ఏపీలో టీడీపీ వైసీపీ శ్రేణులు సైలెంట్!
కానీ ఏపీలో టీడీపీ అనేక సార్లు అధికారంలోకి వచ్చింది. వైసీపీ తొలిసారిగా వచ్చింది. ఏ పార్టీ వచ్చినా క్యాడర్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని అంటున్నారు.;
ఏపీలో రాజకీయ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏపీలో ఎన్నికల ముందు మాత్రమే కాదు అయిదేళ్ళు ఎన్నికల గురించే చర్చిస్తూ ఉంటారు. రాజకీయ నాయకత్వాలు కూడా ఎపుడూ చురుకుగా ఉండడం వల్ల క్యాడర్ ని కూడా ఆ దిశగా నడిపిస్తూ ఉంటారు. ఇదిగో ఇవాళో రేపో ఎన్నికలు అన్నట్లుగానే రాజకీయం ఆంధ్రాలో ఉంటుంది.
ఎపుడూ ఢీ అంటే ఢీ కొడుతూ వేడిగా వాడిగా రాజకీయం ఉంటుంది. ఎన్నికలు అయిపోయినా ఎందుకు ఓడారు, వారు ఎందుకు గెలిచారు అన్నదే చర్చ. అలాగే వచ్చే ఎన్నికల్లో వారు గెలుస్తారు, ఈసారి వీరు ఓడతారు అంటూ తమదైన శైలిలో జోస్యాలు చెబుతూ ఉంటారు. ఇలా రాజకీయం అనేది ఏపీలో ప్రతీ రచ్చ బండ దగ్గరా కనిపిస్తుంది.
ఇక రాజకీయ జోస్యాలు చెప్పేవారు ప్రతీ నలుగురిలో ఇద్దరు కచ్చితంగా కనిపిస్తారు. ఏపీలో సినిమాలు రాజకీయం క్రికెట్ ఈ మూడింటి మీద జనాలకు ఉన్న వ్యామోహం మరే దాని మీద ఉండదు అని ఒక అభిప్రాయంగా ఉంటూ వస్తోంది. అంతలా రాజకీయానికి విశేష ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఏపీలో ఎన్నికలు చూస్తే కచ్చితంగా తొమ్మిది నెలల వ్యవధిలోకి వచ్చేశాయి.
ఇలాంటి నేపధ్యం ఉన్న వేళ రాజకీయ క్యాడర్ ఎలా ఉండాలి. అగ్గి బరాటాలుగా మారాలి. కానీ ఏపీలో ప్రధాన పక్షాలలో చూస్తే దిగువ స్థాయి క్యాడర్ అయితే ఏ మాత్రం పట్టింపు లేకుండా ఉన్నారని అంటున్నారు. అంతే కాదు నిస్తేజం అయ్యారని అంటున్నారు. వారు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారని కూడా అంటున్నారు.
అది అధికార పార్టీ వైసీపీ అయినా విపక్ష పార్టీ టీడీపీ అయినా కూడా ఇదే రకమైన సన్నివేశం కనిపిస్తోంది అని అంటున్నారు. అధికార పార్టీని తీసుకుంటే 2019 తరువాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కానీ క్యాడర్ కి పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని, వారి పాత్ర ఎక్కడా పెద్దగా లేదని మధనపడుతున్న పరిస్థితి ఉంది.
దాంతో చాలా కాలంగా అధికార వైసీపీలో క్యాడర్ స్తబ్దుగా ఉంది అని అంటున్నారు. గ్రామ స్థాయిలో వైసీపీ నాయకులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు అని అంటున్నారు. అన్నీ ఖర్చు పెట్టేసి ఆరిపోయిన వారంతా వైసీపీ ప్రభుత్వంలో నాలుగేళ్ల కాలంలో కూడా ఏ మాత్రం తేరుకోలేకపోయారు అని అంటున్నారు.
ఇక విపక్ష తెలుగుదేశంలోనూ ఇదే రకమైన పరిస్థితి ఉంది. మంత్రులుగా అలాగే అనేక పదవులు నిర్వహించిన వారు అంతా నాలుగేళ్ళుగా సైలెంట్ అయిపోయారు. దాంతో క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో డల్ అయిపోయింది. పార్టీ గురించి పట్టించుకుంటే మా గురించి ఆలోచించేదెవరు అన్న చర్చ కూడా వస్తోందిట.
దాంతో క్యాడర్ అయితే ఎన్నికలు దగ్గరగా వస్తున్నా ఎందుకో మౌన ముద్రలోకి వెళ్ళిపోతోంది. ఇది నిజంగా ప్రమాదకర సంకేతం అని అంటున్నారు. ఏ పార్టెకైనా నాయకులు దండీగా ఉన్నా అడుగున పనిచేసేది కార్యకర్తలే. వారే నేరుగా జనాలతో కనెక్ట్ అయి ఉంటారు.
వారు కనుక ప్రజలతో మమేకం కాకపోతే ఏ పార్టీ కూడా పరుగులు తీయదు. కానీ ఏపీలో టీడీపీ అనేక సార్లు అధికారంలోకి వచ్చింది. వైసీపీ తొలిసారిగా వచ్చింది. ఏ పార్టీ వచ్చినా క్యాడర్ కి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని అంటున్నారు. ఇక అందరూ పనిచేస్తే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయిన వారు ఆ మీదట మంత్రి పదవులు అందుకున్న వారు కూడా తమకంటూ సొంత మనుషులు అనుచరులను పెట్టుకుని వారికి మాత్రమే అన్నీ చూస్తూ మొత్తం క్యాడర్ ని పక్కన పడేస్తున్నాడు అని అంటున్నారు.
ఇలాంటి వారి ఉద్దేశ్యం ఏంటి అంటే ఎన్నికల టైం కి ఎటూ క్యాడర్ వస్తుందని, వారే పనిచేస్తారు అని అంటున్నారు. నిజానికి పార్టీ పట్ల పెంచుకున్న అభిమానంతో ఏమీ ఆశించకుండా పెద్ద ఎత్తున పనిచేసే వారు ఉంటారు. అయితే అలా పనిచేసిన వారికి కూడా డబ్బు కావాలి. ఎపుడైనా వారి అవసరాలూ తీర్చాలి కదా. ఇపుడున్న ట్రెండ్ లో క్యాడర్ అన్న వారే చివరకు అయిపోతున్నారు అన్న విమర్శ ఉంది. అందుకే వారిని ఎన్నికల వేళకు మాత్రమే ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. దీంతోనే నైరాశ్యంలో ఉన్న క్యాడర్ అటూ ఇటూ కూడా ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది అని అంటున్నారు.