కూటమి విశాఖ ఫోకస్....ఎమ్మెల్యేలకు బిగ్ టాస్క్

విశాఖను కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా ఫోకస్ చేస్తోంది. ఐటీకి కేరాఫ్ గా మార్చాలని అలాగే పారిశ్రామిక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు.;

Update: 2025-10-02 17:30 GMT

విశాఖను కూటమి ప్రభుత్వం వచ్చాక బాగా ఫోకస్ చేస్తోంది. ఐటీకి కేరాఫ్ గా మార్చాలని అలాగే పారిశ్రామిక ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారు. అనేక పరిశ్రమలకు విశాఖలో ఆహ్వానం పలుకుతున్నారు. చాలా వాటికి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు దాంతో సిటీ ఆఫ్ డెస్టినీగా పేరు గడించిన విశాఖలో పరిశ్రమల స్థాపనకు అనేక మంది వస్తున్నారు. మరో వైపు చూస్తే ఎన్నడూ లేని విధంగా భూములను ఉదారంగా కూటమి ప్రభుత్వం కేటాయిస్తోంది.

ఉదారంగా ముందుకు :

చాలా ఐటీ కంపెనీలను ఆకట్టుకునేందుకు ప్రభుత్వం భూముల విషయంలో చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటోంది. దాంతో ఎకరం 99 పైసలకు కూడా కొందరికి ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దాంతో చాలా మంది విశాఖ మీద ఇంటెరెస్ట్ చూపిస్తున్నారు. ఇక అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తున్నారు. అధిక పెట్టుబడులతో భారీ ఎత్తున దీనిని స్థాపిస్తున్నారు. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నక్కపల్లిలో ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవుతోంది. అదే విధంగా బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తున్నారు.

హోం మంత్రికే సెగ :

ఇదిలా ఉంటే స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్దగా ఇబ్బందులు లేకపోయినా బల్క్ డ్రగ్ పార్క్ ని మాత్రం స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు తమకు ఈ పార్క్ వద్దు అని అంటున్నారు. ఈ పార్క్ వస్తే కనుక తమ ఉపాధి పూర్తిగా దెబ్బ తింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బల్క్ డ్రగ్ పార్క్ వల్ల సముద్ర జలాలు కలుషితం అవుతాయని దాని వల్ల మత్స్య సంపద పూర్తిగా నాశనం అవుతుందని తమ జీవితాలే తల్లకిందులు అవుతాయని వారు అంటున్నారు. దీంతో తాజాగా ఆ ప్రాంతానికి అచ్చిన హోం మంత్రి అనిత ఎదుటనే తమ నిరసనలు వినిపించారు. తమకు పార్క్ వద్దని ముక్తకంఠంతో చెప్పేశారు. ఈ క్రమంలో అనిత వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినా కూడా వారు తగ్గేది లేదని స్పష్టం చేయడంతో హోం మంత్రికి ఇబ్బందులు ఎదురౌతున్నాయని అంటున్నారు.

ఆయనకూ ఇదే ఇరకాటం :

ఇక గాజువాక ఎమ్మెల్యే ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయిన పల్లా శ్రీనివాస్ కి రెండు విధాలుగా ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఆయన పరిధిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్నారు అని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అలాంటిది ఏదీ లేదు అని ఆయన తరచూ చెప్పుకోవాల్సి వస్తోంది. అయితే విశాఖ ప్లాంట్ కి అతి సమీపంలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ వస్తే ప్రభుత్వ రంగంలో ప్లాంట్ ఉండే చాన్స్ లేదని ప్రజా సంఘాలు వామపక్షాలు చేస్తున్న విమర్శలతో పల్లా ఇరకాటంలో పడుతున్నారు. ఆయన సైతం ఈ విషయంలో అటు కార్మికులకు ఇటు ప్రజలకు నచ్చచెప్పలేక పోతున్నారని అంటున్నారు.

గంటాకు అదే ఇబ్బంది :

ఇవన్నీ ఇలా ఉంటే సీనియర్ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కూడా భూసేకరణ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం భీమిలీలోని ఆనందపురం మండలంలో గూగుల్ డేటా సెంటర్ కి భూములు సేకరిస్తున్నారు. అయితే ఈ విలువైన భూములు ఇవ్వవద్దని ప్రతిపక్షాలు అంటున్నారు. రైతుల తరఫున తాము పోరాడుతున్నామని వారు చెబుతున్నారు. దాంతో గూగుల్ తో కూటమి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుని తొందరగా దానిని విశాఖలో ఏర్పాటు చేయించాలని చూస్తోంది. కానీ భూసేకరణ వద్దనే ఇబ్బందులు ఎదురు కావడంతో తాజాగా విశాఖ వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబర్ నాటికి భూసేకరణ పూర్తి చేయాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు. దాంతో గంటా సైతం భూ సేకరణ విషయంలో ఎలా ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారు. మొత్తం మీద చూస్తూంటే కేవలం విశాఖ జిల్లా మాత్రమే కాదు ఉత్తరాంధ్రా అంతటా భూసేకరణ ఒక సమస్యగా ఉందని అంటున్నారు. అటు ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకుంటోందని ఇటు మధ్యన ఎమ్మెల్యేలే టెన్షన్ పడాల్సి వస్తోంది అని అంటున్నారు.

Tags:    

Similar News