విశాఖలో మెగా డేటా సెంటర్.. రూ.87,520 కోట్ల పెట్టుబడి
విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్‌లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.;
పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ నగరం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దేశ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. రూ.87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఆమోదాన్ని తెలియచేసింది.
విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద మూడు క్యాంపస్‌లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‌కు అనుసంధానంగా ఈ క్యాంపస్‌లు ఏర్పాటు కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించినట్లైందని చెబుతున్నారు.
క్వాంటం వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్‌గా మారతాయని భావిస్తున్నాన్నారు. కేవలం 15 నెలల కాలంలో పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అంటున్నారు. డేటా సెంటర్లతో ఓ ఎకో సిస్టం వస్తోందని.. విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటి వరకూ 11 ఎస్ఐపీబీ సమావేశాలు నిర్వహించి రూ.7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయని అంటున్నారు.
ప్రాంతాల వారీగా పారిశ్రామికాభివృద్ధి
క్వాంటం వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికి వస్తున్న డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపుగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనమిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకు ప్రత్యేక కారిడార్‌ను ఏర్పాటు చేయాల్సి ఉందని ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆమేరకు మూడు ప్రాంతాలను పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తూర్పుగోదావరి నుంచి శ్రీకాకుళం వరకూ విశాఖ ఎకనామిక్ రీజియన్, అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకూ ఒక ఆర్ధిక ప్రగతి రీజియన్, నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్లను ఏర్పాటు చేయనున్నారు.