జగన్ నెల్లూరు పర్యటన రద్దు.. కారణం అదేనా?

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు జగన్ అనుమతి కోరారు.;

Update: 2025-07-02 12:38 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి నెల్లూరు జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 3వ తేదీ గురువారం జగన్ నెల్లూరు పర్యటనకు ముందుగా షెడ్యూల్ ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన అక్రమ మైనింగు కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించాలని భావించారు. అయితే హెలీపాడ్ ఎంపిక విషయంలో వైసీపీ, పోలీసులకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో జగన్ పర్యటన వాయిదా వేసుకున్నారు.

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ములాఖత్ అయ్యేందుకు జగన్ అనుమతి కోరారు. దీనికోసం జైలుకు సుమారు పది కిలోమీటర్ల దూరంలో హెలిపాడ్ ఏర్పాటుకు అక్కడి నుంచి ర్యాలీగా జైలుకు వచ్చేందుకు వైసీపీ నేతలు అనుమతి కోరారు. అయితే వైసీపీ వినతిని పరిశీలించిన పోలీసులు జగన్ వచ్చే హెలికాప్టర్ కోసం సెంట్రల్ జైలు సమీపంలో హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అయితే అక్కడ హెలిపాడ్ ఏర్పాటు చేయడం వల్ల జగన్ ప్రజలను కలిసే అవకాశం ఉండదని భావించిన వైసీపీ పోలీసుల ప్రతిపాదనను తిరస్కరించింది. అంతేకాకుండా హైటెన్షన్ విద్యుత్ వైర్లు ఉన్నాయని, తుప్పలు ఎక్కువగా ఉండటం, రోడ్డు వసతి లేకపోవడంతో పోలీసులు సూచించిన చోట హెలిపాడ్ నిర్మాణం సాధ్యం కాదని వైసీపీ చెబుతోంది. దీనిపై కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తోంది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల ద్వారా ప్రయత్నాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది.

తాము అధికారంలో ఉండగా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ పర్యటనలు అడ్డుకున్నామా? అంటూ ప్రశ్నిస్తోంది. అయితే గత నెల 18న జగన్ పల్నాడు పర్యటనకు వెళ్లిన సమయంలో ముగ్గురు మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలను దృష్టిలో పెట్టుకుని జగన్ పర్యటన ప్రశాంతంగా ముగిసేలా జైలుకు సమీపంలోనే హెలిపాడ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు పోలీసులు చెబుతున్నారు. దీంతో జగన్ నెల్లూరు పర్యటన మరోమారు అధికార, విపక్షాల మధ్య వాడివేడి మాటల యుద్ధానికి తెరలేపింది.

Tags:    

Similar News