ఎమ్మెల్యే సార్‌.. ఏం చేస్తున్నారు... !

రాష్ట్రంలోని కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల‌కు పెద్ద చిక్కే వ‌చ్చింది. వారు ఏం చేస్తున్నార‌న్న విష‌యంపై స‌ర్కారు ఆరా తీస్తోంది.;

Update: 2026-02-16 16:30 GMT

రాష్ట్రంలోని కూట‌మి పార్టీల ఎమ్మెల్యేల‌కు పెద్ద చిక్కే వ‌చ్చింది. వారు ఏం చేస్తున్నార‌న్న విష‌యంపై స‌ర్కారు ఆరా తీస్తోంది. ప్ర‌స్తుతం అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. శ‌నివారం బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టారు. గ‌త ఏడాది బ‌డ్జెట్ తో పోల్చితే.. అనేక విష‌యాల్లో మార్పులు జ‌రిగాయి. ఇక‌, ఆదివారం మ‌హాశివ‌రాత్రి, సోమ‌వారం దీనికి అనుబంధంగా వ‌చ్చిన సెల‌వు కావ‌డంతో అసెంబ్లీకి కూడా సెల‌వు ప్ర‌క‌టించారు.

దీంతో ఎమ్మెల్యేలు ఆదివారం భ‌క్తిపార‌వ‌శ్యంతోను, సోమ‌వారం కుటుంబ పార‌వ‌శ్యంతోనూ గ‌డిపేయాల‌ని అనుకున్నారు. క‌ట్ చేస్తే.. వారికి ఆ ఛాన్స్ చిక్క‌లేదు. ఎందుకంటే.. ఆదివారం సాయంత్రం 6 త‌ర్వాత‌.. సీమ ప్రాంతంలోని నాలుగు జిల్లాల ఎమ్మెల్యేల ఫోన్లు రింగు రింగుమ‌న్నాయి!. దీంతో ఎమ్మెల్యేలు.. ఫోన్లు ఎత్త‌గానే.. అటు నుంచి.. ''ఎమ్మెల్యే సార్‌.. ఏం చేస్తున్నారు?!'' అని ప్ర‌శ్న‌. ''ఈ వాయిస్ ఎక్క‌డో విన్న‌ట్టుందే..'' అని ఎమ్మెల్యేలు అనుకున్నా.. అవ‌తలి వారు ఎవ‌రో తెలుసుకునేలోగా కొన్ని చిత్ర‌మైన ప్ర‌శ్న‌లు వ‌చ్చాయి.

''బ‌డ్జెట్‌ను అధ్య‌య‌నం చేస్తున్నారా ?''... '' మీ సీమ ప్రాంతానికి ఉద్యానవ‌న అభివృద్ధికి నిధులు బాగా కేటాయించారు. వాటిపై అవ‌గాహ‌న పెంచుకున్నారా?'' అంటూ.. ఒకే వ‌రుస‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం. దీంతో ఉక్కిరి బిక్కిరి అయిన.. ఎమ్మెల్యేలు.. కాల్ చివ‌ర‌.. వ‌చ్చిన సూచ‌న‌ల‌ను పాటించి '1' నొక్కార‌ట‌. ఇంత‌కీ కాల్ చివ‌ర‌న‌.. అడిగిన 1, 2, 3 అంకెల్లో 1) అధ్య‌య‌నం చేశాను. బాగుంది. 2) అధ్య‌య‌నం చేశాను కానీ, అర్ధంకాలేదు. 3) ఇంకా అధ్య‌య‌నం చేయాలి. అని ఉంద‌ట‌!.

విష‌యం ఏంటంటే.. !

మంగ‌ళ‌వారం నుంచి వ‌రుస‌గా రెండు రోజుల పాటు అసెంబ్లీలో బ‌డ్జెట్పై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. ఈ చ‌ర్చ‌లో పాల్గొనే ఎమ్మెల్యేలు త‌మ త‌మ ప్రాంతాల‌కు జ‌రిగిన కేటాయింపులు.. త‌ద్వారా జిల్లాల‌కు జ‌రిగే ప్ర‌యోజ‌నాల‌ను అధ్య‌య‌నం చేసి.. అసెంబ్లీలో ప్ర‌స్తావించాల్సి ఉంది. ఈ విష‌యాన్ని అటు స్పీక‌ర్ అయ్య‌న్న పాత్రుడు, ఇటు సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. ఈ నేప‌థ్యంలోనే రెండురోజుల సెల‌వుల‌ను యుటిలైజ్ చేసుకోవాల‌ని సూచించారు. దీంతో ఆదివారం నుంచి ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా ఎమ్మెల్యేల‌కు నేరుగా ఫోన్లు చేసి.. విష‌యం తెలుసుకున్నార‌న్న మాట‌.

Tags:    

Similar News