వైసీపీకి కొలికపూడి ఆఫర్.. మళ్లీ తిరువూరు ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్ రచ్చ

టీడీపీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.;

Update: 2026-02-16 18:44 GMT

టీడీపీకి చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరు ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును పరోక్షంగా విమర్శిస్తూ వాట్సాప్ స్టేటస్ పెట్టిన ఎమ్మెల్యే కొలికపూడి అధిష్టానం నుంచి చీవాట్లు తిన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ముందు ‘పల్లె కన్నీరు పెడుతోంది’ అంటూ తిరువూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కొలికపూడి పెట్టిన పోస్టు రాజకీయాల్లో కలకలం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ప్రభుత్వ పాలనను విమర్శించేలా పోస్టులు పెట్టడంపై ఎమ్మెల్యే అధిష్టానం ఆగ్రహానికి గురయ్యారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఎమ్మెల్యే కొలికపూడిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో మందలించారు. ఈ విషయమై సీఎం సీరియస్ గా ఉన్నారని, ఇకపైనా ఇదేవిధంగా వ్యవహరిస్తే ఎమ్మెల్యేగా గుర్తించడం కూడా మానేస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇది జరిగిన రెండు రోజులుకు మంత్రి నారా లోకేశ్ తన ఇంట్లో శాసనసభ్యులకు ఇస్తున్న విందులో కొలికపూడి కనిపించారు. దీంతో అధిష్టానంతో ఆయనకు సఖ్యత కుదిరిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ నేపథ్యంలో కొలికపూడి తాజాగా పెట్టిన పోస్టు మరోసారి చర్చకు దారితీసింది. ఎప్పుడూ విలక్షణంగా పనిచేసేందుకు సిద్ధమయ్యే క్రమంలో వివాదాల్లో కూరుకుపోతున్న ఎమ్మెల్యే కొలికపూడి ఈ సారి అత్యంత జాగ్రత్తగా వాట్సాప్ పోస్టు రాశారు. అయితే ఆయన తన వాట్సాప్ పోస్టులో వైసీపీ పార్టీ పేరు ప్రస్తావించడం తీవ్ర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు బడ్జెట్ పై నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాలని భావించిన ఎమ్మెల్యే ఆ సమావేశానికి వైసీపీతోపాటు ఇతర పార్టీలను ఆహ్వానించారు. రాజకీయంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్టే అయినా, ఎమ్మెల్యే భిన్నంగా వ్యవహరించడం చర్చకు దారితీసింది.

ఎమ్మెల్యేగా గెలిచిన నుంచి కొలికపూడి పలు వివాదాల్లో కూరుకున్నారు. పార్టీ అధిష్టానం ఆగ్రహానికి గురైనా ఆయన వైఖరిలో మార్పు ఉండటం లేదని కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నితో విభేదాలతో నియోజకవర్గంలో కొలికపూడి ఒంటరి వారు అయ్యారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలను ఆకట్టుకునేలా పనిచేయాల్సింది పోయి వివాదాలు మరింత తీవ్రతరం చేసుకుంటున్నారని అంటున్నారు. దీనిపై ఇటీవల పార్టీ అధిష్టానం నిలదీస్తే, తనకు రాజకీయంగా అనుభవం లేదని, ఎలా నడుచుకోవాలో మార్గనిర్దేశం చేయాలని సీనియర్లు తనకు సహకరించాలని కొలికపూడి కోరినట్లు వార్తలు వచ్చాయి.

ఇక తాజాగా రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులపై విపక్షం విమర్శలు చేస్తుండటాన్ని తిప్పికొట్టాలని పార్టీ అధిష్టానం సూచిస్తే, అందుకు తగ్గట్టుగానే కొలికపూడి నియోజకవర్గంలో పావులు కదపడం కేడర్ ను ఆకట్టుకుందని అంటున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలు మాదిరిగా ప్రెస్ మీట్లు, మీడియా చిట్ చాట్ లు కాకుండా, బడ్జెట్ పై అన్నిపార్టీలు, రంగాల వారికి అవగాహన కల్పించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించడం, దానికి వైసీపీ నేతలను కూడా రమ్మంటూ వాట్సాప్ స్టేటస్ ద్వారా ఆహ్వానం పంపడం రాజకీయంగా చర్చనీయాంశం అవుతోంది. మొత్తానికి ఈ సారి వాట్సాప్ స్టేటస్ ద్వారా పార్టీని ఆకట్టుకునే ప్రయత్నం చేశారని అంటున్నారు.

Tags:    

Similar News