ఏపీలోని ఆ మూడు చోట్ల ఓటు చాలా ఖరీదట

ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. మూడు నియోజకవర్గాలు చాలా చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు.

Update: 2024-05-10 06:43 GMT

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ఎంత హోరాహోరీగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గడిచిన పాతికేళ్లలో ఇంత హోరాహోరీగా సాగుతున్న ఎన్నికలు ఇవేనని చెబుతున్నారు. అధికారపక్షం.. విపక్షం రెండూ ఎక్కడా తగ్గకుండా ఎన్నికల్లో గెలుపు కోసం తమ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే.. మూడు నియోజకవర్గాలు చాలా చాలా ప్రత్యేకంగా చెబుతున్నారు.

అందులో మొదటిది జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలో ఉన్న పిఠాపురం కాగా.. రెండోది నారాలోకేశ్ బరిలో ఉన్న మంగళగిరి.. మూడోది చంద్రబాబుకు కంచుకోటగా అభివర్ణించే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం. ఈ మూడింటి మీదా ఏపీ అధికారపక్షం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వైనాట్ 175? నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన నినాదాన్ని ఆయన పూర్తిస్థాయిలో నమ్ముతున్నారు. సాధారణంగా ఎన్నికలకు ముందు ఒకలా.. ఎన్నికల వేళలో మరోలా.. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ దగ్గర పడేకొద్దీ ఇంకోలా వ్యవహరించటం మామూలే.

Read more!

కానీ.. జగన్మోహన్ రెడ్డి తీరు మాత్రం భిన్నమని చెబుతున్నారు. ప్రత్యర్థిని మట్టి కరిపించటం.. అది కూడా తన పూర్తి అధిక్యతను ప్రదర్శించేలా ఆయన వ్యూహం ఉంటుంది. ఇదే మైండ్ సెట్ ను తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ప్రదర్శిస్తున్నారు. వైనాట్ 175? అన్న నినాదానికి తగ్గట్లు ప్లానింగ్ సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో అందరి చూపు ఉన్న నియోజకవర్గాల్లో మొదట పిఠాపురం మీదనే ఉంది. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓటమిపాలైన నేపథ్యంలో.. ఈసారి ఎన్నికల్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అదే సమయంలో పవన్ ను ఓడించటం ద్వారా తమ అధిక్యతను చాటి చెప్పాలని అధికార వైసీపీ తపిస్తోంది.

ఇక.. మంగళగిరి స్థానంలోనూ అదే పరిస్థితి. విపక్ష నేత కుమారుడు కం మాజీ మంత్రిగా వ్యవహరించిన నారా లోకేశ్ గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈసారి ఈ స్థానంలో విజయం సాధించటం ద్వారా విపక్షాన్ని.. విపక్ష నేతలు చేస్తున్న వాదనలో పస లేదని.. వారి ప్రచారాన్ని ప్రజలు నమ్మట్లేదన్న సందేశాన్ని మంగళగిరి విజయం ద్వారా స్పష్టం చేయాలని అధికార వైసీపీ భావిస్తోంది.

చంద్రబాబుకు కంచుకోటగా ఉన్న కుప్పంలో మెజార్టీని తగ్గించటం ద్వారా తమ సత్తా చాటాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో గెలిచి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి కుప్పంపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీని గెలిచేలా చేయటం ద్వారా చంద్రబాబుకు షాకిచ్చారు. ఇప్పుడు అలాంటి షాకే ఇవ్వటం ద్వారా తన సంపూర్ణ అధిక్యతను ప్రదర్శించాలని తహతహలాడుతున్నారు.

4

ఇలా.. ఈ మూడు స్థానాలకు మూడు ప్రత్యేకమైన కారణాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ గెలుపు కోసం పార్టీలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. తమ ప్రత్యర్థుల ఎత్తుగడలకు చిత్తు కాకుండా ఉండేందుకు ఖర్చుకు వెనుకాడటం లేదంటున్నారు. విశ్వసనీ సమాచారం ప్రకారం ఈ మూడు స్థానాల్లో ఓటుకు కనిష్ఠంగా రూ.2వేలు.. గరిష్ఠంగా రూ.4వేల వరకు ఇచ్చేంకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. దీంతో.. ఈ మూడు నియోజకవర్గాల్లోని ఓటర్లకు నోట్ల పండుగగా మారిందంటున్నారు. ప్రతి ఒక్కరి చేతుల్లో నగదు పెట్టటం.. వారు వద్దని చెబుతున్నా.. వినకుండా ఉంచుకోవాలని చెబుతూ ముందుకు వెళ్లిపోతున్నారు. దీంతో.. ఈ మూడు నియోజకవర్గాల్లో ఓటర్ల మీద నోట్ల వర్షం కురుస్తుందని చెప్పకతప్పదు. అంతిమంగా ఎలాంటి ఫలితం రానుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News