బిల్ గేట్స్ ఏపీ టూర్ : మంత్రి కొలుసు పార్దసారధి సోషల్ మీడియా పోస్ట్ వైరల్
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏపీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం ఉదయం రాజధాని అమరావతిలో పర్యటించిన బిల్ గేట్స్ సాయంత్రం వరకు గడిపారు.;
మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఏపీ పర్యటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోమవారం ఉదయం రాజధాని అమరావతిలో పర్యటించిన బిల్ గేట్స్ సాయంత్రం వరకు గడిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ ను సందర్శించడమే కాకుండా, మంత్రులు, సెక్రటరీలతో సమావేశం అయ్యారు. ఉండవల్లిలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీతో చేపడుతున్న సాగు విధానాన్ని పరిశీలించారు. అయితే బిల్ గేట్స్ పర్యటనను అధికార కూటమి ప్రసార మాధ్యమాల ద్వారా హైలెట్ చేయడానికి ప్రయత్నించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన మంత్రివర్గం అంతా బిల్ గేట్స్ కు ఆతిథ్యం ఇచ్చే విషయంలో ప్రత్యేక చొరవ ప్రదర్శించారు.
ఇక ఈ సందర్భంగా మంత్రులు తమ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో ప్రత్యేకంగా పోస్టులు రాశారు. అందరికన్నా భిన్నంగా సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. నిజానికి బిల్ గేట్స్ అమరావతి పర్యటన రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని అంశంగా చెబుతున్నారు. కేవలం రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతి తెలుసుకోడానికి ఈ పర్యటనను పరిమితం చేశారు. కానీ అధికార పార్టీ ఇచ్చిన హైప్ తో బిల్ గేట్స్ పర్యటన రాజకీయంగా చర్చకు దారి తీసింది. ముఖ్యంగా మంత్రి కొలుసు పార్ధసారధి పెట్టిన ఓ సోషల్ మీడియా పోస్టింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెర లేపింది.
ఇంతకీ ఆ పోస్ట్ సారాంశం ఏమిటంటే... బిల్ గేట్స్ అమరావతికి వచ్చి సెక్రటేరీయేట్ చేరుకున్న తర్వాత... సీఎం చంద్రబాబు తన మంత్రి వర్గ సహచరులు అందర్నీ పేరు పేరునా బిల్ గేట్స్ కు పరిచయం చేశారు. దీనికి సంబంధించి మంత్రి కొలుసు పార్ధసారధి తన సోషల్ మీడియా హ్యాండిల్సులో ఆసక్తికరమైన ఓ పోస్ట్ పెట్టారు. “చంద్రబాబు గారితో ఉంటే బిల్ గేట్స్ ను కలుస్తారు... జగన్ ను నమ్ముకుంటే గేట్ బయట ఉంటారు..” అని కామెంట్ చేస్తూ రెండు ఫొటోలను జత చేశారు. సీఎం చంద్రబాబు తనను బిల్ గేట్స్ కు పరిచయం చేస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలాగే దీనికి మరో ఫొటో జత చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఓసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు సామాజిక వర్గాలకు చెందిన ఎంపీలను తన ఇంటి గుమ్మం బయటే నిలబెట్టిన ఫొటో అప్పట్లో బాగా వైరల్ అయింది. ఆ నాటి ఫొటోను మొదటి ఫొటోకు జత చేసి మంత్రి కొలుసు పోస్ట్ చేశారు.
ఇప్పుడిదే సోషల్ మీడియాలో ట్రెడింగ్ గా మారిందని అంటున్నారు. తన సహచరులను చంద్రబాబు ఎలా ట్రీట్ చేస్తారు..? జగన్ మోహన్ రెడ్డి ఎలా ట్రీట్ చేస్తారనేది మంత్రి కొలుసు పోస్ట్ ద్వారా తెలియజేశారని అంటున్నారు. మంత్రి కొలుసు పార్ధసారది పూర్వాశ్రమంలో వైసీపీలో ఉండేవారు. దీంతో ఆ పార్టీలో పరిస్థితులేంటో, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైఖరి ఎలా ఉంటుందనే విషయాన్ని వివరిస్తూ విమర్శనాత్మకంగా పోస్టు పెట్టారని అంటున్నారు. నాడు తాను పడ్డ అవమానాలను... ఇప్పుడు తనకు జరుగుతున్న సత్కారాలను పోల్చుతూ మంత్రి కొలుసు పోస్టింగ్ చేశారని టీడీపీ సోషల్ మీడియా వైరల్ చేస్తోంది. ఇదే సమయంలో మాజీ జగన్ మోహన్ రెడ్డితో సహచర్యం చేసిన రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు జైళ్ల పాలు అయ్యారంటూ టీడీపీ ఆరోపిస్తోంది.