మయన్మార్ లో భారత్ కోవర్ట్ ఆపరేషన్.. ఉల్ఫా అగ్రనాయకులు ఖతం
1979లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఏర్పడింది. అస్సాంకు స్వయం ప్రతిపత్తి కోరుతోంది. భారత సైన్యంతో ఈ సంస్థ గతంలో అనేక సార్లు ఆయుధాలతో తలపడింది.;
భారత సైన్యం మయన్మార్ లో కోవర్టు ఆపరేషన్ నిర్వహించింది. ఈ విషయం శౌర్య చక్ర అవార్డు ప్రకటించడంతో వెలుగులోకి వచ్చింది. లేదంటే ఇలాంటి విషయాలు వెలుగులోకి రావు. మిలిటెంట్లు లక్ష్యంగా 2025లో జులై 11 నుంచి 13 వరకు భారత్-మయన్మార్ సరిహద్దుల్లో సైన్యం ఆపరేషన్ నిర్వహించింది. అస్సాం రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి కోరుతూ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం(ఇండిపెండెంట్) (ఉల్పా(ఐ)) సంస్థ సరిహద్దుల్లో ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తోంది. వీరిని లక్ష్యంగా చేసుకుని క్షిపణి, డ్రోన్ దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఉల్ఫా(ఐ) సంస్థ నాయకులు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది. భారత సైన్యమే దాడి చేసిందని ఉల్ఫా(ఐ) సంస్థ ఆరోపించింది. కానీ అప్పట్లో భారత సైన్యం స్పందించలేదు. కానీ 21వ పారా స్పెషల్ ఫోర్స్ కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘాటాగె ఆదిత్య శ్రీకుమార్ కు కేంద్రం శౌర్య చక్ర అవార్డును ప్రకటించింది. మయన్మార్ లో అత్యంత ఖచ్చితత్వంతో ఆపరేషన్ చేపట్టి మిలిటెంట్ క్యాంప్ ధ్వంసం చేసినందుకు ఈ అవార్డు లభించింది. కానీ దీనిపై పూర్తీ వివరాలు కేంద్రం ప్రకటించలేదు. కేవలం దేశ వ్యతిరేక శత్రు ముఠాల శిబిరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు కేంద్రం ప్రకటించింది.
ఉల్ఫా(ఐ) లక్ష్యం ఏంటి ?
1979లో యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం ఏర్పడింది. అస్సాంకు స్వయం ప్రతిపత్తి కోరుతోంది. భారత సైన్యంతో ఈ సంస్థ గతంలో అనేక సార్లు ఆయుధాలతో తలపడింది. దీంతో 1990 నుంచి ఈ సంస్థను ఉగ్రసంస్థగా భారత ప్రభుత్వం గుర్తించింది. నిషేధించింది. 1980, 90 ప్రాంతంలో ఈ సంస్థకు స్థానిక ప్రజల నుంచి మద్దతు లభించింది. తమ సమస్య ఈ సంస్థ ద్వారా బయటి ప్రపంచానికి తెలుస్తుందని భావించారు. కానీ ఆ తర్వాత ఉల్ఫా(ఐ) అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడటం, విప్లవం పేరుతో ఆయుధాలు స్మగుల్ చేయడం, హింసకు పాల్పడటంతో ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. మద్దతు తగ్గింది.
పాక్, బంగ్లా మద్దతు..
ఉల్ఫా సంస్థకు పాకిస్థాన్, బంగ్లాదేశ్ మద్దతు ఉన్నట్టు ప్రచారం ఉంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ లో బిఎన్పీ-జమాత్ పరిపాలన సమయంలో పాకిస్థాన్ నుంచి ఐఎస్ఐ ఉల్ఫా సంస్థకు మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. ఆయుధాలు సమకూర్చడం, శిక్షణా శిబిరాలు నిర్వహించడం వంటి పనులు చేసినట్టు తెలుస్తోంది. భారత్ కు వ్యతిరేకంగా ఉల్ఫా నిర్వహించే కార్యక్రమాల్లో పాకిస్థాన్ పాత్ర ఉన్నట్టు గతంలో అనేక వార్తలు వచ్చాయి. ఉల్ఫా సంస్థ అగ్రనాయకులకు రక్షణ కల్పించినట్టుగా ప్రచారం జరిగింది. భారత ప్రభుత్వం కూడా ఉల్ఫా ఎదుగుదలలో పాకిస్థాన్ ప్రభుత్వ పాత్రను గమనిస్తూ వచ్చింది. భారత్-మయన్మార్ మధ్య దాదాపు 1600 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సరిహద్దులోని సగైంగ్ ప్రాంతంలో శిబిరాలు నిర్వహిస్తున్న ఉల్పా సంస్థ అగ్రనాయకులను సైన్యం మట్టుబెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా ఆదిత్య శ్రీకుమార్ కు శౌర్య చక్ర ప్రకటించడంతో వెలుగు చూసింది. సాధారణంగా ఇలాంటి ఆపరేషన్లు గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతాయి. బయటి ప్రపంచం దృష్టికి రావు.