భారత అమ్ముల పొదిలోకి.. యాంటిషిప్ హైపర్ సోనిక్ గ్లైడ్ మిసైల్
దేశ అమ్ముల పొదిని ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతో కూడిన ఆయుధాలతో నింపుతోంది భారత ప్రభుత్వం.;
దేశ అమ్ముల పొదిని ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతో కూడిన ఆయుధాలతో నింపుతోంది భారత ప్రభుత్వం. అందులో భాగంగా డీఆర్డీవో దేశీయంగా తొలి లాంగ్ రేంజ్ యాంటిషిప్ హైపర్ సోనిక్ గ్లైడ్ మిసైల్ ను మొదటిసారి తీర్చిదిద్దింది. హైదరాబాద్ లోని అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లేబొరేటరీలో ఈ మిసైన్ అభివృద్ధి చేశారు. 2024లో పరీక్షించారు. ఇందులో విజయం సాధించింది. మరో రెండేళ్లలో సైన్యంలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు కర్నూలుకు చెందిన ప్రసాద్ గౌడ్ డైరెక్టర్ గా గత ఐదేళ్లుగా వ్యవహరిస్తున్నారు. 30 సంవత్సరాల కింద డీఆర్డీవోలో చేరి అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు.
మిసైల్ ప్రత్యేకతలు..
ఈ మిసైల్ సముద్ర జలాల్లో వేగంగా ప్రయాణించే యుద్ధ నౌకలను ఖచ్చితంగా గుర్తించి వంద శాతం ధ్వంసం చేస్తుంది. హైపర్ సోనిక్ వేగంతో ప్రయాణిస్తుంది. శత్రుదేశ నౌకలు గుర్తించేలోపు వాటిని ధ్వంసం చేస్తుంది. ఇందుకోసం ఏరోడైనమిక్ డిజైన్ తో ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ మిసైల్ ను ప్రత్యేకంగా తయారు చేసిన మొబైల్ లాంచర్ నుంచి ప్రయోగిస్తారు. బూస్ట్ అండ్ గ్లైడ్ టెక్నాలజీని ఈ మిసైల్ కు వినియోగించారు. ప్రయోగించిన మరుక్షణమే భారీ వేగంతో దూసుకెళ్తుంది. భూఉపరితలంపై ఉన్న లక్ష్యాలను కూడా ఛేదిస్తుంది. శత్రు దేశాల రాడార్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని గుర్తించలేవు. ఎలాంటి యుద్ధనౌకలనైనా క్షణాల్లో కూల్చేస్తుంది. అతితక్కువ ఎత్తులో ప్రయాణిస్తు లక్ష్యాలను సాధిస్తుంది. ఎలాంటి పేలోడ్ నైనా సరే మోసుకెళ్తుంది.
మిసైల్ ఎందుకు ..
లాంగ్ రేంజ్ యాంటిషిప్ హైపర్ సోనిక్ గ్లైడ్ మిసైల్ రాకతో శత్రదేశాలను ఎదుర్కోవడానికి భారత నేవి సామర్థ్యం మరింత పెరిగింది. ఈ మిసైల్ ఎలాంటి నౌకలనైనా క్షణంలో మట్టుబెట్టగలదు. అది కూడా అత్యంత ఖచ్చితత్వంతో. ఈ మిసైల్ ను రూపొందించడం ద్వారా .. అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంలో, సొంత సామర్థ్యంపైన ఆధారపడటంలో భారత నిబద్ధతను సూచిస్తోంది. రక్షణ వ్యవస్థకు ఈ మిసైల్ చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అత్యాధునిక మిసైల్ లను తయారు చేయడంలో నూతన సాంకేతికతను వినియోగిస్తూ.. భారత్ మరింత ఉన్నత స్థాయికి వెళ్తోంది.
భారత్ వద్ద ఎన్ని మిసైల్స్ ఉన్నాయి..
భారత్ వద్ద దాదాపు 29 రకాల మిసైల్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు ఎయిర్, బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి. కీలకమైన అగ్ని సిరీస్, బ్రహ్మోస్, అస్త్ర మిసైల్స్ ఉన్నాయి. వీటిని డీఆర్డీవో రూపొందించింది. బాలిస్టిక్ మిసైల్స్ లో అగ్ని-V, అగ్ని-VI, పృథ్వి-I, కె-5,కె-6 ఉన్నాయి. క్రూయిజ్ మిసైల్స్ లో బ్రహ్మోస్, ఇండిజినస్ టెక్నాలజీ క్రూజ్ మిసైల్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ లో ఆకాష్, త్రిసూల్ మిసైల్స్ ఉన్నాయి.