త‌స్సాదియ్యా.. రేవంత్‌ను మించిన మ‌రో కొత్త సీఎం.. ఎవ‌రంటే

అయితే.. ఇప్పుడు రేవంత్‌ను మించిపోయారా? అన్న‌ట్టుగా.. మ‌రో నూత‌న సీఎం కూడా తెర‌మీదికి వ‌చ్చారు.;

Update: 2023-12-10 02:45 GMT

తెలంగాణ నూత‌న ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన రేవంత‌రెడ్డి మెరుపులు మెరిపిస్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న వ్య‌వ‌హార శైలికి నెటిజ‌న్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ప్ర‌భుత్వ కాన్వాయ్‌ను వినియోగించుకుండా.. త‌న సొంత వాహ‌నంలోనే ప్ర‌యాణం చేయ‌డం.. సాధార‌ణ నాయ‌కుడిగానే వ్య‌వ‌హ‌రించ‌డంతోపాటు.. పాల‌న‌లోనూ ప్ర‌జ‌ల‌కు చేరువ అవుతున్నారు.

అయితే.. ఇప్పుడు రేవంత్‌ను మించిపోయారా? అన్న‌ట్టుగా.. మ‌రో నూత‌న సీఎం కూడా తెర‌మీదికి వ‌చ్చారు. ఆయ‌నే మాజీ ఐపీఎస్ అధికారి, ఈశాన్య రాష్ట్రం మిజోరాంకు తాజాగా ముఖ్య‌మంత్రి అయిన‌.. జోరం పీపుల్స్ మూమెంట్‌(జెడ్‌పీఎం) అధినేత లాల్ దుహోమా! ఈయ‌న వ‌య‌సులో రేవంత్ క‌న్నా ఎక్కువే అయినా.. నిర్ణ‌యాల్లో మాత్రం రేవంత్ ను మించిపోయిన‌ట్టు క‌నిపిస్తున్నార‌ని నెటిజ‌న్లు అంటున్నారు.

40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో 27 స్థానాల‌తో దుమ్మురేపే విజ‌యం ద‌క్కించుకున్న లాల్ నేతృత్వం లోని జెడ్‌పీఎం పార్టీ.. తాజాగా అదికారం చేప‌ట్టింది. ముఖ్య‌మంత్రిగా లాల్ ప్ర‌మాణం చేశారు. ఈ అడుగులో నే ఆయ‌న బుద్ధి కుశ‌ల‌త పాటించారు. సామాన్య ప్ర‌జానీకాన్ని త‌న ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి ఆహ్వానిం చారు. అంతేకాదు, ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మాన్ని రాజ‌కీయ కార్య‌క్ర‌మం చేయ‌రాద‌న్న ఆయ‌న ఆదేశాలు మిజోరాం ప్ర‌జ‌ల‌ను మురిపించాయి.

ఇక‌, సీఎంగా ఆయ‌న తొలి నిర్ణ‌యం.. త‌న‌కు స‌హా.. మంత్రులు, ఎమ్మెల్యేల‌కు కొత్త వాహ‌నాలు కొనేది లేద‌ని తేల్చి చెప్పేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ప్ర‌భుత్వం వినియోగించిన వాహ‌నాల‌నే వాడుకోవాల‌ని తేల్చేశారు. అంతేకాదు.. ప్ర‌త్యేక భ‌వ‌నాల‌ను కూడా ఇచ్చేది లేద‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ ప్ర‌భుత్వం నిర్మించిన క్వార్ట‌ర్స్‌లో నే ఉండాల‌ని.. కావాలంటే.. సొంత‌గా అద్దె క‌ట్టుకుంటే.. అభ్యంత‌రం లేద‌న్నారు.

మ‌రీ ముఖ్యంగా ప్ర‌భుత్వం మార‌గానే ముందు భ‌య‌ప‌డేది గ‌త ప్ర‌భుత్వంలో ప‌నులు చేప‌ట్టిన కాంట్రాక్ట‌ర్లు. ఎందుకంటే.. ఏపీలో స‌ర్కారు మార‌గానే ఇప్ప‌టి వ‌ర‌కు కాంట్రాక్ట‌ర్ల‌కు అప్ప‌టి ప‌నుల‌కు సంబంధించిన బిల్లులు ఇవ్వ‌లేదు. కానీ, దుహోమా మాత్రం.. కాంట్రాక్ట‌ర్ల‌కు అభ‌యం ప్ర‌సాదించారు. ఏం ఫ‌ర్లేదు.. ఇది కూడా మీ స‌ర్కారే.. సంతోషంగా ప‌నిచేసుకోండి. బిల్లులు వెంట‌నే ఇచ్చేస్తాం. అయితే నాణ్య‌త‌లో మాత్రం రాజీ ప‌డొద్దు! అని తేల్చిచెప్పారు.

స‌ర్కారు ఉద్యోగులు స‌మ‌యానికి కార్యాల‌యాల‌కు రాక‌పోతే.. జీతం క‌ట్ చేస్తామ‌న్నారు. మొత్తానికి ప్రమాణం చేసిన రెండో రోజే ఇటు.. రేవంత్‌, అటు లాల్ ఒక‌రిని మించి ఒక‌రు ప్ర‌జాపాల‌న‌కు శ్రీకారం చుట్ట‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News