భారత్ లో పొలిటికల్ తుపాన్ సృష్టించిన 'ఎక్స్'లో కొత్త ఆప్షన్.. ఇది వైరల్!

అవును... ‘ఎక్స్’ లో అకౌంట్ లోకేషన్ రివీలింగ్ ఆప్షన్ ఇప్పుడు భారత్ లో రాజకీయంగా పెను దుమారానికి కారణమైందని చెప్పొచ్చు.;

Update: 2025-11-25 16:30 GMT

ఎలాన్ మస్క్ "ఎక్స్" లో ఓ కొత్త ఫీచర్ విడుదలయ్యింది. ఇందులో భాగంగా.. ఇది ఆ అకౌంట్ కి సంబంధించిన లొకేషన్ ను రివీల్ చేస్తుంది. ఈ ఫీచర్ ఎఫెక్ట్ మిగిలిన ప్రాంతాల్లో ఎలా ఉందో తెలియదు కానీ.. భారత్ లో మాత్రం రాజకీయ తుపాన్ కు కారణమైందని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా.. పలు అకౌంట్ల స్క్రీన్ షాట్లు షేర్ చేస్తూ.. కాంగ్రెస్ పై బీజేపీ నిప్పులు చెరుగుతుంది.

అవును... ‘ఎక్స్’ లో అకౌంట్ లోకేషన్ రివీలింగ్ ఆప్షన్ ఇప్పుడు భారత్ లో రాజకీయంగా పెను దుమారానికి కారణమైందని చెప్పొచ్చు. తాజాగా ఈ ఆప్షన్ అకౌంట్ ను పరిశీలించిన అనంతరం... పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో పాటు మరికొన్ని ఆసియా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ అనుకూల, హిందూ వ్యతిరేక ఎక్స్ అకౌంట్స్ నడుస్తున్నాయని పేర్కొంటూ బీజేపీ నిప్పులు చెరుగుతుంది.

జాతీయ మీడియా కథనాల ప్రకారం... కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా అకౌంట్ ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా’లో ఉన్నట్లు చూపించబడగా.. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ‘ఐర్లాండ్’ లో ఉందని చూపిస్తుంది. ఇదే సమయంలో.. అనేక ప్రభుత్వ వ్యతిరేక స్వరాల ఖాతాలు భారతదేశం వెలుపల కేంద్రంగా ఉన్నట్లు కనుగొనబడిందని కథనాలొస్తున్నాయి. దీంతో విషయం వైరల్ గా మారింది.

ఈ సమయంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టడానికి ఈ ఫీచర్ బీజేపీకి ఒక బలమైన ఆయుధాన్నే అందించిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా ఎక్స్ లో స్పందించారు. ఈ సందర్భంగా... కాంగ్రెస్ అనుకూల, హిందూ వ్యతిరేక, కుల విభజన ఆధారిత హ్యాండిల్స్ పెద్ద సంఖ్యలో భారతదేశం నుంచి పనిచేయడం లేదని అన్నారు.

ఇదే క్రమంలో... అవి చాలా వరకూ పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆసియాలోని పలు దేశాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి నడుస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా... భారత సామాజిక చర్చను ప్రభావితం చేయడానికి.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, అంతర్గత విభజనలను తీవ్రతరం చేయడానికి సమన్వయంతో కూడిన ఆపరేషన్ ఇదని ఎక్స్ లో రాసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో... దియా శర్మ, యషిత నాగ్ పాల్ అకౌంట్స్ కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది! ఇందులో భాగంగా.. ఈ రెండు అకౌంట్లు పాకిస్థాన్ లో ఉన్నట్లు తేలిందని అంటున్నారు. ఈ రెండు అకౌంట్స్ లోనూ బీజేపీ, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే పోస్టులు ఉన్నాయని చెబుతున్నారు. దీంతో బీజేపీ వాయిస్ ను మరింతగా పెంచి విమర్శలు మొదలుపెట్టింది.

Tags:    

Similar News