53 ఏళ్ల సినీ ప్రస్థానంలో పద్మ శ్రీ..మురళీ మోహన్ స్పందన ఇదే
అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు.;
77వ గణతంత్ర దినోత్సవ వేళ భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు సినీ పరిశ్రమకు ఒక ప్రత్యేక గౌరవం లభించింది. సీనియర్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ మురళీమోహన్ గారిని ఆయన సినీ, సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మశ్రీ పురస్కారం దక్కింది. ఎంతోకాలంగా పద్మ పురస్కారాల కోసం ఆయన పేరు పరిశీలనలో ఉన్నా.. ఆయనకి ఇంత కాలానికి 2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులలో ఆయనకు చోటు దక్కింది. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియో ను రిలీజ్ చేసారు. వ
లేట్‌గా వచ్చినా.. లేటెస్ట్‌గా వచ్చింది- మురళీమోహన్ ఆనందం:
తమ అభిమాన నటుడికి పద్మ పురస్కారం దక్కడంతో అభిమానులు, శ్రేయోభిలాషుల నుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. దీనిపై మురళీమోహన్ స్పందిస్తూ.. "ఎప్పుడో రావాల్సిన అవార్డు ఇప్పుడొచ్చింది అని మిత్రులు అంటుంటే, నేను మాత్రం లేట్‌గా వచ్చినా లేటెస్ట్‌గా వచ్చింది అని చెబుతున్నాను" అంటూ తనదైన శైలిలో చమత్కరించారు. ఏదైనా ఒక గౌరవం కోసం ఎదురుచూసిన తర్వాత అది దక్కినప్పుడు కలిగే అనుభూతి అద్భుతమని, ఈ పురస్కారం తన జీవితంలో ప్రత్యేకమైనదని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వాలకు, పరిశ్రమకు ధన్యవాదాలు:
ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. ఇన్నేళ్లుగా తనను ఆదరించిన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తోటి కళాకారులకు ఈ విజయంలో భాగం ఉందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. త్వరలోనే అధికారికంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన సంతోషాన్ని మరింత వివరంగా పంచుకుంటానని వీడియో సందేశం ద్వారా వెల్లడించారు.
ఐదు దశాబ్దాల కృషికి దక్కిన కిరీటం:
మురళీమోహన్ కేవలం నటుడిగానే కాకుండా ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్‌గా, రాజకీయ నాయకుడిగా అందరికీ సుపరిచితులు. 1973లో 'జగమే మాయ' చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం వందలాది చిత్రాల వరకు సాగింది. ఎక్కువగా కుటుంబ కథా చిత్రాల్లో నటిస్తూ, మహిళా ప్రేక్షకుల్లో విపరీతమైన ఆదరణ పొందారు. ఇక మురళీమోహన్ గారి సినీ ప్రస్థానం దాదాపు 53 ఏళ్లకు పైగా సాగింది. 350కి పైగా చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా ఆయన అందించిన సేవలు వెలకట్టలేనివి. రాజకీయాల్లోనూ ఎంపీగా ప్రజా సేవ చేసిన ఆయన, తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలాది మందికి విద్యను అందిస్తున్నారు. ఈ పద్మశ్రీ పురస్కారం కేవలం ఆయన నటనకే కాదు, ఆయనలోని మానవత్వానికి, సేవా దృక్పథానికి దక్కిన గౌరవంగా అభిమానులు భావిస్తున్నారు. ఈ పురస్కారం ఆయన కీర్తి కిరీటంలో మరో మణిహారంగా నిలిచిపోనుంది.