దక్షిణాదికి అన్యాయం.. సమాఖ్య స్ఫూర్తికి విఘాతం ?
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విశ్లేషణ ప్రకారం.., లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 821కి పెరిగే అవకాశం ఉంది.;
భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో మరో కీలక ఘట్టానికి తెర లేవబోతోంది. 2031లో జరగనున్న పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) దేశ రాజకీయ చిత్రపటాన్ని సమూలంగా మార్చేయనున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే, ఈ మార్పులు ఒకవైపు ఆనందాన్ని, మరోవైపు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల ఉనికి, ప్రభావం దేశ రాజకీయాల్లో నామమాత్రంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
జనాభా నియంత్రణే శాపమా?
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశాభివృద్ధిలో జనాభా నియంత్రణ కీలకమని భావించిన కేంద్రం, అన్ని రాష్ట్రాలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపును అందిపుచ్చుకున్న దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటకలు క్రమశిక్షణతో జనాభాను నియంత్రించాయి. విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించాయి. కానీ, నేడు అదే క్రమశిక్షణ ఆ రాష్ట్రాలకు రాజకీయంగా శాపంగా మారుతోంది. మరోవైపు, జనాభా నియంత్రణలో విఫలమైన ఉత్తరాది రాష్ట్రాలు కేవలం ‘సంఖ్యా బలం’తో దేశ రాజ్యాధికారాన్ని శాసించే స్థాయికి చేరుకుంటున్నాయి. ఇది ఒక రకంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలను శిక్షించడమే అవుతుంది.
అంకెల్లో అంతరం: ఉత్తరాది వర్సెస్ దక్షిణాది
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి విశ్లేషణ ప్రకారం.., లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం ఉన్న 543 నుంచి 821కి పెరిగే అవకాశం ఉంది. ఈ పెరుగుదల రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి రాష్ట్రం ప్రస్తుత స్థానాలు అంచనా వేసిన కొత్త స్థానాలుపెరుగుదల ఇలా ఉండబోతోంది..
ఏడు ఉత్తరాది రాష్ట్రాలు204, అంచనా వేసిన కొత్త స్థానాలు 362 పెరిగినవి +158. ఉత్తరప్రదేశ్ (ఒక్కటే)లో ప్రస్తుత స్థానాలు 80 కాగా.. అంచనా వేసిన స్థానాలు137, పెరిగినవి +57 మొత్తం దక్షిణాది రాష్ట్రాలు ప్రస్తుత స్థానాలు 129 (సుమారు) పెరగనున్న కొత్త స్థానాలు 153 పెరుగుతున్నవి +24ఈ గణాంకాలను గమనిస్తే, ఒక్క ఉత్తరప్రదేశ్ లో పెరిగే స్థానాల సంఖ్య (57), ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కలిపి పెరిగే స్థానాల (24) కంటే రెట్టింపు కంటే ఎక్కువగా ఉంది. అంటే, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసినా ఢిల్లీ పీఠాన్ని ప్రభావితం చేయలేని పరిస్థితి ఏర్పడనుంది.
సమాఖ్య వ్యవస్థకు సవాల్
భారతదేశం వివిధ సంస్కృతులు, భాషలు, భౌగోళిక పరిస్థితుల కలయిక. అధికారం కేవలం ఒకే ప్రాంతం చేతుల్లో కేంద్రీకృతమైతే, అది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. కేవలం ఉత్తరాది రాష్ట్రాల మద్దతుతోనే ఒక పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంటే, ఇక దక్షిణాది రాష్ట్రాల అవసరాలు, ఆకాంక్షలు, నిధుల కేటాయింపు వంటి అంశాల్లో కేంద్రం ఏ మేరకు స్పందిస్తుందన్నది పెద్ద ప్రశ్నార్థకం. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి భారీగా పన్నులు చెల్లిస్తున్నాయి, కానీ తిరిగి పొందే నిధుల్లోనూ, రాజకీయ ప్రాతినిధ్యంలోనూ వివక్ష ఎదురైతే అది ప్రాంతీయ అసమానతలకు దారితీస్తుంది.రాజకీయ శూన్యత - మౌనం వీడాలిదురదృష్టవశాత్తూ, ఇంత పెద్ద ముప్పు పొంచి ఉన్నా దక్షిణాది రాజకీయ నాయకత్వం ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు. ప్రాంతీయ పార్టీలు తమ స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం మౌనం వహించడం భవిష్యత్తు తరాలకు తీరని అన్యాయం చేసినట్లవుతుంది. పార్లమెంటులో దక్షిణాది గొంతు మూగబోకముందే అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పరిష్కారం దిశగా..
పునర్విభజన అనేది కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, అభివృద్ధి సూచికలు, అక్షరాస్యత, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని జరిగితే బాగుంటుంది. బాగుంటుంది కాదు.. జరగాలి కూడా.. రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని 1971 జనాభా లెక్కల ప్రకారమే కొనసాగించేలా రాజ్యాంగ సవరణ చేయాలి. లేదా, అమెరికా సెనేట్ తరహాలో రాజ్యసభలో అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా సంస్కరణలు తీసుకురావాలి.
ప్రజాస్వామ్యంలో మెజారిటీ ముఖ్యం, కానీ మైనారిటీలో ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాల ప్రయోజనాలను పణంగా పెట్టి సాగే ‘సంఖ్యా రాజకీయాలుఈ’ దేశ సమగ్రతకు మంచివి కావు. 2031 పునర్విభజన దక్షిణాది రాష్ట్రాల ఆత్మగౌరవానికి పరీక్షా సమయం. ఇప్పుడే మేల్కోకపోతే, భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర దయాదాక్షిణ్యాలపై ఆధారపడే మున్సిపాలిటీలుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.