గన్నవరం ఇన్చార్జిగా పంకజశ్రీ.. వంశీ ప్లేస్ లో మార్పు వెనుక బిగ్ ప్లాన్!

విపక్ష వైసీపీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కొద్దిరోజులుగా నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమిస్తున్న వైసీపీ అధిష్టానం గన్నవరం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేసింది.;

Update: 2025-05-30 17:30 GMT

విపక్ష వైసీపీ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. కొద్దిరోజులుగా నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తలను నియమిస్తున్న వైసీపీ అధిష్టానం గన్నవరం నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేసింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటైన గన్నవరంలో సానుభూతితో గెలుపు సాధించాలని వ్యూహాన్ని సిద్ధం చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ స్థానంలో ఆయన భార్య పంకజశ్రీని నూతన ఇన్చార్జిగా నియమించాలని వైసీపీ ఆలోచనగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పంకజశ్రీని రాజకీయాల్లోకి తేవడంతో ద్వారా వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

రాజకీయాల్లో సరైన వ్యూహరచనతోనే 50 శాతం విజయం సాధిస్తారని చెబుతారు. మంచి వ్యూహాకర్త సునాయాశంగా ప్రజాభిమానాన్ని దక్కించుకుంటారన్న విషయం ఎన్నోమార్లు రుజువైంది. అయితే 2019 ఎన్నికల్లో సరైన వ్యూహాలను అమలు చేసిన వైసీపీ ఘన విజయం సాధించింది. అదే రిజల్ట్ 2024లో రిపీట్ అవుతుందని ఆశించి బోల్తా పడింది. ఈ అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్న విపక్ష పార్టీ ప్రధాన నియోజకవర్గాల్లో కూటమికి గట్టిగానే సవాల్ విసురుతోందని అంటున్నారు.

ముఖ్యంగా ఇటు అధికార కూటమి, విపక్ష వైసీపీకి ప్రతిష్ఠాత్మక నియోజకవర్గాలైన కొన్నింటిపై ఆయా పార్టీల అగ్రనేతలు ఫోకస్ చేశారు. ప్రధానంగా వైసీపీకి బలమైన నేతలు ఉన్న గన్నవరం, గుడివాడ వంటి నియోజకవర్గాల్లో కొత్త ఇన్ చార్జిలను నియమించాలని వైసీపీ అగ్రనాయకత్వం డిసైడ్ అయిందని అంటున్నారు. గన్నవరంలో వైసీపీకి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ తరపున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ మూడోసారి ఓటమి చవిచూశారు. ఆయనతోపాటు పార్టీ ఓడపోయింది. అయితే వైసీపీ ఓటమికి వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారు చేసిన వ్యాఖ్యలు కూడా కీలకంగా పనిచేశాయని అంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నేతలను రంగంలోకి దింపాలని కూటమిలోని ప్రధాన పార్టీ టీడీపీ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.

2019లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ ఆ తర్వాత ఏడాదిలోపే వైసీపీతో చేతులు కలిపారు. 2024లో మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. అయితే పరాజయాన్ని జీర్ణించుకోలేని వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చినట్లు గతంలో ప్రచారం జరిగింది. రాజకీయాలకు స్వస్తి పలికి విదేశాల్లో వ్యాపారం చేసుకోవాలని కూడా ఆయన అనుకున్నట్లు చెబుతున్నారు. ఇక గత ప్రభుత్వంలో ఆయన వ్యవహారశైలితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వంశీ కూటమి పాలకులకు టార్గెట్ అయిన విషయం తెలిసిందే. దీంతో వంశీని అరెస్టు చేసి వంద రోజులకు పైగా జైల్లో పెట్టారు.

కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వంశీని వరుస కేసులు చుట్టుముట్టగా, ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు హైకోర్టు అనుమతి తెచ్చుకున్నారు వంశీ. ప్రస్తుతం ఆయన రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ ఆయన గన్నవరం నుంచి రాజకీయం చేయడానికి సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది. అయితే కూటమి పెద్దలకు బుద్ధి చెప్పాలంటే వంశీ రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటున్న వైసీపీ.. వంశీకి బదులుగా ఆయన భార్య పంకజశ్రీని గన్నవరం ఇన్ చార్జిగా నియమించాలని చస్తున్నట్లు చెబుతున్నారు.

భర్త సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్నా, పంకజశ్రీ మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. భర్తకు సహకారంగా ఎన్నికల సమయంలో పంకజశ్రీ ప్రచారం చేసేవారు. అయితే వంశీ పరిస్థితిని చూసిన వైసీపీ.. కూటమికి బుద్ధి చెప్పాలంటే వంశీ బదులుగా పంకజశ్రీని తెరపైకి తేవాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. మహిళగా ఆమెకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రాజకీయంగా లబ్ధి పొందవచ్చిన వైసీపీ ఊహిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం జరగనున్న గన్నవరం నియోజకవర్గ సర్వసభ్య సమావేశంలోనే వల్లభనేని పంజశ్రీ గన్నవరం నియోజకవర్గానికి కొత్త ఇన్చార్జి బాధ్యతలు స్వీకరిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

పంకజశ్రీని తెరపైకి తేవడం ద్వారా మహిళా సెంటిమెంటును పొందవచ్చని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అదేసమయంలో వంశీని మళ్లీ ప్రోత్సహిస్తే గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలను సమర్థించినట్లు అవుతుందని వైసీపీ అధిష్ఠానం భయపడుతోందని అంటున్నారు. వంశీని పక్కకు తప్పిస్తే ఆయన వ్యాఖ్యల నుంచి పార్టీ దూరంగా జరిగిపోయే పరిస్థితి ఉందని అంటున్నారు. దీంతో వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. గన్నవరంలో వంశీ బదులుగా పంకజశ్రీకి అవకాశం ఇవ్వాలని అధినేత డిసైడ్ అయ్యారట. ఈ విషయాన్ని జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మొత్తానికి గన్నవరం నుంచి వైసీపీ వ్యూహాత్మకంగా ప్రభుత్వంపై పోరాడాలని నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు.

Tags:    

Similar News