చిన్న సైజులో ఎలక్ట్రిక్ డిఫెండర్.. 2027లో రాక!
| ల్యాండ్ రోవర్ నుంచి చిన్న ఎలక్ట్రిక్ డిఫెండర్ ఎస్‌యూవీ రాబోతోంది. ప్రస్తుత మోడళ్ల కంటే చిన్నగా 4.5 మీటర్లకు పైగా పొడవుతో రూపొందుతున్న ఈ వాహనం ఉత్పత్తి 2027 చివర్లో ప్రారంభం కానుంది. రెండు ఎలక్ట్రిక్ మోటార్లు, ఫోర్ వీల్ డ్రైవ్‌తో ఆఫ్‌రోడింగ్ సామర్థ్యాన్ని కొనసాగించేలా అభివృద్ధి చేస్తున్నారు. భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకురావాలని JLR భావిస్తోంది.
ల్యాండ్ రోవర్ డిఫెండర్ అంటే గుర్తొచ్చేది దాని భారీ రూపం, కఠినమైన రోడ్లపై దూసుకెళ్లే సామర్థ్యం. ఇప్పుడు ఈ బ్రాండ్ నుంచి అలాంటి లక్షణాలతోనే ఓ చిన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రాబోతోంది. ప్రస్తుత డిఫెండర్ మోడళ్ల కంటే చిన్నగా ఉండే ఈ కొత్త వాహనాన్ని జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) అభివృద్ధి చేస్తోంది.
కొత్త మోడల్ పొడవు సుమారు 4.5 మీటర్లకు కొంచెం ఎక్కువగా ఉండొచ్చని సమాచారం. కంపెనీ ఇంకా అధికారిక పేరును ప్రకటించలేదు. అయితే ఆటోమొబైల్ వర్గాల్లో 'డిఫెండర్ స్పోర్ట్', 'డిఫెండర్ 80' పేర్లు వినిపిస్తున్నాయి.
JLR అధిపతి పీబీ బాలాజీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్పత్తి 2027 చివర్లో ప్రారంభం కానుంది. డిఫెండర్, డిస్కవరీ బ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ కామెరూన్ కూడా ఈ ప్రాజెక్ట్ పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు.
ఆఫ్‌రోడింగ్ విషయంలో రాజీ ఉండదా?
పరిమాణం తగ్గినా డిఫెండర్‌కు ఉండే ఆఫ్‌రోడింగ్ సామర్థ్యాన్ని కొనసాగించాలన్నది కంపెనీ లక్ష్యం. కొత్త ఎలక్ట్రిక్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్‌పై ఈ వాహనాన్ని తయారు చేస్తున్నారు. కఠినమైన చలి, ఎండ పరిస్థితుల్లోనూ వాహన పనితీరును పరీక్షిస్తున్నారు.
ఇందులో ముందు, వెనుక రెండు ఎలక్ట్రిక్ మోటార్లు ఉండే అవకాశం ఉంది. అదే జరిగితే ఫోర్ వీల్ డ్రైవ్ సదుపాయం లభిస్తుంది. బ్యాటరీ సామర్థ్యం, ఒక్కసారి ఛార్జింగ్‌తో ప్రయాణించే దూరం వంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు.
ఎలక్ట్రిక్ మోడల్‌తో పాటు భవిష్యత్తులో హైబ్రిడ్ వెర్షన్‌ను కూడా తీసుకురావాలని JLR పరిశీలిస్తోంది. చిన్న సైజులో డిఫెండర్‌ను కోరుకునే వారికి ఈ కొత్త మోడల్ మంచి ప్రత్యామ్నాయంగా నిలవొచ్చు.