జగన్ యోగా ఎక్కడ ?
ఏకంగా రెండు కోట్ల మంది దాకా ప్రజలు యోగాంధ్రా యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే అదంతా కూటమి ప్రభుత్వం గొప్పదనం అని చెప్పాలి;
ఏపీ అంతా యోగా జ్వరంతో వేడెక్కిపోతోంది. యోగాంధ్రా పేరుతో నెల రోజుల పాటు ఏపీలో యోగా గురించి కూటమి ప్రభుత్వం చేసిన విస్తృత ప్రచారం కానీ అన్ని వర్గాల ప్రజలను మమేకం చేస్తూ చేయించిన ప్రాక్టీస్ కానీ నభూతో నభవిష్యత్తు అని చెప్పాలి. ఏకంగా రెండు కోట్ల మంది దాకా ప్రజలు యోగాంధ్రా యాప్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అంటే అదంతా కూటమి ప్రభుత్వం గొప్పదనం అని చెప్పాలి. ప్రత్యేకించి చంద్రబాబు దృఢ సంకల్పం అని చెప్పాలి.
ప్రధాని మోడీని సైతం ఆశ్చర్యపరచేలా చంద్రబాబు కనీవినీ ఎరుగని తీరులో విశాఖలో అంతర్జాతీయ యోగా డేని నిర్వహిస్తున్నారు. మోడీ సమక్షంలోనే దాదాపుగా నాలుగు లక్షల మంది దాకా ప్రజలు యోగాభ్యాసాలు వేయబోతున్నారు అంటేనే అది ప్రపంచ రికార్డుగా ఉంది.
ఎంతో పట్టుదలతో మరెంతో తపనతో కూటమి ప్రభుత్వం బాబు నాయకత్వంలో చేస్తున్న యోగా ఏర్పాట్లు చూసిన తరువాత దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ తరహాలో మరెవరూ చేయలేరు అనే అంతా అంటున్నారు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్లుగా విశాఖలో జరుగుతున్న 11వ అంతర్జాతీయ యోగా డే చరిత్ర సృష్టిస్తూ చరిత్రలో నిలిచిపోనుంది అని అంటున్నారు.
మరో వైపు చూస్తే మొత్తానికి మొత్తం ప్రజానీకం యోగాలో పాలు పంచుకుంటున్నారు. చంద్రబాబు వాయిస్ తో ప్రతీ వ్యక్తికీ ఫోన్ ద్వారా యోగా ఆవశ్యకతను వివరిస్తూ యోగా సందేశాన్ని పంపించారు. యోగాని ఎక్కడ ఉన్నా మరచిపోవద్దు. తప్పకుండా చేయమని బాబు ఆ ఫోన్ సందేశం ద్వారా కోరారు.
ఇక అంతర్జాతీయ యోగా దినోత్సవం వేళ చంద్రబాబు యోగా గురించి కూటమి ప్రభుత్వం తరఫున డిక్లరేషన్ ని విడుదల చేయనున్నారు. ఏపీలో రానున్న కాలంలో యోగాను ఏ విధంగా అమలు చేస్తారు విద్యార్థి దశ నుంచి దాని ఆవశ్యకతను ఏ విధంగా చాటుతారు అన్నది ఈ డిక్లరేషన్ ద్వారా తెలియచేస్తారు.
యోగాకు ఒక కులం మతం ప్రాంతం అనన్వి లేవని అంతా కలసి యోగా చేయాలని అది ఆరోగ్యానికి మంచిదని చాటి చెప్పబోతున్నారు. ఇక ఏపీలో నిర్వహించే యోగాకి రాజకీయాలకు అతీతంగా అంతా పాలు పంచుకోవాలని కూటమి మంత్రులు కోరుతున్నారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ ని యోగా చేయమని ఆహ్వానించారు. జగన్ లో ఉన్న ఉన్న అసహనం యోగా ద్వారా పూర్తిగా పోతుందని ఆయన సెటైర్లు వేశారు.
సరే మంత్రి అన్నారు అని కాదు కానీ విపక్షంలో ఉన్న వైసీపీ అధినేత యోగా చేస్తారా. ఇంటర్నేషనల్ యోగా డేని ఆయన ఏ విధంగా జరుపుకుంటారు అన్నది చర్చగా ఉంది. జగన్ కూడా వ్యాయామం చేస్తారు అని ప్రచారంలో ఉంది. ఆయన సీఎం గా ఉన్న రోజులలో కూడా యోగా డేకి శుభాకాంక్షలు తెలియచేస్తూ వచ్చారు. అయితే ఈసారి ఆయన ఏపీలోనే యోగా డే సాగుతున్న వేళ తాను ఎక్కడ నుంచి యోగా దినోత్సవంలో పాల్గొంటారు అన్నది అయితే ఆసక్తిగా ఉంది. పార్టీ వర్గాల నుంచి అయితే దీని మీద ఏమీ భోగట్టా లేదు కానీ జగన్ యోగాలో పాలు పంచుకుని ఆ ఫోటోలు రిలీజ్ చేస్తారా అన్న ఉత్కంఠ అయితే అందరిలో ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.