జగన్ టూర్ లో బోలెడు ట్విస్టులు

ఈసారి పరామర్శలు ఓదార్పులు కాదు, ఏకంగా ఒక ప్రజా సమస్య మీద ఆయన జనం మధ్య నుంచి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు అని చెబుతున్నారు;

Update: 2025-10-06 22:30 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ జనంలోకి వస్తున్నారు. ఈసారి పరామర్శలు ఓదార్పులు కాదు, ఏకంగా ఒక ప్రజా సమస్య మీద ఆయన జనం మధ్య నుంచి ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు అని చెబుతున్నారు. వైసీపీ హయాంలో కొత్తగా పదిహేడు మెడికల్ కాలేజీలకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకుని వచ్చి అందులో అయిదారింటిని పూర్తి చేశారు. మిగిలిన వాటిని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల మీద వైసీపీ ఫైర్ అవుతోంది. దీని మీద నెలన్నర క్రితమే మీడియా ముందు మాట్లాడిన జగన్ ఇపుడు అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలోని మాకవరం లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీని సందర్శించబోతున్నారు.

భారీ రోడ్ షోతో :

అయితే జగన్ నర్శీపట్నం టూర్ ని వేరే లెవెల్ లో డిజైన్ చేశారు ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు. ఈ టూర్ లో జగన్ ఏకంగా అరవై కిలోమీటర్ల భారీ రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో అనకాపల్లి జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ సాగుతుంది. విశాఖ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అనకాపల్లికి ఈ నెల 9న చేరుకోనున్న జగన్ అక్కడ నుంచి మొదలయ్యే రోడ్ షోలో పాల్గొంటారు. ఈ రోడ్ షో తరువాత నర్శీపట్నం వెళ్ళి మెడికల్ కాలేజీని సందర్శించడం కాకుండా అక్కడ తల్లిదండ్రులు విద్యార్ధులతో ఆయన మాట్లాడుతారని ప్రభుత్వం మీద విమర్శలు అక్కడ నుంచే చేస్తారు అని అంటున్నారు.

వీరితో భేటీలు :

ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవుతోందని వైసీపీ చెబుతోంది. గత ఏడాదిన్నర కాలంలో పదివేల మంది దాకా కార్మికులను తీసేశారు అని చెబుతోంది. ప్లాంట్ లోని కీలక విభాగాలను ఆపరేషన్ చేసేందుకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించబోతున్నారు అని అంటున్నారు. దాంతో జగన్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలతో కూడా భేటీ అయి ప్లాంట్ విషయంలో వైసీపీ స్టాండ్ ని మరోసారి వినిపిస్తారు అని అంటున్నారు. ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దని డిమాండ్ చేస్తారు అని అంటున్నారు.

బల్క్ డ్రగ్ పార్క్ మీద :

పాయకరావుపేట నక్కపల్లి లో ఏర్పాటు చేస్తున్న బల్క్ డ్రగ్ పార్క్ ని కూడా తీసేయాలని మత్స్యకార సంఘాలు కోరుతున్నాయి. వారితో జగన్ భేటీ అవుతారని అంటున్నారు. బల్క్ డ్రగ్ ప్లాంట్ వద్దు అని వైసీపీ తరఫున ఆయన మరో డిమాండ్ చేయబోతున్నారు అని అంటున్నారు. కాలుష్యంతో ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన ఈ పరిశ్రమ ఏర్పాటు తో స్థానికుల ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని వైసీపీ అంటోంది.

ఆ ముగ్గురూ టార్గెట్ నా :

ఇక నర్సీపట్నంలో జగన్ టూర్ రాజకీయంగా ఏ రకమైన చర్చకు తావిస్తుంది అన్నది అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఉన్నారు. వైసీపీకి విపక్ష హోదా ఇవ్వమని చెబుతున్నారు. దాంతో అయ్యన్న విషయంలో వైసీపీ అధినేత ఏ కామెంట్స్ చేస్తారు అన్నది చూడాలంటున్నారు. ఇక పాయకరావుపేట హోం మంత్రి నియోజకవర్గంలో ఉంది. దాంతో వంగలపూడి అనితను కూడా ఈ సందర్భంగా టార్గెట్ చేయబోతున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఉంది. దాంతో ఆయనను ఆ విధంగా టార్గెట్ చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి జగన్ టూర్ లో అనేక ట్విస్టులు ఉన్నాయి వాటికి చూసేందుకు వేచి ఉండండి అని వైసీపీ నేతలు అయితే ఉత్సాహంగా చెబుతున్నారు. మరి అవి ఏమిటో చూడాలి అంటే తొమ్మిదవ తేదీ దాకా వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News