకత్వం ఉందని అంటున్నారు.
మీడియా ప్రశ్నకు అలా :
ఇక తాజాగా తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఒక విలేకరి కీలక ప్రశ్న సంధించారు. చిరంజీవి సహా సినీ ప్రముఖులు జగన్ సీఎం గా ఉన్న కాలంలో వచ్చి కలిసారని, అయితే వారికి సరైన గౌరవం దక్కలేదని అప్పట్లో పవన్ సహా అంతా విమర్శించారు కదా అని అడిగారు. తాజాగా అసెంబ్లీలో బాలయ్య వ్యాఖ్యలను కూడా ప్రస్తావిస్తూ ఆ విలేకరి అడిన ప్రశ్నకు జగన్ మాత్రం బాలయ్య వ్యాఖ్యల మీదనే వివరణ ఇచ్చి ఊరుకున్నారు. సినీ ఇండస్ట్రీ మొత్తం యాంటీ అవడానికి అప్పట్లో జరిగిన ప్రచారం గురించి ఆయన ప్రస్తావించినా జగన్ వాటి జోలికి పోలేదు. దీనికి కారణాలు ఏమై ఉంటాయన్నది చూస్తే ఏకంగా మెగాస్టార్ చిరంజీవే బాలయ్య వ్యాఖ్యలను ఖండించి జగన్ బాగానే చూసుకున్నారు అని చెప్పారు. పైగా అప్పట్లో పవన్ సహా అంతా చేసిన విమర్శల గురించి ఇపుడు మరోసారి తవ్వుకోవడం అనవసరం అన్నట్లుగానే ఆయన వాటిని వదిలి పెట్టి ఉంటారు అన్న చర్చ అయితే సాగుతోంది. మొత్తానికి వైసీపీ మాత్రం ఈసారి కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా సామాజిక కోణంతో పాటు ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.