సొంత ఇంటి కల.. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు.. యువత రెండు దారులు

ఒకప్పుడు భారతదేశంలో "సొంత ఇల్లు" అనేది రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నప్పుడు లేదా కనీసం 35-40 ఏళ్ల వయసులో వచ్చే ఒక జీవితకాల సాఫల్యం.;

Update: 2026-02-17 01:30 GMT

ఒకప్పుడు భారతదేశంలో "సొంత ఇల్లు" అనేది రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నప్పుడు లేదా కనీసం 35-40 ఏళ్ల వయసులో వచ్చే ఒక జీవితకాల సాఫల్యం. కానీ నేటి జెన్ జెడ్ , మిలీనియల్స్ ఆ పాత సూత్రాలను తిరగరాస్తున్నారు. "ముందు సెటిల్ అవ్వాలి.. ఆపై ఇల్లు కొనాలి" అనే ధోరణి పోయి "ఇల్లు ఉంటేనే సెటిల్ అయినట్లు" అనే కొత్త భావజాలం యువతలో బలంగా నాటుకుంటోంది.

మారిన ప్రాధాన్యతలు.. మారిన మార్కెట్

బేసిక్ హోం లోన్ సర్వే వెల్లడించిన గణాంకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి. సగటు గృహ రుణ గ్రహీత వయసు 35 నుండి 25 ఏళ్లకు పడిపోవడం అనేది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు.. ఒక సామాజిక పరిణామం. నేటి యువత చదువు పూర్తి కాగానే మంచి ప్యాకేజీతో ఉద్యోగంలో చేరగానే మొదటి ప్రాధాన్యతగా ఇల్లు కొనడాన్నే ఎంచుకుంటున్నారు. రిజిడెన్షియల్ మార్కెట్‌లో 90-95% వాటా యువతదే ఉండటం గమనిస్తే రియల్ ఎస్టేట్ రంగానికి వీరే ఇప్పుడు అసలైన ఇంజన్లు అని స్పష్టమవుతోంది.

డిజిటల్ విప్లవం.. క్లిక్ చేస్తే లోన్!

గతంలో బ్యాంకుల చుట్టూ తిరగడం.. కాగితాల కుప్పలు నింపడం ఒక ప్రహసనంలా ఉండేది. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ మయం. 72% మంది యువత మొబైల్ నుండే లోన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. కేవలం యువత మాత్రమే కాదు, 60 ఏళ్ల పైబడిన వారు కూడా (47%) డిజిటల్ బాట పట్టడం విశేషం.అయినప్పటికీ భారీ డాక్యుమెంటేషన్, ఏజెంట్ల ప్రలోభాలు వంటి అడ్డంకులు ఇంకా తొలగలేదు. వీటిని అధిగమిస్తే హోమ్ లోన్ మార్కెట్ మరింత పారదర్శకంగా మారుతుంది.

ఆస్తి కంటే.. అదొక భద్రత

నేటి అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో ఇల్లు అనేది కేవలం ఒక స్థిరాస్తి మాత్రమే కాదు.. అదొక 'సేఫ్టీ నెట్'. మెట్రో నగరాల్లో అద్దెలు ఆకాశాన్ని తాకుతుండటంతో "రెంటు కట్టే బదులు ఈఎంఐ కట్టడం మేలు" అనే ఆలోచన బలపడుతోంది. లే-ఆఫ్స్ భయం ఉన్న కాలంలో కనీసం ఉండటానికి సొంత ఇల్లు ఉందనే ధీమా యువతకు మానసిక స్థిరత్వాన్ని ఇస్తోంది. కేవలం ఉండటానికే కాకుండా చిన్న వయసులోనే పెట్టుబడిగా భావించి టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఇళ్లు కొని రెంట్‌కు ఇస్తున్నారు.

ప్రపంచ ధోరణి: ఇల్లా? స్టాక్ మార్కెటా?

భారత యువత ఇల్లు కొనడం వైపు మొగ్గు చూపుతుంటే పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా అమెరికాలో భిన్నమైన పరిస్థితి ఉంది. అక్కడ ఇంటి ధరలు విపరీతంగా పెరగడంతో యువత అద్దె తోపాటు పెట్టుబడి సూత్రాన్ని పాటిస్తున్నారు. ఇల్లు కొని భారీ ఈఎంఐలు కట్టడం కంటే అద్దె ఇంట్లో ఉంటూ మిగిలిన డబ్బును స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టడం వల్ల ఎక్కువ లిక్విడిటీ, రిటర్న్స్ వస్తాయని వారు నమ్ముతున్నారు. గత పదేళ్లలో 25-39 ఏళ్ల మధ్య ఉన్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మూడు రెట్లు పెరగడం దీనికి నిదర్శనం.

భారతదేశంలో ఒకవైపు భావోద్వేగపూరితమైన "సొంత ఇంటి కల".. మరోవైపు ఆధునిక ఆర్థిక స్వేచ్ఛ కోసం చూసే "స్టాక్ మార్కెట్ పెట్టుబడులు" - ఈ రెండింటి మధ్య యువత సమతుల్యం సాధించాల్సిన సమయం ఆసన్నమైంది.

25 ఏళ్లకే ఇల్లు కొనడం అనేది బాధ్యతాయుతమైన నిర్ణయమే అయినప్పటికీ అది ఆర్థిక భారంగా మారకుండా చూసుకోవాలి. అటు స్థిరాస్తి , ఇటు ద్రవ్య ఆస్తుల మధ్య సరైన పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవడమే భవిష్యత్తు భారతీయుడి అసలైన విజయం.

Tags:    

Similar News