మోదీ విందుకు జిన్‌పింగ్ ఎందుకు రాలేదు? తెరపైకి ఆసక్తికర కారణం?

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

Update: 2026-09-13 04:18 GMT

న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న 18వ బ్రిక్స్‌ సదస్సులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్‌ దేశాల అధినేతల కోసం ప్రధాని నరేంద్ర మోదీ శనివారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రత్యేక గాలా డిన్నర్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాలేదు. దీంతో జిన్‌పింగ్ విందుకు ఎందుకు దూరంగా ఉన్నారన్న అంశంపై చర్చ మొదలైంది.

జిన్‌పింగ్ శనివారం మధ్యాహ్నం భారత్‌కు చేరుకున్నారు. అనంతరం బ్రిక్స్‌ సదస్సులోని కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు ప్రధాని మోదీతో ప్రత్యేకంగా ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. సదస్సు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఆయన విశ్రాంతి కోసం హోటల్‌కు తిరిగి వెళ్లినట్లు సమాచారం. రోజంతా బిజీ షెడ్యూల్ కారణంగా అలసటకు గురైనందునే విందుకు రాలేదని చెబుతున్నారు. అయితే దీనిపై చైనా ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి కారణం వెల్లడికాలేదు.

మోదీ-జిన్‌పింగ్ భేటీకి ప్రాధాన్యం

గాలా డిన్నర్‌కు ముందు ప్రధాని మోదీ, జిన్‌పింగ్ మధ్య కీలక ద్వైపాక్షిక సమావేశం జరిగింది. భారత్‌-చైనా సంబంధాల్లో ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య సరిహద్దు అంశాలతో పాటు వాణిజ్యం, భద్రత, ద్వైపాక్షిక సంబంధాలపై నేతలు చర్చించినట్లు సమాచారం. భారత్‌, చైనా పరస్పర గౌరవంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని జిన్‌పింగ్‌ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

పుతిన్‌తో పాటు పలువురు నేతలు విందుకు

జిన్‌పింగ్ గైర్హాజరైనప్పటికీ మోదీ ఏర్పాటు చేసిన విందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పలువురు బ్రిక్స్‌ దేశాల నాయకులు హాజరయ్యారు. భారత కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్ తదితర ప్రముఖులు కూడా విందులో పాల్గొన్నారు. అబుదాబి ప్రిన్స్ షేక్ ఖలీద్ కూడా శిఖరాగ్ర సమావేశం ముగిసిన అనంతరం స్వదేశానికి బయలుదేరడంతో విందుకు హాజరుకాలేకపోయారు.

గతంలో మోదీ-జిన్‌పింగ్ విందులు ప్రత్యేకం

మోదీ, జిన్‌పింగ్ కలిసి పాల్గొన్న గత విందులు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. 2019లో తమిళనాడులోని మహాబలిపురంలో జరిగిన అనధికారిక సమావేశం సందర్భంగా మోదీ.. జిన్‌పింగ్‌కు దక్షిణ భారతీయ సంప్రదాయ వంటకాలతో విందు ఇచ్చారు. సాంబార్, రసం, హల్వా వంటి వంటకాలు అప్పట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతకుముందు 2014లో జిన్‌పింగ్ గుజరాత్‌ పర్యటన సందర్భంగా సబర్మతి నదీ తీరంలో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఇందులో భారీ సంఖ్యలో సంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు.

అయితే ఈసారి ఢిల్లీలో జరిగిన బ్రిక్స్‌ గాలా డిన్నర్‌కు జిన్‌పింగ్ గైర్హాజరు కావడం వెనుక అధికారికంగా ధ్రువీకరించిన రాజకీయ కారణం ఏదీ లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం సదస్సు కార్యక్రమాలతో అలసటకు గురై విశ్రాంతి తీసుకోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Tags:    

Similar News