అమరావతిలో ఫస్ట్ టైమ్.. రికార్డు స్థాయిలో 'గణతంత్రం'
ఏపీ రాజధాని అమరావతిలో కార్యకలాపాలు సాగడం లేదు.. అక్కడంతా నిర్మానుష్యంగానే ఉందంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సర్కారు చెక్ పెట్టింది.;
ఏపీ రాజధాని అమరావతిలో కార్యకలాపాలు సాగడం లేదు.. అక్కడంతా నిర్మానుష్యంగానే ఉందంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు సర్కారు చెక్ పెట్టింది. తాజాగా సోమవారం నాటి 77వ భారత గణతంత్ర దినోత్సవాన్ని(రిపబ్లిక్ డే) అమరావతిలో అంగరంగ వైభవంగా నిర్వహించింది. నాలుగు ఎకరాల స్థలాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది.. ఇక్కడ గణతంత్ర వేడుకల కార్యక్రమాన్ని అత్యంత ఆడంబరంగా నిర్వహించారు.
పలు రాష్ట్ర పథకాలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. వీటిలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యత వహిస్తున్న అటవీ శాఖ శకటం అందరినీ ఆకర్షించింది. ముందు పులిబొమ్మను ఏర్పాటు చేసి.. వెనుక అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను, అడవుల ప్రాధాన్యతను వివరిస్తూ.. రూపొందించిన శకటం.. మంత్రముగ్ధులను చేసింది. అదేవిధంగా ఇన్నోవేషన్, సెమీకండక్టర్, క్వాంటం కంప్యూటింగ్.. ఇలా ఐటీ రంగానికి సంబంధించిన శకటాన్ని ప్రదర్శించారు. పెట్టుబడులకు సంబంధించిన శకటం కూడా వినూత్నంగాఉండడంతో అందరూ ఆసక్తిగా తిలకించారు.
రైతులకు ప్రత్యేక ఆహ్వానం..
గణతంత్ర వేడుకలకు అమరావతి రాజధాని రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వారికి నాలుగు వరుసల్లో కుర్చీలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా తొలి దశ, మలిదశలో భూములు ఇచ్చిన రైతులను ప్రత్యేకంగా ఆహ్వానించి.. వారికి వీక్షించే సౌకర్యం కల్పించారు. అలానే.. త్రివిధ దళాలకు చెందిన రాష్ట్ర స్థాయి సిబ్బంది.. ఎన్ సీసీ కేడట్లు.. కూడా గణతంత్ర వేడుకల్లో తమ ప్రదర్శనలు ఇచ్చారు. రాష్ట్ర పోలీసు విభాగాలకు చెందిన సిబ్బంది కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
గతానికి-ఇప్పటికి..
గణతంత్ర వేడుకల్లో గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా.. మంత్రులు.. అధికారులుపాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్.. మాట్లాడుతూ.. గతానికి .. ఇప్పటికి రాజధాని ప్రాంతంలో గణనీయమైన మార్పు కనిపించిందన్నారు. గతంలో రాష్ట్రం అనేక సమస్యలు ఎదుర్కొందని.. కానీ, ప్రస్తుత పాలకుల దూరదృష్టి.. నిబద్ధత కారణంగా.. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని.. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతోందని తెలిపారు.