ఇప్పుడు అనగలరా.. ఓరి పోట్టొడా అని?

ప్రత్యర్థిని గౌరవించాలి. మర్యాద ప్రదర్శించాలి. అప్పుడు మాత్రమే అతడి బలం ఎంతన్న వాస్తవాన్ని గుర్తించే వీలు ఉంటుంది.;

Update: 2026-02-15 07:30 GMT

ప్రత్యర్థిని గౌరవించాలి. మర్యాద ప్రదర్శించాలి. అప్పుడు మాత్రమే అతడి బలం ఎంతన్న వాస్తవాన్ని గుర్తించే వీలు ఉంటుంది. అందుకు భిన్నంగా విపరీతమైన అహంకారం. తమకు మించినోళ్లు ఎవరు ఉండరనే అతిశయం. తమ తెలివికి మించినోళ్లు ఎవరు రారన్న మైండ్ సెట్ తో ఉంటే.. నోటి నుంచి అడ్డూ అదుపు లేని మాటలే వస్తాయి. దీనికి తోడు కలిసి వచ్చే కాలంలో.. తాము ఏమన్నా తిరుగులేని పరిస్థితి. తాము ఏం చేసినా ప్రశ్నించే ధైర్యం లేకుండా ఉన్న సమయాల్లో భవిష్యత్తు పట్ల మరింత అప్రమత్తంగా ఉంటే.. అలాంటి తిరుగులేని కాలం సుదీర్ఘంగా సాగుతుంది. అందుకు భిన్నంగా అవసరం లేకున్నా నోటికి పని చెప్పటం.. ప్రత్యర్థుల మీద ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకుంటే జరిగే నష్టం ఎలా ఉంటుందో బీఆర్ఎస్ అధినాయకత్వానికి ఇప్పటికైనా అర్థమై ఉండాలి.

ఆసక్తికర అంశం ఏమంటే.. 2023లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ను.. ఆ పార్టీని అన్నీ తానై నడిపించిన రేవంత్ ను తమకు అసలుసిసలు ప్రత్యర్థిగా ఒప్పుకునేందుకు బీఆర్ఎస్ సూపర్ బాస్ కేసీఆర్ కానీ.. చిన్న బాస్ కేటీఆర్ కానీ.. బీఆర్ఎస్ కు అదనపు బలంగా భావించే హరీశ్ కానీ ఒప్పుకోరు. నిజానికి వీరి తీరే పార్టీకి అతి పెద్ద సమస్యగా చెబుతారు. ప్రత్యర్థిని అంచనా వేసే విషయంలో వాస్తవాన్ని మరిచి.. అతిశయంతో తమను తాము అతిగా ఊహించుకోవటం.. తమ బలాన్ని అధికంగా లెక్కలు వేసుకోవటం ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడే గులాబీ పార్టీకి మంచి రోజులు వస్తాయన్న మాట వినిపిస్తోంది.

సీఎం రేవంత్ ను ఉద్దేశించి గులాబీ పార్టీ అధినేతలు ఎన్నెన్ని మాటలు అన్నారో.. ఎంత చులకనగా చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓరి పోట్టోడా అంటూ బాడీషేమింగ్ కు సైతం వెనుకాడలేదు. అయితే.. రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలకు నోటితో మాత్రమే కాదు చేతలతోనూ సమాధానాలు చెప్పేయటం కనిపిస్తుంది. తాజాగా వెల్లడైన స్థానిక ఎన్నికల ఫలితాల తర్వాత అయినా.. బీఆర్ఎస్ అధినాయకత్వం కళ్లు తెరిస్తే మంచిదని చెబుతున్నారు. ఇప్పటికైనా వాస్తవ పరిస్థితుల్ని సరిగా మదింపు చేయాలన్న సూచన బలంగా వినిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు తిరుగులేని అధిక్యత ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు దూరం కావటం.. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ రెండింటిలోనూ బలం అంతకంతకూ తగ్గుతున్న విషయాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే మంచిది. ముఖ్యమంత్రి రేవంత్ ను తక్కుగా అంచనా వేస్తూ.. ఆయన్ను నాలుగు మాటలతో ఇష్టమొచ్చినట్లుగా అనటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని.. ఎన్నికల్లో ఆయన వ్యూహాలకు చెక్ పెట్టి పార్టీ గెలుపొందేలా చేయటమే తమ ముందు ఉన్న పెద్ద టాస్కు అన్న విషయాన్ని గులాబీ పార్టీ నేతలు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. లేదంటే.. ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు చెప్పండి.

Tags:    

Similar News