సుప్రీం విశిష్ట అధికారం.. వచ్చే 72 గంటలు కీలకం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నికలు పార్టీల మధ్య సమరాన్నే కాకుండా ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణలు, సుప్రీంకోర్టు అధికారాలకు కూడా పరీక్ష పెడుతున్నాయని అంటున్నారు;

Update: 2026-04-18 18:29 GMT

పశ్చిమ బెంగాల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఈ ఎన్నికలు పార్టీల మధ్య సమరాన్నే కాకుండా ఎన్నికల సంఘం చేపట్టిన సంస్కరణలు, సుప్రీంకోర్టు అధికారాలకు కూడా పరీక్ష పెడుతున్నాయని అంటున్నారు. సర్ ప్రక్రియతో బెంగాల్ లో 90 లక్షలకు పైగా ఓట్లు తొలగించగా, ఆ ఓట్లు పునరుద్ధరణకు పార్టీలు న్యాయపోరాటం చేస్తున్నాయి. తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని పలువురు అప్పీల్ చేసుకున్నారు.

ఇలా సుమారు 27 లక్షల మంది ఓటర్లు తొలవిడత పోలింగ్ నాటికి ఓటు హక్కు పొందేందుకు ఎదురుచూస్తున్నారని అంటున్నారు. ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా, 21వ తేదీ లోగా వీరి ఓట్లు తిరిగి చేర్చాల్సివుందని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేవలం 200 అప్పీళ్లను మాత్రమే ట్రిబ్యునల్ పరిష్కరించడంతో గడువులోగా మిగిలిన అప్పీళ్లు పరిష్కరించే పరిస్థితి ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో తొలి విడత ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారిందని అంటున్నారు.

అప్పీళ్లు పరిష్కారమైతేనే తొలగించిన ఓటర్లు తిరిగి ఓటు వేసే పరిస్థితి ఉంటుందని అంటున్నారు. ఓటర్ల తొలగింపుపై దాఖలైన అప్పీళ్లను విచారించిన సుప్రీం ధర్మాసనం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టియ్ జాయ్ మాల్య బాగ్చి ధర్మాసనం విచారణ సమయంలో అప్పీలు పెండింగ్ లో ఉన్నంత మాత్రాన ఓటు హక్కు లభించదని స్పష్టం చేసింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం తన ప్రత్యేకాధికారాలను ఉపయోగించింది. ఎన్నికల పోలింగ్ తేదీకి రెండు రోజుల ముందులోగా అప్పీళ్లను పరిష్కరించాలని, అలా అనుమతించిన ఓటర్ల కోసం సప్లిమెంటరీ ఓటరు జాబితా సిద్ధం చేయాలని సూచించింది.

సుప్రీం సూచనలతో 19 అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటయ్యాయి. వీటి ముందు దాదాపు 91 లక్షల ఓటర్లు అప్పీలు చేసుకోగా, ప్రత్యేక అప్పీలేట్ ట్రిబ్యునల్స్ విచారణ జరుపుతున్నాయి. అయితే అప్పీళ్ల పరిష్కారం నత్తనడకన నడుస్తుండటంతో ఓటర్లు, పార్టీలు తీవ్ర ఆందోళనతో గడుపుతున్నాయి. అయితే అప్పీలేట్ ట్రిబ్యునల్స్ ఆమోదించిన ఓట్లు తమ డ్యాష్ బోర్డులోకి వస్తేనే ఓటు వేసేందుకు అనుమతిస్తామని బెంగాల్ సీఈవో మనోజ్ అగర్వాల్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. తొలిదశకు సమయం ముంచుకొస్తుండటంతో 27 లక్షల ఓటర్ల అప్పీళ్లు పరిష్కారమవుతాయా? సప్లిమెంటరీ ఓటర్ల జాబితాలు ఎప్పుడు తయారవుతాయనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News