ఉద్యమకారుల ఒత్తిడి ఫలిస్తుందా ?

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ఉద్యమకారులు కేసీఆర్ పై ఒత్తిడికి ప్రయత్నాలు చేస్తున్నారు.;

Update: 2023-08-15 05:55 GMT

రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి ఉద్యమకారులు కేసీఆర్ పై ఒత్తిడికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరికి వాళ్ళు తమకు అందుబాటులో ఉన్న మార్గాల్లో కేసీఆర్ పై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. గత రెండు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయం కోసం కష్టపడిన తమకు ఈసారి మాత్రం టికెట్లు ఇవ్వాల్సిందే అని ఉద్యమకారులు గట్టిగా పట్టుబడుతున్నారట. ఇందుకోసం పోటీచేసే విషయంలో ఆసక్తి ఉన్నవారంతా జిల్లాల వారీగా సమావేశాలు కూడా పెట్టుకుంటున్నారు.

ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, రంగారెడ్డితో పాటు హైదరాబాద్ జిల్లాల్లోని ఉద్యమకారులంతా ఇప్పటికే మీటింగులు పెట్టుకున్నారు. ఉద్యమాకులంతా కలిసి తొందరలోనే ఉస్మానియా యూనివర్సిటి విద్యార్ధి సంఘాల నేతలతో భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎంతోమంది ఉద్యమకారులు, కళాకారులు ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పోరాటాలు చేశారు. అచ్చంగా అప్పటి టీఆర్ఎస్ నేతల వల్లే అయితే ప్రత్యేక తెలంగాణా ఎప్పటికీ వచ్చే అవకాశంలేదు.

అప్పట్లో ఉద్యమకారులను ముందుపెట్టి కేసీయార్, హరీష్ రావు తదితర లీడర్లు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. అయితే ప్రత్యేక తెలంగాణా వచ్చిన తర్వాత ఉద్యమకారులంతా ఎటుపోయారో ఎవరికీ తెలీదు. ఎందుకంటే కేసీయార్ చాలామందిని దగ్గరకు కూడా రానీయలేదు. అప్పట్లో పోరాటాలుచేసి కేసులు పెట్టించుకుని జైళ్ళకు వెళ్ళిన వాళ్ళు కేసీయార్ అపాయిట్మెంట్ కోసం ప్రయత్నాలు చేసి విసిగిపోయి లాభంలేదని దూరమైపోయారు. వాళ్ళంతా ఎటుపోయారు తెలీదు. విచిత్రం ఏమిటంటే అప్పట్లో సమైక్య ఆంధ్రకే కట్టుబడున్న ఇతర పార్టీల నేతలను కేసీయార్ నెత్తిన పెట్టుకున్నారు.

తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు లాంటి చాలామంది మంత్రులయ్యారు. అప్పట్లో కేసీయార్ ను తీవ్రంగా వ్యతిరేకించిన సబితా ఇంద్రారెడ్డి వాళ్ళు కూడా తర్వాత బీఆర్ఎస్ లో చేరి మంత్రులైపోయారు. కానీ మొదటినుండి కేసీయార్ కు మద్దతుగా ఉండి, ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఉద్యమకారులు మాత్రం దూరమైపోయారు. అలాంటి వాళ్ళంతా ఇపుడు యాక్టివ్ అయ్యి ఏదోరకంగా కేసీయార్ పై ఒత్తిడితెచ్చి ఎంఎల్ఏగా పోటీచేయాలనే ప్రయత్నాలను మొదలుపెట్టారు. మరి వీళ్ళ ఒత్తిళ్ళు కేసీయార్ మీద పనిచేస్తాయా ? ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News