అమెరికాలో ఘోర విమాన ప్రమాదం: టేకాఫ్ అవుతుండగానే కుప్పకూలిన ప్రైవేట్ జెట్
ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.;
అమెరికాలో మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మెయిన్ రాష్ట్రంలోని బ్యాంగోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన ఒక ప్రైవేట్ జెట్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలోనే అగ్నిప్రమాదానికి గురై రన్‌వే సమీపంలోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో సిబ్బందితో కలిపి మొత్తం 8 మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.
క్షణాల్లో చుట్టుముట్టిన మంటలు
స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. బాంబా రైడర్ చాలెంజర్ 600 రకానికి చెందిన ట్విన్ ఇంజిన్ జెట్.. రన్‌వేపై వేగంగా దూసుకెళ్తూ గాలిలోకి ఎగిరే క్రమంలో ఒక్కసారిగా ఇంజిన్ ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. పైలట్ విమానాన్ని అదుపు చేసే ప్రయత్నం చేసినప్పటికీ సెకన్ల వ్యవధిలోనే మంటలు విమానం అంతటా వ్యాపించడంతో అది రన్‌వే దాటకముందే కుప్పకూలిపోయింది. ఈ ధాటికి విమానాశ్రయం పరిసరాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.
రంగంలోకి సహాయక బృందాలు
ప్రమాదం జరిగిన వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. విమానంలో చిక్కుకున్న 8 మందిని వెలికితీసి సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే మృతుల సంఖ్యపై విమానాశ్రయ అధికారులు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
టెక్సాస్ లా ఫర్మ్‌కు చెందిన విమానం
ప్రమాదానికి గురైన జెట్ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌కు చెందిన ప్రముఖ లా ఫర్మ్ 'ఆర్నోల్డ్, ఇట్ కిన్’ పేరుతో రిజిస్టర్ అయి ఉంది. ఈ విమానం టెక్సాస్ నుంచి మెయిన్‌కు వచ్చి, తిరిగి ప్రయాణమవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. విమానంలో ప్రయాణిస్తున్న వారు సదరు సంస్థకు చెందిన న్యాయవాదులా లేక క్లయింట్లా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
కారణం వాతావరణమా? సాంకేతిక లోపమా?
ప్రమాదం జరిగిన సమయంలో మెయిన్ ప్రాంతంలో వాతావరణం ప్రతికూలంగా ఉంది. ఆ సమయంలో స్వల్పంగా మంచు కురుస్తోందని.. వింటర్ స్టార్మ్ హెచ్చరికలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ , ఎఫ్ఏఏ సంయుక్తంగా దర్యాప్తు ప్రారంభించాయి. ఇంజిన్‌లో మంటలకు ఇంధన లీకేజీ కారణమా లేదా మంచు ప్రభావం వల్ల సాంకేతిక లోపం తలెత్తిందా అన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం విమానంలోని బ్లాక్ బాక్స్‌ను స్వాధీనం చేసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రమాదంతో అమెరికాలో ప్రైవేట్ విమానాల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.