నో మీటింగ్.. ఓన్లీ రైటింగ్.. వైసీపీ అధినేత తీరుపై కేడర్ విస్మయం!
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీరుపై కేడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది. కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులకు జగన్ అందుబాటులో ఉండకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు.;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి తీరుపై కేడర్ విస్మయం వ్యక్తం చేస్తోంది. కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులకు జగన్ అందుబాటులో ఉండకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందని అంటున్నారు. అధినేతను కలిసేందుకు తాడేపల్లి వస్తున్న కార్యకర్తలు, నాయకులతో అక్కడి ఆఫీస్ బేరర్లు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. తమ సమస్యలను అధినేతతో చెప్పుకునేందుకు వస్తే.. విషయం ఏదైనా డిజిటల్ బుక్ లో నమోదు చేయండి చాలు.. జగన్ చూస్తారంటూ వైసీపీ ప్రధాన కార్యాలయంలో చెబుతుండటంతో కార్యకర్తలు విస్తుపోతున్నారు.
కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు, వారికి జరిగిన నష్టాన్ని అధికారంలోకి వచ్చాక భర్తీ చేస్తామని భరోసా కల్పించేందుకు వైసీపీ అధినేత జగన్ డిజిటల్ బుక్ అనే కాన్సెప్ట్ ను తీసుకువచ్చారు. గత నెలలో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో ఈ విషయమై ప్రకటన చేసిన జగన్.. ప్రభుత్వం, కూటమి నేతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు పార్టీ వెబ్ సైటులో నమోదు చేయాలని సూచించారు. వైసీపీ వెబ్ సైటులో నమోదు చేసిన ఫిర్యాదులను అధికారంలో వచ్చాక పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అయితే కేడర్ లో ఆత్మస్థైర్యం నింపడానికి జగన్ ‘డిజిటల్ బుక్’ తేవడాన్ని అంతా స్వాగతిస్తున్నా, ఆ పేరుతో తమను కలవకుండా అడ్డుకోవడాన్ని తప్పుబడుతున్నారు. కొన్ని విషయాలు యాప్ లో నమోదు చేయలేని అంశాలను అధినేత ద్రుష్టిలో పెట్టాలని భావించేవారికి ఆ ప్రయత్నం దుర్లభమవుతోందని అంటున్నారు. గతంలో టీడీపీ కూడా విపక్షంలో ఉండగా, ఇలా డిజిటల్ యాప్‌ను తీసుకొచ్చిందని, అంతేకాకుండా ఆ పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ కేడర్ ను కలుస్తూ వారి ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేవారని గుర్తు చేస్తున్నారు. కానీ, జగన్ తనను ఎవరూ కలవకుండా చుట్టూ గోడలు నిర్మించుకోవడం వల్ల కార్యకర్తలతో గ్యాప్ పెరిగిపోతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవల గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు పార్టీ ఆఫీసుకు వస్తే.. వారి సమస్యలు తెలుసుకోవాల్సిన వారు “డిజిటల్ బుక్‌లో నమోదు చేశారా? లేదా చెయ్యకపోతే నమోదు చేయండి చాలు” అంటూ వెనక్కి పంపారని చెబుతున్నారు. అదేవిధంగా అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల నాయకులకు కూడా ఇదే అనుభవం ఎదురైందన అంటున్నారు. డిజిటల్ బుక్ పెట్టడం తప్పు కాదు. కానీ తమ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించాలని వైసీపీ కార్యకర్తలు కోరుతున్నారు.
అయితే వైసీపీ అధినేత జగన్ కోసం పూర్తిగా తెలిసిన వారు కార్యకర్తల ఆశలు నెరవేరే పరిస్థితి లేదని అంటున్నారు. జగన్ తొలి నుంచి కూడా ఒకరి మాట వినేరకం కాదని గుర్తుచేస్తున్నారు. ఆయన ఏం అనుకుంటారో అదే చేస్తారని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ పుంజుకోవడం కష్టమనే వాదన వినిపిస్తున్నారు. ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎన్ని యాప్‌లు ఉన్నా ముఖాముఖిగా నాయకుడితో మాట్లాడితే కలిగే సంతృప్తి కార్యకర్తలకు ఎక్కువ ఉంటుందని అంటున్నారు.