నెక్ట్స్ లెవల్ కి క్రెడిట్ వార్.. వైసీపీ పక్కా వ్యూహంతోనే చలో మూలపేట!
క్రెడిట్ చోరీ అంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం చేస్తోంది. తమ ప్రభుత్వంలో చేపట్టిన పనులనే కూటమి ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటోందని ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా ప్రకటించారు.;
క్రెడిట్ చోరీ అంటూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటం చేస్తోంది. తమ ప్రభుత్వంలో చేపట్టిన పనులనే కూటమి ప్రభుత్వం తన గొప్పగా చెప్పుకుంటోందని ఆ పార్టీ అధినేత జగన్ స్వయంగా ప్రకటించారు. అంతేకాకుండా వైసీపీలో అన్నిస్థాయిల్లోనూ ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ గత కొంతకాలంగా రాజకీయాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు సోమవారం ‘చలో మూలపేట’ కార్యక్రమాన్ని నిర్వహించి సరికొత్త చర్చకు తెరలేపారు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలపేట వద్ద కొత్తగా పోర్టు నిర్మిస్తున్నారు. దీనికి సమీపంలో భారీ బహిరంగ సమావేశం నిర్వహించిన వైసీపీ క్రెడిట్ వార్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లిందని అంటున్నారు.
ఇప్పటివరకు పెట్టుబడుల ప్రకటనలు వచ్చినప్పుడు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగినప్పుడు ఆ క్రెడిట్ తమదేనని వైసీపీ చెప్పుకునేది. అయితే సోమవారం మూలపేటలో మాత్రం ఇందుకు భిన్నంగా కార్యక్రమాన్ని నడిపించిందని వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ వ్యూహాత్మకంగా మూలపేట పోర్టు వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా ఉత్తరాంధ్రకు చెందిన దాదాపు అందరు వైసీపీ నేతలను ఈ కార్యక్రమంలో భాగం చేయడం ద్వారా మూలపేట పోర్టు తమ ఘనతగా చెప్పుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు.
రాజకీయాల్లో ఎప్పుడూ ఎవరు కట్టారు అన్నదాని కంటే, పని ఎప్పుడు పూర్తయింది, రిబ్బన్ కటింగ్ ఎవరు చేశారన్నదే ప్రధాన అంశంగా చూస్తుంటారని విశ్లేషిస్తున్నారు. ఇక వైసీపీ హయాంలో మొదలైన ఈ పోర్టు ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి 70 శాతం పూర్తయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ వాదనను కూటమి నేతలు తోసిపుచ్చుతున్నారు. దీంతో మూలపేట పోర్టు పనులపై రెండు పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో మూలపేటపై తమ ముద్ర పోకుండా చూసుకోవడం, భవిష్యత్తులో అదనపు భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైతే ప్రజల్లో వ్యతిరేకతను కూడగట్టడం అనే వ్యూహాంతో వైసీపీ సభను నిర్వహించిందని చెబుతున్నారు.
ప్రస్తుతం మూలపేట పోర్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసి పోర్టు ప్రారంభించాలని ప్రభుత్వం చూస్తోంది. వచ్చేనెలలో ట్రయిల్ రన్ నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. ఈ సమాచారంతోనే వైసీపీ అధిష్టానం అలర్ట్ అయిందని అంటున్నారు. పనులు పూర్తవుతున్న వేళ మా పాత్రను మర్చిపోకండి అంటూ ప్రజలకు రిమైండర్ ఇస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని చెబుతున్నారు.
సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ పూర్తయ్యాక క్రెడిట్ కోసం ప్రయత్నిస్తుంటారని, కానీ ప్రాజెక్టు వినియోగంలోకి రావడానికి ముందే భారీ బహిరంగ సభ ద్వారా ప్రజల మైండ్‌లో "ఇది మా వల్లే సాధ్యమైంది" అనే ముద్ర వేసేలా వైసీపీ తెలివైన ఎత్తుగడ వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. కూటమి ప్రభుత్వం ట్రయల్ రన్ నిర్వహించేలోపే వైసీపీ సభ పెట్టడం ద్వారా, రేపు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ ను, క్రెడిట్ ను వైసీపీ ఖాతాలో జమ చేసుకునేలా ప్లాన్ చేసిందని అంటున్నారు. "మేము పునాది వేశాం కాబట్టే నేడు కూటమి నేతలు రిబ్బన్ కట్ చేస్తున్నారు" అనే వాదనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమే ఇందులో ముఖ్య ఉద్దేశం అంటున్నారు.