యోగీ చెప్పిన పొలిటికల్ ఇస్లాం....హాట్ టాపిక్ గా మారనుందా ?
పొలిటికల్ ఇస్లాం. ఈ పదం రాజకీయ పరిభాషలో ఒక విధంగా కొత్తగానే ఉంది. లేదా అతి తక్కువ సార్లు అయినా ఈ పదం చర్చకు వచ్చి ఉండాలి.;
పొలిటికల్ ఇస్లాం. ఈ పదం రాజకీయ పరిభాషలో ఒక విధంగా కొత్తగానే ఉంది. లేదా అతి తక్కువ సార్లు అయినా ఈ పదం చర్చకు వచ్చి ఉండాలి. దాంతో అసలేమిటి ఈ పొలిటికల్ ఇస్లాం అన్న చర్చ అయితే మొదలైంది. దీని గురించి చెప్పిన వారు ఎవరో కాదు బీజేపీ అగ్ర నేత యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్. ఆయన దీని మీద తాజాగా చెబుతూ ఇది చాలా ముప్పు దేశానికి అంటూ ఒక భారీ హెచ్చరికను కూడా చేశారు. దాంతో ఇది దేశంలో మరోసారి హాట్ టాపిక్ గా మారనుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
చర్చ జరగాల్సిందే :
పొలిటికల్ ఇస్లాం మీద దేశంలో చర్చ జరగాలని యూపీ సీఎం యోగీ అంటున్నారు. గోరఖ్‌పూర్‌లో జరుగుతున్న ఆరెస్సెస్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ చత్రపతి శివాజీ, గురుగోవింద్ సింగ్, మహారాణి ప్రతాప్ పొలిటికల్ ఇస్లాం పై పోరాడారని చెప్పుకొచ్చారు. పొలిటికల్ ఇస్లాం ద్వారా దేశాన్ని విడగొట్టే శక్తులను ఉపయోగించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి పొలిటికల్ ఇస్లాం పెను ప్రమాదమని ఆయన అంటున్నారు.
చరిత్రలో పట్టించుకోలేదు :
భారత దేశ చరిత్రలో ఎవరూ పొలిటికల్ ఇస్లాం గురించి పెద్దగా పట్టించుకోలేదని యోగి అన్నారు. చరిత్రలో ఎక్కువగా బ్రిటిష్, ఫ్రెంచ్ వలసదారుల ప్రస్తావన ఉన్నప్పటికీ, పొలిటికల్ ఇస్లాంపై ప్రస్తావన చాలా తక్కువగా వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అయితే పొలిటికల్ ఇస్లాం అన్న దాని ద్వారా దేశాన్ని విడగొట్టేందుకు చాంగూర్ బాబా వంటి శక్తులను ఉపయోగించుకుంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి శక్తుల నుంచి రక్షించేందుకు సమాజాన్ని ఏకం చేసే కృషిని ఆరెస్సెస్ గత వందేళ్ళుగా విజయవంతంగా కొనసాగిస్తోందని యోగి చెప్పుకొచ్చారు.
హలాల్ సర్టిఫికేట్ ఇచ్చాం :
దేశంలో ఎక్కడా లేని విధంగా యూపీలో హలాల్ సర్టిఫికేట్ ఇచ్చామని యోగి చెప్పారు. ప్రభుతం పరంగా ఉత్తర ప్రదేశ్‌లో హలాల్ సర్టిఫికెట్‌ను జారీ చేశామని అన్నారు. ఆశ్చర్యకరమేమంటే హలాల్ సర్టిఫికెట్ ఉన్న వస్తువుల్లో సబ్బులు, దుస్తులు, అగ్గిపెట్టెలు ఉన్నాయని ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే కేంద్రం నుంచి లేదా రాష్ట్రం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కొందరు హలాల్ సర్టిఫికేషన్ పేరుతో ఏకంగా పాతిక వేల కోట్లు పోగు చేశారని ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు చేశారు. ఈ రకంగా సంపాదించిన డబ్బును ఉగ్రవాదం, లవ్ జిహాద్, మతమార్పిడులకు ఖర్చు చేస్తుంటారని యోగి ఆరోపించారు. అందుకే ఏదైనా వస్తువు కొనేటప్పుడు ఎవరు తయారు చేశారో చూసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ఇవన్నీ పక్కన పెడితే పొలిటికల్ ఇస్లాం అని కొత్త చర్చకు యోగి తెర తీశారు. దీని మీద ఇపుడు సెక్యులరిస్టులతో పాటు మేధావుల నుంచి ఏ రకమైన కౌంటర్లు వస్తాయో చూడాల్సి ఉంది.