ముంబైలో మెగా ఈవెంట్.. ప్రధాని మోదీ చేతుల మీదుగా 'వేవ్స్ 2025' ప్రారంభోత్సవం!
ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.;
ప్రపంచ వేదికపై భారత్‌ను ఒక గొప్ప ఎంటర్ టైన్ మెంట్ కేంద్రంగా నిలబెట్టాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' (WAVES 2025) ముంబైలో నేటి నుంచి (మే 1) అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతుంది. నాలుగు రోజుల పాటు (మే 1 - మే 4) జరిగే ఈ సమ్మిట్‌లో కేవలం భారతీయ సినిమాల గురించే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, కామిక్స్, డిజిటల్ మీడియా, యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) వంటి అనేక వినోద పరిశ్రమల అంశాలపై లోతైన చర్చలు జరగనున్నాయి.
ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు వేవ్స్ సలహా మండలిలోని ప్రముఖ సభ్యులు కూడా హాజరై తమ విలువైన సూచనలు, సలహాలను అందించనున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక సమ్మిట్ కోసం సినీ, వ్యాపార, సాంకేతిక రంగాలకు చెందిన అనేక ప్రముఖులు ఇప్పటికే ముంబైకి చేరుకున్నారు.
90కి పైగా దేశాల నుండి విశిష్ట అతిథులు
క్రియేటివిటీని ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ వేవ్స్ సమ్మిట్‌లో దాదాపు 90కి పైగా దేశాల నుండి 10 వేలకు పైగా ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో 1000 మందికి పైగా క్రియేటర్లు, 300 కంపెనీలు, 350కి పైగా స్టార్టప్‌లు, అనేకమంది సినీ ప్రముఖులు ఒకే వేదికపై కలవనున్నారు. దీంతో ఈ కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన 'క్రియేట్ ఇండియా' ఛాలెంజ్‌లో విజేతలుగా నిలిచిన వారికి ప్రధాని మోదీ ప్రత్యేక అవార్డులను ప్రదానం చేయనున్నారు.
ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
ఇటువంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినీ పరిశ్రమకు ఆయన అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఇది ఒక చరిత్రాత్మకమైన అడుగు అని వారు అభివర్ణించారు. అలాగే, ఈ సమ్మిట్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ వేవ్స్ సలహా మండలి సభ్యులతో ఇదివరకే పలుమార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించారు. వారి నుండి విలువైన సలహాలు, సూచనలు స్వీకరించారు.
ఈ సమ్మిట్‌లో పాల్గొనబోయే ప్రముఖులలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, చిరంజీవి, షారుఖ్ ఖాన్, మోహన్‌లాల్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణె, అల్లు అర్జున్ వంటి సినీ తారలతో పాటు ముఖేష్ అంబానీ, సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, ఆనంద్ మహీంద్రా వంటి వ్యాపార దిగ్గజాలు కూడా ఉన్నారు.