జగన్ ఓదార్పు మళ్ళీ అక్కడికే వచ్చిందా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలకు పెట్టింది పేరు. ఓదార్పుకూ ఒక యాత్ర ఉంటుందని దానికి అంత ఫోకస్ ఉంటుందని జగనే నిరూపించి చూపారు;

Update: 2025-07-03 03:58 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఓదార్పు యాత్రలకు పెట్టింది పేరు. ఓదార్పుకూ ఒక యాత్ర ఉంటుందని దానికి అంత ఫోకస్ ఉంటుందని జగనే నిరూపించి చూపారు. జగన్ నే జనాలు ఓదార్చాలో లేక ఆయన జనాలను ఓదార్చాలో తెలియదు కానీ జగన్ రాజకీయానికి మాత్రం మంచి ఓదార్పు దొరికింది అని అంతా నాడు అనుకున్నారు.

మొత్తానికి ఏదైతేనేమి జగన్ 151 సీట్లను సాధించి ఏపీకి సీఎం అయిపోయారు. అయిదేళ్ళ పాటు ఆయన పాలించారు. ఇపుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ఇక భారీ ఓటమి తరువాత తేరుకుని జగన్ వైసీపీకి అచ్చి వచ్చిన ఓదార్పులకు శ్రీకారం చుట్టారు. కానీ ఈసారి అయితే పెద్దగా కలసి రావడం లేదు అని అంటున్నారు. ఆయన తెనాలి వెళ్తే దాని మీద వివాదాలు ముసురుకున్నాయి, పొదిలి వెళ్తే దాని మీద రచ్చ జరిగింది రెంటపాళ్ళ వెళ్తే ఏకంగా కారు కింద వైసీపీ కార్యకర్త సింగయ్య పడి మృతి చెందారు.

అది పెద్ద రాజకీయ దుమారాన్నే రేపింది. జగన్ నే ఏటూ గా పేర్కొంటూ కేసులు పెట్టారు. సీబీఐ కేసులు తప్ప జగన్ మీద వేరే కేసులు లేవు ఇపుడు తొలిసారి కూటమి పాలనలో కేసు పడింది. ఇలా చూస్తే కనుక జగన్ నెల్లూరు వెళ్ళి జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలని అనుకున్నారు. కానీ తన హెలికాప్టర్ దిగేందుకు సురక్షితమైన ప్లేస్ ని చూపించలేదు అని వాయిదా వేసుకున్నారు. దాని మీద వైసీపీ కోర్టులో కేసు కూడా వేసింది.

విషయం అలా ఉంటే జగన్ ఇపుడు ఓదార్పులైనా పరామర్శలు అయినా తాడేపల్లిలో చేసేందుకు సిద్ధపడ్డారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే రెంటపాళ్ళలో తన పర్యటనలో సింగయ్య మృతి చెందితే ఆయన భార్యను కుటుంబ సభ్యులను తన వద్దకే పిలిపించుకుని జగన్ వారిని ఓదార్చారు. వారికి అండగా ఉంటామని చెప్పారు పార్టీ తరఫున పది లక్షల సాయం కూడా చేశారు.

నిజానికి వైసీపీ మార్క్ ఓదార్పు అయితే ఇది కాదు. స్వయంగా బాధితుల ఇంటికి వెళ్లాలి. వారిని పరామర్శించి రావాలి. ఇక్కడే అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి యూపీయే చైర్ పర్సన్ సోనియా గాంధీతో కూడా జగన్ విభేదించడం జరిగింది. తన తండ్రి వైఎస్సార్ మరణాన్ని తట్టుకోలేక చాలా మంది చనిపోయారు.

దాంతో వారందరినీ పరామర్శించాలని జగన్ పట్టుబట్టారు. ఇంటింటికీ వెళ్ళి ఓదారుస్తాను అని ఆయన అన్నారని ప్రచారం సాగింది. అయితే కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం అందరినీ ఒకే చోటకు చేర్చి వారిని ఓదార్చమని చెప్పింది. అక్కడే విభేదించిన జగన్ కాంగ్రెస్ ని వీడి బయటకు వచ్చారు. అదే ఆయన జీవితానికి రాజకీయ జీవితానికి అతి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది.

మరి ఇన్నాళ్ళకు ఇపుడు చూస్తే సరిగ్గా అదే జగన్ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. బాధితులను తన వద్దకే పిలిపించుకుని జగన్ పరామర్శించారు. జగన్ పర్యటనకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోంది అని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి ఇలాగే ముందు ముందు జరిగితే ఓదార్పు కేరాఫ్ తాడేపల్లిగానేనా అన్న చర్చ వస్తోంది. మరి అలాంటి పరిస్థితి ఉంటే జగన్ బయటకు రావడం కూడా కష్టమైపోతుంది కదా అన్నది మరో చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో. మొత్తం మీద చూస్తే భూమి గుండ్రంగా ఉంది అన్నట్లుగా ఓదార్పుతోనే కాంగ్రెస్ తో బద్ధ వైరం వచ్చి బయటకు వచ్చిన జగన్ ఓదార్పు ఇపుడు మళ్ళీ అక్కడికే వచ్చిందా అన్నది అంతా చర్చిస్తున్నారు.

Tags:    

Similar News