వైసీపీ వైపు నాన్ ఎన్డీయే వర్గాలు
| ఓబీసీ కుల గణనకు మద్దతుగా నవంబర్ 28న ఢిల్లీలో జరిగే భారీ ర్యాలీకి వైఎస్ జగన్‌కు ఆహ్వానం అందింది. 60కి పైగా ఓబీసీ సంఘాలు పాల్గొనే ఈ కార్యక్రమానికి వ్యక్తిగతంగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. నాన్ ఎన్డీయే పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా జగన్‌కు ఆహ్వానం అందడం ఏపీ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది.
వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఎన్డీయేకు దూరం జరుగుతారా అన్న చర్చ ఒక వైపు సాగుతూంటే నాన్ ఎన్డీయే కూటమి వైపుగా ఆయన నడుస్తారా మరో చర్చగా ఉంది. ఇటీవల కాలంలో జాతీయ స్థాయిలో చోటు చేసుకుంటున్న అనేక పరిణామాలు ఏపీ రాజకీయాలను సైతం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఏపీలో ఎన్డీయే కూటమి మాత్రమే ఉంది. నాన్ ఎన్డీయే అలయెన్స్ అయితే లేదు. కానీ ఇపుడు మారుతున్న జాతీయ రాజకీయ సమీకరణల్లో ఏపీలో నాన్ ఎన్డీయే కూటమి బలపడాలని కోరుకుంటున్న వారికి వైసీపీ కేంద్ర బిందువుగా కనిపిస్తోంది. దాంతో వారంతా జగన్ ని కలుస్తున్నారు.
ఓబీసీ జనాభా గణన డిమాండ్ :
ఇదిలా ఉంటే దేశంలో ఓబీసీ జనాభా గణన చేపట్టాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఇక ఈ నేపధ్యంలో ఈ డిమాండ్ సాధనలో భాగంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఆహ్వానం అందింది. అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధులు జగన్‌ను తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో కలిసి నవంబర్ 28న న్యూఢిల్లీలో జరగనున్న భారీ నిరసన ప్రదర్శనలో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన జరపాలని జరుగుతున్న డిమాండ్‌కు వైసీపీ తరఫున మద్దతు తెలిపారు.
వ్యక్తిగతంగా హాజరు :
ఇదే సందర్భంలో వెనుకబడిన తరగతులు ఇతర వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ హక్కులను పరిరక్షించడానికి ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ర్యాలీ చేపడుతున్నారు. ఈ జాతీయ స్థాయి ర్యాలీకి వ్యక్తిగతంగా హాజరు కావాలని వారు జగన్‌ను కోరారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశవ్యాప్తంగా ఉన్న 60 కి పైగా ఓబీసీ సంస్థలతో పాటు, కాశ్మీర్ నుండి కేరళ వరకు విస్తరించి ఉన్న ఇతర ప్రాంతాల నుంచి బీసీలు ఓబీసీలు ఈ ర్యాలీకి హాజరవుతున్నారని కమిటీ ప్రతినిధులు చెబుతున్నారు.
అందరినీ ఏకత్రాటిపైకి :
ఓబీసీ జనాభా గణన ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీఏ యేతర రాజకీయ పార్టీల మద్దతును సమీకరించేందుకు కూడా తమ కమిటీ ప్రయత్నిస్తోందని ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్, మాజీ మండల్ కమిషన్ చైర్మన్ బిపి మండల్ మనవడు సూరజ్ మండల్ తెలిపారు. రాబోయే జాతీయ జనాభా గణనలో ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ప్రవేశపెట్టాల్సిన అవసరాన్ని ప్రొఫెసర్ సూరజ్ మండల్ నొక్కి చెప్పారు. ప్రతి కులాన్ని సరిగ్గా గుర్తించి, వారి జనాభాను ఖచ్చితంగా నమోదు చేసేందుకు ప్రతి కులం పేర్లతో కూడిన డ్రాప్-డౌన్ మెనూను ఏర్పాటు చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వివిధ వర్గాల జనాభాకు అనుపాతంగా రిజర్వేషన్ ప్రయోజనాలు అందేలా చూడటానికి ఇంతటి సమగ్రమైన సమాచారం అవసరమని ఆయన అన్నారు.
ఎస్సీ ఎస్టీ తరహాలోనే :
ఇక దేశంలో షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల కోసం చేపట్టిన జనాభా గణన తరహాలోనే అన్ని ఓబీసీ వర్గాలను కలుపుకొని సమగ్ర కుల గణన చేపట్టాలని ఆయన కోరారు. అలాగే వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు కూడా నమోదు చేయాలని తమ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని ప్రొఫెసర్ సూరజ్ మండల్ అన్నారు. కోర్టులలో బీసీ రిజర్వేషన్ నిబంధనలను పరిరక్షించడానికే కాకుండా రిజర్వేషన్లపై ప్రస్తుతం ఉన్న 50 శాతం పరిమితిని సవాలు చేసే డిమాండ్‌ను కొనసాగించడానికి కూడా విశ్వసనీయమైన కుల గణన సమాచారం చాలా కీలకమని పేర్కొన్నారు. ఖచ్చితమైన జనాభా గణాంకాలు లేకపోవడం వల్ల, తగిన రాజకీయ, విద్యా, ఉపాధి ప్రాతినిధ్యం కోసం తమ డిమాండ్లను నిరూపించుకునే ఓబీసీ వర్గాల సామర్థ్యం బలహీనపడిందని ఆయన అన్నారు.