187 బస్తాల్లో 10వేల కిలోల పేలుడు పదార్థాలు.. ఎందుకంటే!
భారత గణతంత్ర దినోత్సవాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్న సమాచారం గత వారం రోజులుగా నిఘావర్గాలు చెబుతున్నాయి.;
భారత గణతంత్ర దినోత్సవాన్ని భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్న సమాచారం గత వారం రోజులుగా నిఘావర్గాలు చెబుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా అప్రకటిత హై అలెర్ట్ ప్రకటించారు. ఎక్కడి కక్కడ నిఘాను ముమ్మరం చేశారు. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకునే రాజస్థాన్, జమ్ము కశ్మీర్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్‌లో 187 బస్తాల్లో దాచిన 10 వేల కిలోల పేలుడు పదార్థాలను తనిఖీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
గత ఏడాది జమ్ము కశ్మీర్‌లోని పహల్గాం పర్యాటక ప్రాంతంలో ఉగ్రవాద దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. అనంతరం.. పాక్ కూడా అదేస్థాయిలో దాడులు చేయాలన్న కుట్రలకు తెరదీసిందన్న సమాచారం భారత్‌కు అందింది. ఈ క్రమంలోనే గణతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసే అవకాశం ఉందని ఉప్పందింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు, భద్రతను పెంచారు.
రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఉన్న ఓ పొలం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలను తనిఖీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన పక్కా సమాచారంతో నిఘా ఉంచిన అధికారులు దాడులు చేసి.. 187 బస్తాల్లో ప్యాక్ చేసి ఉంచిన 10 వేల కిలోల అమ్మోనియం నైట్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని వెనుక చాలా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందని అధికారులు తెలిపారు.
అయితే.. నిఘా పెట్టి.. దీనిని ఛేదించామని వెల్లడించారు. ఇదేసమయంలో దీనిని ఏర్పాటు చేసిన వారితోపాటు.. పొలానికి చెందిన రైతులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది మినహా దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి.