కొత్త ప్రభుత్వం కోరుతోంది...షేక్ హసీనాను అప్పగిస్తారా ?
బంగ్లాదేశ్ తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఎవరికైనా ఇరుగూ పొరుగూ బాగుండాలి.;
బంగ్లాదేశ్ తో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తోంది. ఎవరికైనా ఇరుగూ పొరుగూ బాగుండాలి. చెవిలో జోరీగల వారు తినేస్తూంటే అనుకున్నది సాగదు, పైగా ఇరుగు పొరుగులతో శతృత్వం ఉంటే రక్షణ పరంగానూ ఇబ్బందులు వస్తాయి. భారత్ గత ఎనిమిది దశాబ్దాలుగా పాకిస్థాన్ తో పడుతూ వస్తోంది. దాయాది చేసే చేష్టలు పెట్టే ఇబ్బందులు చాలవు అన్నట్లుగా ఇపుడు కొత్తగా బంగ్లా దేశ్ వచ్చి చేరింది. 2024 ఆగస్టు నుంచి అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం కుప్ప కూలి తాత్కాలిక ప్రభుత్వం రావడంతో బంగ్లా మంటలు పరోక్షంగా భారత్ మీద సెగలు పొగలు రేపాయి. ఇదే అదనుగా పాక్ మరో వైపు చైనా బంగ్లాతో చెలిమికి చేతులు కలపడం కూడా భారత్ కి వ్యూహాత్మకంగా ఇరకాటంలోకి నెట్టేదే అయింది.
గ్రీట్ చేసిన మోడీ :
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో బంగ్లా దేశ్ నేషనల్ పార్టీ బీఎన్ఎస్ గెలిచింది. ఆ పార్టీ తరఫున తారిఖ్ రెహమాన్ కొత్త ప్రధాని కానున్నారు. ఫలితాలు వెలువడగానే భారత్ ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు గ్రీట్ చేశారు. ఇక బీఎన్ఎస్ నేతలు కూడా భారత్ సహా అన్ని దేశాలతో తమ సంబంధాలను స్నేహపూర్వకంగా కొనసాగిస్తామని చెబుతూ వస్తున్నారు మరో వైపు తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి భారత్ ప్రధాని కి ఆహ్వానం అందుతుంది అని అంటున్నారు. అందితే వెళ్ళడానికి పూర్వ సంబంధాలు నెలకొల్పడానికి భారత్ సిద్ధంగా ఉంది అని వార్తలు వస్తున్నాయి.
అప్పగించాల్సిందే :
ఇదిలా ఉంటే బీఎన్ఎస్ నాయకులు ఐతే షేక్ హసీనాను తమకు అప్పగించాల్సిందే అన్న డిమాండ్ ని మరోసారి చేశారు. బీఎన్ ఎస్ సీనియర్ నాయకుడు సలావుద్దీన్ అహ్మద్ దీని మీద మాట్లాడుతూ హసీనాను అప్పగించే విషయం గురించి విదేశాంగ మంత్రి ఇప్పటికే ప్రస్తావించారని తాము సమర్ధిస్తున్నామని చెప్పడం విశేషం. చట్ట ప్రకారమే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు రెండు దేశాల మధ్య విదేశాంగ శాఖకు సంబంధించిన విషయంగా కూడా పేర్కొన్నారు.
మరణ శిక్షను ఎదుర్కొంటున్న హసీనా :
ఇదిలా ఉంటే షేక్ హసీనా 2024 ఆగస్టు నుంచి భారత్ లో ఉంటున్నారు. భారత్ ఆమెకు ఆశ్రయం కల్పించింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ అయితే గత ఏడాది ఆమె పాలనలో జరిగిన అరాచకాల మీద విచారణ జరిపి ఏకంగా మరణ శిక్షనే విధించింది. అమానవీయ నేరాలకు హసీనా పాల్పడ్డారు అని ట్రిబ్యునల్ వ్యాఖ్యలు చేయడం విశేషం. అయితే ట్రిబ్యునల్ తీర్పుని చట్ట వ్యతిరేకం అని షేక్ హసీనా అంటున్నారు. తన వాదనలు వినకుండానే ఈ తీర్పు వెలువరించారు అన్నది ఆమె మాటగా ఉంది.
ఎన్నికలు ఫార్స్ అంటూ :
ఇక బంగ్లాదేశ్ లో తాజాగా జరిగిన ఎన్నికలు ఫార్స్ అని షేక్ హసీనా ఘాటుగా విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు జరగలేదని ఆమె నిందించారు. ఇక షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా తాత్కాలిక ప్రభుత్వ సారధి మహమ్మద్ యూనస్ బహిష్కరించారు. దాని మీద కూడా షేక్ హసీనా ఫైర్ అయ్యారు.
భారత్ ఏమి చేస్తుంది :
ఇక అవామీ లీగ్ అన్న పార్టీతో ఆ పార్టీ నేతలతో భారత్ కి సుదీర్ఘమైన అనుబంధం ఉంది. తొలి బంగ్లా ప్రధాని ఆ దేశ జాతి పిత బంగ్లా దేశ్ కోసం పోరాడిన ముజఫర్ రెహమాన్ కాలం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోంది. ఆయన కుమార్తె బంగ్లాదేశ్ లో అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఉన్న షేక్ హసీనా కూడా భారత్ తో ఎంతో మితృత్వం నెరిపారు. దానిని దృష్టిలో ఉంచుకునే భారత్ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. ఇక బంగ్లా ఎన్నికల్లో అవామీ లీగ్ కి కూడా పాల్గొనేలా చూడాలని భారత్ అయితే అభిప్రాయపడింది. కానీ ఇపుడు బంగ్లా దేశ్ తో భారత్ తన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని అనుకుంటోంది. కానీ షేక్ హసీనా విషయం తేల్చాలని కొత్త ప్రభుత్వం అంటోంది. దాంతో భారత్ ఏమి చేస్తుంది అన్నది పెద్ద చర్చగా ఉంది.
ఇరాకాటంగానే :
భారత్ కి శరణార్ధిగా షేక్ హసీనా వచ్చారు. ఆమెకు ఆశ్రయం ఇచ్చింది భారత్. ఆ సమయంలో బంగ్లా దేశ్ అల్లర్లు తొందరలో సమసిపోయి తిరిగి ఆమె అక్కడికి వెళ్ళి తన పార్టీతో కలసి పాలన చేస్తారు అని భావించారు. కానీ జరిగింది పూర్తి భిన్నం. ఏకంగా అవామీ లీగ్ నే తప్పించేశారు. షేక్ హసీనాకు మరణ శిక్ష విధించారు. ఇపుడు కొత్త ప్రభుత్వంతో సంబంధాలు బాగుండాలీ అంటే హసీనాను అప్పగించాలి. అలా చేయడం భారత్ కి దౌత్యపరంగా మేలు గా ఉండొచ్చు. బంగ్లా పాలకులు కూడా హర్షం వ్యక్తం చేయవచ్చు. రిలేషన్స్ బాగుండొచ్చు కానీ అదే సమయంలో శరణార్ధిగా వచ్చిన ఒక మాజీ ప్రధానిని మహిళా నేతను అప్పగిస్తే అక్కడ ఆమెకు మరణదండన విధిస్తే అది మరో రకంగా ఇబ్బందికరం అవుతుందా అన్న చర్చ కూడా ఉంది. మొత్తానికి దౌత్యపరంగా ఈ వ్యవహారం ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అన్నది చూడాల్సి ఉంది.