విశాఖ ట్రైన్ లో మహిళపై అత్యాచారం చేసిన సిబ్బంది

ముందుగా భార్యను భర్తకు దూరం చేసేందుకు.. లోపల టికెట్ చెకింగ్ జరుగుతుందని చెప్పి.. ఆమెను ఏసీ బోగీలో కూర్చోబెట్టి వచ్చిన తర్వాత భర్తకు బెర్తు చూపిస్తానని నిందితుడు చెప్పాడు.;

Update: 2026-04-30 04:24 GMT

షాకింగ్ ఉదంతం ఒకటి తాజాగా వెలుగు చూసింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ వినని విధంగా.. ట్రైన్ సిబ్బంది ఒకరు అనూహ్య రీతిలో సాయం చేస్తానని నమ్మబలికి.. వివాహతను అత్యాచారానికి పాల్పడిన వైనం కాస్త ఆలస్యంగా వెలుగు చూసింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతంలోని వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళుతున్న విశాఖ ఎక్స్ ప్రెస్ లో దంపతులు జనరల్ బోగీ ఎక్కారు. అక్కడ విపరీతమైన రద్దీ ఉండటంతో.. వారిని గుర్తించి.. ఏసీ బోగీల్లో సీట్లు ఇప్పిస్తానని నమ్మబలికినట్లుగా తెలుస్తోంది.

ముందుగా భార్యను భర్తకు దూరం చేసేందుకు.. లోపల టికెట్ చెకింగ్ జరుగుతుందని చెప్పి.. ఆమెను ఏసీ బోగీలో కూర్చోబెట్టి వచ్చిన తర్వాత భర్తకు బెర్తు చూపిస్తానని నిందితుడు చెప్పాడు. ట్రైన్ లో బెడ్ షీట్లు సరఫరా చేసే సిబ్బందిలో ఒకరు ఈ దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. బెర్తు చూపిస్తానని తీసుకెళ్లిన అతను.. ఏసీ బోగీలోకి తీసుకెళ్లి.. కూర్చోబెడుతున్నట్లుగా నటిస్తూ.. డోర్ మూసి నోరు నొక్కేసి అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.

వివరాలు బయటకు చెబితే చంపేస్తానని బెదిరించినట్లుగా తెలుస్తోంది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఈ జంట ట్రైన్ దిగేసిన తర్వాత.. భార్య మౌనంగా ఉండటం.. ఆమెలోని మార్పును గమనించిన భర్త.. అసలేం జరిగిందని అనునయంగా అడగటంతో ఆమె జరిగిన దారుణం గురించి వెల్లడించింది. వెంటనే.. వారు స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన దారుణం గురించి ఫిర్యాదు చేయగా.. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆ రోజున ట్రైన్ లో పని చేసిన సిబ్బంది జాబితాను చెక్ చేసి.. నిందితుడ్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని గుర్తించి.. అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే.. రైల్వే వర్గాలు ఈ ఉదంతం గురించి ఎలాంటి అధికారిక ప్రకటనను విడుదల చేయలేదు.

Tags:    

Similar News