సీఈసీ అరుణ్ గోయల్ రాజీనామాకు ముందు ఏం జరిగింది?

అరుణ్ గోయల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించినప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Update: 2024-03-11 05:23 GMT

రోజుల వ్యవధిలోకి లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ గడువు ముంచుకొచ్చేసిన వేళలో.. కేంద్ర ఎన్నికల సంఘంలో ఉన్న ఇద్దరు కమిషనర్లలో ఒకరు పదవీకాలం ముగిసిన కారణంగా తమ పదవికి దూరమైతే.. అరుణ్ గోయల్ తన పదవీ కాలం మరో రెండేళ్లు ఉన్నప్పటికీ ఆకస్మికంగా రాజీనామా చేయటం షాకింగ్ గా మారటమే కాదు.. పెను సంచలనానికి తెర తీసింది. కీలకమైన ఎన్నికల ముందు రాజీనామా చేసిన వైనంలో ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని బీజేపీ ముఖ్యుల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన ససేమిరా అనటం ఆసక్తికరంగా మారినట్లు చెబుతున్నారు.

ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. అరుణ్ గోయల్ ను కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నియమించినప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన గోయల్ 2022లో స్వచ్చంద పదవీ విరమణ చేశారు. అనంతరం.. ఆయన్ను ఏరికోరి కేంద్రం సిఫార్సు చేయటం.. ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్ గా ఎంపిక కావటం తెలిసిందే. ఆయన ఎంట్రీ వివాదాస్పదం అయితే.. ఆయన అనూహ్య రాజీనామా (ఎగ్జిట్) సైతం చర్చనీయాంశంగా మారింది.

Read more!

ముక్కుసూటి మనిషిగా.. తనకు తాను తప్పించి.. తననెవరూ ప్రభావితం చేసేందుకు అవకాశం ఇవ్వని అరుణ్ గోయల్.. తన రాజీనామా విషయంలోనూ అదే తీరును ప్రదర్శించారని చెబుతారు. రూల్ మాస్టర్ గా ఆయన్ను ఎన్నికల సంఘం అధికారులు అభివర్ణిస్తుంటారు. మరి.. అలాంటి ఆయన కీలకమైన లోక్ సభ ఎన్నికలకు రోజుల ముందు పదవికి రాజీనామా చేయటం దేనికి నిదర్శనం? అన్నదిప్పుడు ప్రశ్న.

గోయల్ రాజీనామాకు ముందు అసలేం జరిగిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఆయన చివరి పని దినాల్ని చూసినప్పుడు.. మార్చి 5న పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియా భేటీకి హాజరు కావాల్సి ఉంది. కానీ.. ఆయన మాత్రం హాజరు కాలేదు. ఎందుకలా? అన్న ప్రశ్నకు ఆయన ఆరోగ్యం బాగోలేదని అప్పట్లో వివరణ రూపంలో వినిపించినా.. అందులో నిజం లేదని.. ప్రధాన ఎన్నికల కమిషనర్ తో తనకున్న విభేదాల కారణంగానే ఆయన తన పర్యటనను కుదించుకొని బెంగాల్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోయినట్లుగా సమాచారం. అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామా వెనుక.. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో ఉన్న విభేదాలే కారణమని చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. మార్చి 7న కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ఒక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి కేంద్ర చీఫ్ ఎన్నికల కమిషనర్ తో పాటు అరుణ్ గోయల్ సైతం హాజరయ్యారు. ఆ తర్వాతి రోజున ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ అధికారులు.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా మధ్య సమావేశం జరిగింది. ఈ రోజున అనూహ్యంగా అరుణ్ కుమార్ గైర్హాజరయ్యారు. అయితే.. అప్పుడు కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని చెబుతున్నారు. మరి.. అలాంటప్పుడు ఆయనకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లుగా ప్రచారం చేసిందెవరు? అన్నది ప్రశ్న.

4

అంతేకాదు.. ఆయన తన రాజీనామాను నేరుగా ప్రభుత్వానికే పంపారే తప్పించి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కానీ.. సీఈసీకి కానీ సమాచారం ఇవ్వకపోవటం గమనార్హం. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ఓకే చేయటం.. శనివారం ఆయన రాజీనామా ఆమోదానికి సంబంధించిన గెజిట్ వెలువడే క్రమంలో కూడా కేంద్రంలోని పలు ముఖ్య శాఖలకు చెందిన వారికి కూడా సమాచారం లేదని చెబుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం గురించి తెలిసిన వారంతా షాక్ తిన్న పరిస్థితి.

అరుణ్ గోయల్ కు కాస్త ముందుగా మరో ఎన్నికల కమిషనర్ గా ఉన్న అనుప్ చంద్ర పాండే పదవీ కాలం పూర్తి కావటంతో ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. అప్పటివరకు మూడుగా ఉన్న కమిషన్ సంఖ్య రెండుగా అయితే.. తాజాగా అరుణ్ గోయల్ రాజీనామాతో ఒకే ఒక్కడుగా కేంద్ర ఎన్నికల కమిషన్ లో నిలిచారు. మొత్తంగా అరుణ్ గోయల్ ఆకస్మిక రాజీనామాకు సంబంధించిన తెర వెనుక పెద్ద కారణం ఉండి ఉండాలన్న వాదన రాజకీయ వర్గాల్లోనూ.. అధికార వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. అదిప్పట్లో రివీల్ అయ్యే అవకాశం లేదని చెబుతున్నారు.

Tags:    

Similar News