యూట్యూబ్ స్వాముల ప్రవచనాలు.. దుర్గగుడికి పోటెత్తుతున్న భక్తులు, కొత్త వివాదాలు
యూట్యూబ్ లో పుట్టుకొస్తున్న కొత్త ప్రవచన కర్తలు, స్వాములు వల్ల విజయవాడ దుర్గగుడి నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి.;
యూట్యూబ్ లో పుట్టుకొస్తున్న కొత్త ప్రవచన కర్తలు, స్వాములు వల్ల విజయవాడ దుర్గగుడి నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. యూట్యూబ్ తోపాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో కొందరు నకిలీ స్వాములు ప్రచారం వల్ల దుర్గ గుడిపై రోజురోజుకు ఒత్తిడి పెరిగిపోతోందని అంటున్నారు. దుర్గ గుడిలో పారాయణం చేయాలని, పూజలు పెట్టాలని, ప్రసాదాలు పంచాలని ఎవరికి తోచిన విధంగా వారు ప్రచారం చేస్తున్నారు. కాషాయ దుస్తుల్లో కనిపిస్తున్న ఈ నయా స్వాములు చెప్పింది నిజమని భావిస్తున్న భక్తులు దుర్గగుడికి తండోపతండోలుగా తరలివస్తున్నారు. ఇలా వచ్చిన వారు దుర్గ గుడిలో పారాయణం చేయడానికి అనుమతించాలని సెక్యూరిటీ సిబ్బందితో గొడవలకు దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో తోచక అధికారులు నెత్తీనోరు బాదుకుంటున్నారు.
ఇటీవల కాలంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వివాదాలు ఎక్కువయ్యాయి. ఇవి నిర్వహణ లోపం వల్ల తలెత్తిన సమస్యలు కావని చెబుతున్నారు. సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన స్వాముల లీలలు వల్ల తలెత్తుతున్న గొడవలుగా వ్యాఖ్యానిస్తున్నారు. దుర్గగుడిలో పారాయణం చేయాలని, భక్తులకు ప్రసాదం పంపిణీ చేయాలని, కుంకుమ పూజ చేస్తే మంచిదని సోషల్ మీడియా స్వాములు చెబుతున్నారు. వారి చెప్పినదాంట్లో వాస్తవం ఉందో లేదో తెలుసుకోకుండా, భక్తులు గుడ్డిగా వారిని నమ్ముతూ దుర్గగుడికి పోటెత్తుతున్నారు. దీంతో ఇంద్రకీలాద్రిపై కొత్త వివాదాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇటీవల ఎవరో స్వామి చెప్పారని హైదరాబాద్ నుంచి సుమారు వెయ్యి మంది ఒకేసారి దుర్గగుడికి వచ్చి ఆలయంలో పారాయణం చేస్తామంటూ హల్ చల్ చేశారు. దుర్గ గుడిలో నిత్యం జరిగే పూజలు, ఆర్జిత సేవలతోనే అర్చకులకు సమయం సరిపోతోంది. ఇక సోషల్ మీడియా స్వాములు చెబుతున్న పూజలు చేయించాలంటూ కొత్తగా భక్తులు ఒత్తిడి చేస్తుండటంతో అధికారుల తలనొప్పి కడుతోందని ఆవేదన చెందుతున్నారు. దుర్గగుడిలో అలాంటి పూజలు చేయరని అధికారులు చెబుతున్నా, భక్తులు వినడంలేదు. ఫలానా పూజ చేస్తే మంచిందంటూ ఫలానా స్వామి చెప్పారని భక్తులు అడ్డుగోలు వాదనలకు దిగుతున్నారు.
అదేవిధంగా దుర్గగుడిలో రోజూ పారాయణం చేస్తే సమస్యలు తొలుగుతాయని ఎవరో స్వామి చెప్పడంతో మరో 500 మంది గుడిలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడం ఇటీవల జరిగింది. అదేసమయంలో దుర్గగుడిలో ప్రసాదాలు పంచాలని మరో స్వామి పిలుపునిచ్చారట. ఆ స్వామి చెప్పారని ఎక్కడో బయట తయారు చేసిన పదార్థాలను తీసుకువచ్చి గుడిలో పంచుతామంటూ రోజూ ఏదో ఒక గ్రూపు తరఫున భక్తులు హడావుడి చేస్తున్నారు. దుర్గగుడిలో ఐదురకాల ప్రసాదాలను భక్తులకు పంచితే మంచిదని ఎవరో స్వామి చెప్పడంతో ఒక గ్రామానికి చెందిన భక్తులు వందల సంఖ్యలో ఇంద్రకీలాద్రిపైకి తరలిచ్చారు. ఇలా ప్రతిరోజూ ఏదో ఒక స్వామి ప్రభావంతో భక్తులు దుర్గగుడిలో హడావుడి చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది.
భక్తుల భావోద్వేగంతో నకిలీ స్వాములు ఆడుకోవడం ఒక ఎత్తు అయితే వారి కారణంగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో కొత్త వివాదాలు తలనొప్పులు తెస్తున్నాయని అంటున్నారు. ఇలా ఆలయాలకు వస్తున్నవారిని ఎలా అదుపు చేయాలో తెలియడం లేదని అధికారులు, అర్చకులు వాపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎవరు ఏం చెప్పినా నమ్మొద్దని ప్రాధేయపడుతున్నారు. ఆలయాలకు వచ్చే ముందు దైవ సన్నధిలో ఎలాంటి పూజలు చేస్తారు? ప్రసాదాలు పంచుతారు? అన్న విషయాలను అధికారిక వైబ్సైటులో చూసి తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.