మంచి కార్యక్రమం.. ఎందుకు మిస్సయ్యావ్ జగన్?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారా? అనే చర్చకు కారణమవుతున్నారు.;
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారా? అనే చర్చకు కారణమవుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీని బహిష్కరించిన జగన్మోహనరెడ్డి, తన సొంత పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరుకాకపోవడంపై విస్తృత చర్చ జరుగుతోంది. వైసీపీ ఉత్తరాంధ్ర నాయకులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘చలో మూలపేట’ కార్యక్రమంలో జగన్ పాల్గొంటే బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూలపేట పోర్టుకు ఉన్న ప్రాధాన్యం, ఉత్తరాంధ్రలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జగన్ ఈ తరహా కార్యక్రమాలకు హాజరు కావల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రతిపక్షంలోకి వచ్చి 21 నెలలు గడుస్తున్నందున వైసీపీ అధినేత పార్టీపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మూలపేట పోర్టు సభకు హాజరైన జనాన్ని పరిశీలిస్తే, పార్టీ పట్ల ఇప్పటికీ ప్రజల్లో ఆదరణ ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనిని మరింతగా విస్తరించాలంటే అధినేత తరచూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటే బాగుండేదని అంటున్నారు. క్రెడిట్ చోరీ అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, వైసీపీ హయాంలో అభివృద్ధికి పునాదులు పడ్డాయని జగన్ చెప్పడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే ప్రెస్మీట్లు ఒక్కటే సరిపోవని సీనియర్ నేతలు తమ అంతర్గత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు. వేలాదిగా ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలను అధినేత ఆధ్వర్యంలో నిర్వహిస్తే పార్టీ వాదన మరింత బలంగా చొచ్చుకువెళ్లే అవకాశం ఉందని అంటున్నారు.
అసెంబ్లీని బహిష్కరించిన అధినేత జగన్మోహనరెడ్డి మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని చెబుతున్నారని, కానీ నెల, రెండు నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమాలకు హాజరుకావడం కూడా ముఖ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జగన్ రెడ్డి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అంటున్నారు. అయితే అధినేత నుంచి ఇందుకు పూర్తివిరుద్ధమైన స్పందన ఉంటోందని అంటున్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ 21 నెలల్లో జగన్ నాలుగైదు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు మిర్చియార్డు సందర్శన, పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ, బంగారుపాళ్యంలో మామిడి రైతులకు ఓదార్పు వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఇవన్నీ ప్రజలకు, రైతులకు సంబంధించిన సమస్యలని, వాటిని అందిపుచ్చుకోవడం ద్వారా పార్టీ మైలేజ్ పెరిగేందుకు బాగా ఉపయోగపడ్డాయని అంటున్నారు. అయితే ఆ తరహా కార్యక్రమాలను కొనసాగించడంలో వైఫల్యం కారణంగా మళ్లీ మొదటికి వస్తున్నామని సీనియర్లు వాపోతున్నారు.
ఇక మూలపేట కార్యక్రమం మాదిరిగానే గతంలో రాయలసీమ సాగునీటి సమస్యపై ఆ ప్రాంత నేతలు భారీ కార్యక్రమాన్ని నిర్వహించారని, ఆ సభకు అధినేత హాజరుకాకపోవడం వల్ల తగినంత ప్రచారం జరగలేదని అంటున్నారు. పార్టీలో ఎందరు నేతలు పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినా అధినేత వస్తే ఆ ఇమేజ్, ప్రభావం వేరుగా ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, ఈ విషయంలో జగన్ రెడ్డి ఉదాసీనంగా ఉండటం వల్ల భారీ కార్యక్రమాలకు కూడా అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించడం లేదని అంటున్నారు.