కేసీఆర్ భద్రత తొలగింపుపై రేవంత్ తొందరపడ్డారా?
దీనికి కారణం.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ రెండు వారాల్లో రేవంత్ తీసుకున్న ప్రతి నిర్ణయం అందరిని ఆకర్షించటమే కాదు.. అభినందనలు పొందేలా చేస్తోంది.;
అందరూ చేసే పనే చేస్తే ప్రత్యేకత ఏముంటుంది? అధికారంలోకి వచ్చినంతనే ప్రతిపక్ష నేతకు అప్పటివరకున్న భద్రతను త్గగించేయటం మామూలే. అలాంటి సాదాసీదా చర్యనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ తీసుకోవటం ఆసక్తికర చర్చగా మారింది. దీనికి కారణం.. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ రెండు వారాల్లో రేవంత్ తీసుకున్న ప్రతి నిర్ణయం అందరిని ఆకర్షించటమే కాదు.. అభినందనలు పొందేలా చేస్తోంది. అలాంటప్పుడు తొందరపాటు అస్సలు పనికి రాదు.
ఎందుకు జరిగిందో? ఎవరి ఫీడ్ బ్యాక్ కు ప్రభావితం అయ్యారో కానీ.. మాజీ ముఖ్యమంత్రిగా.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత హోదాలో ఉండనున్న కేసీఆర్ కు అంత అర్జెంట్ గా జెడ్ కేటగిరి భద్రతను కుదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మాజీ ముఖ్యమంత్రికి మరింత కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తే పోయే నష్టం ఏముంది? ముఖ్యమంత్రిగా ఉన్న వేళలో కేసీఆర్ ప్రదర్శించే ఆడంబరాలు.. విలాసాలపై ప్రజల్లో ఇప్పటికే ఒక అవగాహన ఉంది. అలాంటప్పుడు.. కేసీార్ భద్రతను తొలగించటం ద్వారా.. సగటు పొలిటిషియన్ గానే సీఎం రేవంత్ తీరు ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటివరకు జెడ్ సెక్యూరిటీ ఉన్న కేసీఆర్ కు ఇప్పుడు వై కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. కేసీఆర్ ఇంటి వద్ద సెంట్రీ గన్ మెన్ తో పాటు 4 ప్లస్ 4 గన్ మెన్లతో భద్రత కల్పించనున్నారు. అంతేకాదు.. కేసీఆర్ కాన్వాయ్ కోసం ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. సెక్యూరిటీ కుదింపు మాజీ ముఖ్యమంత్రితో పాటు.. మంత్రులుగా వ్యవహరించి.. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి సైతం సెక్యూరిటీ కుదింపు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మాజీ మంత్రులకు 2 ప్లస్ 2 సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు.
అదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు.. కార్పొరేషన్ ఛైర్మన్లకు సెక్యూరిటీలను పూర్తిగా తొలగిస్తూ రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. అయితే..ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. మిగిలిన వారి సంగతి ఎలా ఉన్నా.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో రేవంత్ ఆలోచన తీరులో మార్పు రావాల్సి ఉందని చెబుతున్నారు. తాను ఆడంబరాలకు దూరంగా ఉంటూ.. తనకు ఇచ్చిన కాన్వాయ్ ను సైతం కుదించుకుంటూ కొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఇలాంటి వేళ.. కేసీఆర్ కు జెడ్ సెక్యూరిటీని కంటిన్యూ చేసి ఉంటే.. రేవంత్ అంచనాలు అందని రీతిలో ఉంటాయన్న భావన కలిగేది.
రాష్ట్ర ముఖ్యమంత్రి సెక్యూరిటీ కంటే మాజీ సీఎం సెక్యూరిటీ ఎక్కువగా ఉందన్న మాట సీఎం రేవంత్ కు మరింత మైలేజీని కలిగించేది. ప్రజల్లో ఆయన హీరోగా మారేవారు. ముఖ్యమంత్రిగా ఉండేవారు విపక్ష నేతను టార్గెట్ చేస్తారన్న నమ్మకం ప్రజల్లో బలంగా ఉంటున్న వేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించి ఉంటే మరింత బాగుండేది. అందుకు భిన్నంగా.. తన తొలి తప్పును తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు చేయకుండా సీఎం రేవంత్ ఎలా జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలన్న మాట వినిపిస్తోంది.