మళ్లీ పోటీకి రెడీనా స్వామీ ?

రాజకీయం అన్నది తీరని దాహంగానే చెప్పాలి. ఇక్కడ స్వచ్చంద పదవీ విరమణలు బహు తక్కువ. అవకాశాలు లేకపోయినా రాకపోయినా వాటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు.;

Update: 2026-02-15 03:58 GMT

రాజకీయం అన్నది తీరని దాహంగానే చెప్పాలి. ఇక్కడ స్వచ్చంద పదవీ విరమణలు బహు తక్కువ. అవకాశాలు లేకపోయినా రాకపోయినా వాటి కోసం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక జీవితకాలం అంతా అలా పాలిటిక్స్ అనే పరుగు పందెంలో సాగుతూనే ఉంటారు. కొందరు నేతలు రాజకీయంగా తమ జీవిత కాలం కోరికలు తీర్చుకోలేకపోతున్నారు. వాటి కోసం అయినా రాజకీయంగా కొనసాగడం అనివార్యంగా భావిస్తున్నారు.

గేరు మార్చారా :

అలా చూస్తే కనుక విజయనగరం జిల్లాలో ఒక సీనియర్ వైసీపీ నేత మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేశారు. ఆయనే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి. అందరూ స్వామి అని పిలుచుకునే ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. ఎమ్మెల్యేగా రెండుసర్లు గెలుపు కూడా ఎంతో గుర్తుంచుకోతగినది. 2004లో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి అప్పటి మంత్రివర్యులు పూసపాటి అశోక్ గజపతిరాజునే విజయనగరంలో తొలిసారిగా ఓడించి అసెంబ్లీకి వెళ్ళారు. దాంతో జెయింట్ కిల్లర్ అన్న పేరు సంపాదించారు. 2019లో అశోక్ కుమార్తె అదితి గజపతిరాజుని ఓడించి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఆయన పూసపాటి రాజుల కుటుంబానికి ఓటమి రుచి చూపించిన వీరుడిగా సన్నిహితులు అంటూంటారు. అలాంటి కోలగట్ల 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయ్యారు రెండేళ్ళ పాటు ఆయన తన కార్యకలాపాలనే తగ్గించారు. దాంతో ఆయన రిటైర్ అవుతారు అని అనుకున్నారు. కానీ చిత్రంగా ఇపుడు మళ్ళీ యాక్టివ్ అయిపోయారు.

పోటీకి సిద్ధమంటూ :

కోలగట్ల తాజాగా మళ్లీ కూటమి మీద విమర్శలు చేస్తున్నారు. వైసీపీ తరఫున సమావేశాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పార్టీ క్యాడర్ ని కలుస్తున్నారు. దనతో ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధపడుతున్నారు అని ప్రచారం సాగుతోంది. విజయనగరంలో ఆయనకు మంచి పట్టు ఉంది. ఆర్య వైశ్య సామాజిక వర్గానికి చెందిన స్వామి 1989లో తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓటమి చెందినా తనకంటూ ఒక బలాన్ని బలగాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు అయితే ఆయనకు ఒక కోరిక తీరింది. అది ఎమ్మెల్యే కావడం, రెండవ కోరిక ఉంది అని అంటున్నారు.

మంత్రిగా అనిపించుకోవాలని :

తాను మంత్రిగా పనిచేయాలని కోలగట్లకు జీవిత కాల కోరికగా ఉంది అని అంటున్నారు. నిజానికి వైసీపీలో తొలుత చేరిన నాయకుడు ఆయన. 2014 ఎన్నికల తరువాత బొత్స సత్యనారాయణ తదితరులు చేరారు. అయితే జిల్లాలో సామాజిక పరిస్థితులు బొత్స సీనియార్టీ, ఆయన డైనమిక్ పాలిటిక్స్ మందీ మార్బలం అన్నీ కలసి జిల్లాలో మంత్రి పదవి ఆయనకే దక్కేలా చేసింది. అయిదేళ్ళ పాటు ఫుల్ టైం మంత్రిగా బొత్స జగన్ హయాంలో కొనసాగారు. దాంతో విస్తరణలో అయినా తనకు మంత్రి పదవి దక్కుతుందని భావించిన కోలగట్ల నిరాశ చెందారు, ఉప సభాపతి పదవితోనే సర్దుకోవాల్సి వచ్చింది. కానీ 2029లో పోటీ చేసి వైసీపీ గెలిస్తే ఈసారి కచ్చితంగా మంత్రి పదవి తనకు దక్కుతుందని ఆయన భావిస్తున్నారు అని అంటున్నారు. దాంతో ఆయన పోటీకి రెడీ అవుతున్నారని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News