సీఐఐ సదస్సు.. వైసీపీకి ఒక్క చాన్స్ కూడా దొరకలేదే?

విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సుతో విపక్షం వైసీపీని ప్రభుత్వం మరింత ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు.;

Update: 2025-11-16 18:07 GMT

విశాఖలో రెండు రోజుల పాటు నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సుతో విపక్షం వైసీపీని ప్రభుత్వం మరింత ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లు కనిపిస్తోందని అంటున్నారు. రెండు రోజులు అనుకున్న సదస్సుకు ఒక రోజు ముందుగానే పారిశ్రామిక వేత్తలు తరలిరావడం, మూడు రోజులు ఎడతెరిపి లేని కార్యక్రమాలతో లక్షల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. అంచనాలకు మించి స్పందన రావడంతో ప్రభుత్వ వర్గాలు ఉబ్బితబ్బిబవుతున్నాయి. ముఖ్యంగా తమ సమ్మిట్ నిర్వహణపై వైసీపీ నుంచి పెద్దగా విమర్శలు రాకపోవడం కూడా ప్రభుత్వ విజయంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఏపీలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసి కూటమి ఘన విజయం నమోదు చేసినా, క్షేత్రస్థాయిలో కేడర్, సోషల్ మీడియా బలంతో వైసీపీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం చేస్తోంది. ప్రధానంగా ప్రభుత్వ కార్యక్రమాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ, సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని ఉదరగొడుతోంది. అయితే కొన్నిసార్లు వైసీపీ ఫేక్ ప్రచారం చేస్తోందని ప్రభుత్వం ఎదురుదాడి చేస్తున్నా, వైసీపీ విమర్శలకు సమాధానం వివరణ ఇచ్చుకోవాల్సివస్తోందని అంటున్నారు.

అయితే సీఐఐ సదస్సుపై వైసీపీ నుంచి పెద్దగా విమర్శలు లేకపోవడమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైసీపీ పార్టీ తీరుతెన్నులు తెలిసిన వారంతా.. సదస్సుపై వైసీపీ ఎలా స్పందిస్తుందనేది తెలుసుకోడానికి ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, వైసీపీ నుంచి సదస్సు నిర్వహణపై కానీ, పెట్టుబడల విషయంలో కానీ పెద్దగా వ్యతిరేకత కనిపించలేదు. వైసీపీ సోషల్ మీడియా, ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న యూట్యూబ్ చానళ్లలో సైతం విశాఖ సదస్సుపై పెద్దగా చర్చ జరగలేదు. ఈ సమయంలో ఆయా ప్లాట్ ఫామ్స్ లో ఇతర అంశాలే ఎక్కువగా కనిపించాయి.

పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారు సతీష్ కుమార్ మరణం, హిందూపురంలో వైసీపీ కార్యాలయంపై దాడి అంశాలనే వైసీపీ అనుకూల వర్గాలు హైలెట్ చేశాయి. సీఐఐ సదస్సు విషయంలో అనుకూల, వ్యతిరేక ప్రచారానికి దూరంగా ఉండిపోయాయని అంటున్నారు. అయితే ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించడం వల్లే వైసీపీ సోషల్ మీడియాకు సరైన కంటెంట్ లభించలేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా దాడిని ముందే ఊహించి సదస్సు నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు.

2023లో వైసీపీ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో భోజన ఏర్పాట్లు సరిగా లేవని, స్థానికులకే కోట్లు వేయించి కాగితాలపై సంతకాలు చేసి అవే ఎంవోయూలుగా చూపారని అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా ప్రచారం చేసింది. ఇప్పుడు వైసీపీ నుంచి అలాంటి ప్రచారం ఏమైనా ఉంటుందా? అని అంతా అనుమానించారు. కానీ, ఎక్కడా సీఐఐ సమ్మిట్ పై వైసీపీ విమర్శల జాడ కనిపించకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు.

Tags:    

Similar News