రేవంత్, లోకేశ్ ఒకే స్ట్రాటజీ.. జైలు భయమే అసలు ఉద్దేశం!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీలో యువనేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా ఒకే వ్యూహం అనుసరిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది.;

Update: 2026-02-16 23:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీలో యువనేత, ఐటీ మంత్రి నారా లోకేశ్ రాజకీయంగా ఒకే వ్యూహం అనుసరిస్తున్నారా? అన్న చర్చ జరుగుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ గా పావులు కదుపుతున్న రేవంత్ రెడ్డి, లోకేశ్ తమ రాజకీయ ప్రత్యర్థులను జైలుకు పంపే విషయంలో వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు. దీనికి కొన్ని గత అనుభవాలే కారణమంటున్నారు. ప్రత్యర్థులను జైలుకు పంపి నిందితులను బాధితులుగా మార్చడం కన్నా, వాళ్లపై నెగిటివిటీని ఎల్లప్పుడూ ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా రాజకీయంగా ఇరుకున పెట్టాలనే వ్యూహమే కనిపిస్తోందని అంటున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన నుంచి రాజకీయ ప్రత్యర్థులపై వరుస కేసులు నమోదు అవుతున్నాయి. తెలంగాణలో ఫార్ములా వన్ రేసు, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, ఫోన్ ట్యాపింగ్ ఇలా వరుస పెట్టి కేసులు నమోదు చేశారు. అదే సమయంలో ఏపీలో మద్యం స్కాం, మైనింగ్ స్కాం, ఏపీపీఎస్సీ మూల్యాంకనం, తిరుమల లడ్డూ, అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణ ఇలా ఎన్నో కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో రెండు రాష్ట్రాల్లోని విపక్ష నేతలపై ఆరోపణలు చేస్తూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. తెలంగాణలో అయితే ప్రతిపక్షం బీఆర్ఎస్ కు చెందిన ముఖ్యనేతలు అయిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావును విచారణకు పిలిచి అరెస్టు చేస్తామంటూ హడావుడి చేశారు.

అదేవిధంగా ఏపీలో కూడా పలువురు వైసీపీ నేతల అరెస్టులు జరుగుతున్నాయి. ఇదే సమయంలో బిగ్ బాస్, అంతిమ లబ్ధిదారు అంటూ పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ను లక్ష్యంగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కానీ, ఏ కేసులోనూ ఇప్పటివరకు జగన్ పాత్ర నిర్ధారించడం కానీ, విచారణకు రమ్మంటూ నోటీసులు ఇవ్వడం కాని చేయలేదు. అటు తెలంగాణలో కూడా విచారణల పేరిట పోలీసుస్టేషన్, కోర్టు, దర్యాప్తు అధికారుల ముందు ప్రత్యర్థులను కూర్చోపెట్టడమే కానీ అరెస్టులు వంటి తీవ్ర నిర్ణయానికి వెళ్లడం లేదు.

దీనికి కారణం రెండు రాష్ట్రాల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న వ్యూహమే అంటున్నారు. రాజకీయ ప్రత్యర్థులను అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయడం, ప్రజల్లో వారి పరపతిని దెబ్బతీయడమన్న వ్యూహమే కనిపిస్తోందని అంటున్నారు. రాష్ట్రంలో ఏదైనా రాజకీయ పరిణామం వల్ల అధికార పార్టీ ఇబ్బంది పడుతుందనే సమయంలో ప్రత్యర్థులపై కేసులు, కుంభకోణాలు అంటూ హడావుడి చేస్తుండటం వల్ల ప్రజల దృష్టిని మళ్లించడమన్న ఎత్తుగడ ఎక్కువగా ఉపయోగించుకుంటున్నట్లు చెబుతున్నారు.

అటు తెలంగాణ, ఇటు ఏపీలో రెండు ప్రభుత్వాలు ఇంచుమించు ఒకటే వ్యూహంతో నడుచుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడం ద్వారా వారిపట్ల ప్రజల్లో సానుభూతి వస్తుందన్న ఆలోచన ప్రభుత్వాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయని అంటున్నారు. అందుకే ఆరోపణలు చేస్తూ ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బకొట్టడమన్న వ్యూహమే సరైనది అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ అనుసరిస్తున్న ఈ వ్యూహం సరైనదేనా, కాదా? అన్న చర్చ కూడా ఎక్కువగానే సాగుతోంది. ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబును, రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడం వల్లే వారు ముఖ్యమంత్రులు కాగలిగారని వాదిస్తున్న వారు సమర్థిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి లోకేశ్ వైఖరిని వ్యతిరేకిస్తున్న వారు తమ వాదనను వినిపిస్తున్నారు. ఢిల్లీ సీఎంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ ను అవినీతి కేసుల్లో అరెస్టు చేశారని, కానీ ఆయనపై ఎలాంటి సానుభూతి వ్యక్తం కాలేదని ఎత్తిచూపుతున్నారు. అయితే రెండు పార్టీలో ఈ వాదనకు పెద్దగా ఆదరణ లభించడం లేదని చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితుల వల్ల రాజకీయ ప్రత్యర్థులను అరెస్టు చేయడం సరైన నిర్ణయం కాదన్న అభిప్రాయాన్నే ఎక్కువ మంది సమర్థిస్తున్నారని అంటున్నారు. అందువల్లే సీఎం రేవంత్, మంత్రి లోకేశ్ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని చెబుతున్నారు.

Tags:    

Similar News