బిగ్ డిబేట్: విశాఖ `ఆర్థిక రాజధాని` అవుతుందా..!
దేశానికి ఆర్థిక రాజధాని అనగానే ముంబై పేరు తడుముకోకుండా చెప్పేస్తారు. తెలంగాణకు రాష్ట్ర, ఆర్థిక రాజధాని అనగానే హైదరాబాద్ అన్న విషయంలో ఎవరికీ తేడా లేదు.;
దేశానికి ఆర్థిక రాజధాని అనగానే ముంబై పేరు తడుముకోకుండా చెప్పేస్తారు. తెలంగాణకు రాష్ట్ర, ఆర్థిక రాజధాని అనగానే హైదరాబాద్ అన్న విషయంలో ఎవరికీ తేడా లేదు. ఇక, ఏపీ విషయానికి వస్తే.. రాష్ట్ర రాజధానిగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో చర్చ తెరమీదికి వచ్చింది. అదే.. ఆర్థిక రాజధాని!. ఉత్తరాంధ్రలోని విశాఖను ఆర్థిక రాజధాని చేస్తున్నారా? అనేది చర్చ.
దీనిపై అనేక విశ్లేషణలు కూడా వస్తున్నాయి. అంతేకాదు.. అనేక మంది విశాఖ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని గా మారుతోందని చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ విషయంపై గుంభనంగా వ్యవహరిస్తోంది. విశాఖ రాష్ట్రానికి ఐటీ రాజధాని అని చెప్పడం ద్వారా.. ఉత్తరాంధ్రకు ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంటోంది. కానీ, క్షేత్రస్థాయిలో విశాఖ నుంచి వస్తున్న ఆదాయం.. ప్రభుత్వానికి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఇటీవల లెక్కలు ఇదే చెబుతున్నాయి.
ఒకప్పుడు విజయవాడ, గుంటూరుల నుంచి రాష్ట్రానికి ఆదాయం వచ్చేది. దీంతో విజయవాడను వ్యాపార కేంద్రంగా కూడా పేర్కొంటారు. కానీ.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విశాఖ నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వానికి పన్నులు, ఇతరత్రా ఆదాయాల రూపంలో సొమ్ము చేరింది. దీనికి తోడు వస్తున్న పరిశ్రమలు.. పెడుతున్న పెట్టుబడులు కూడా విశాఖ... చుట్టే తిరుగుతున్నాయి. విశాఖను ఉత్తరాంధ్రను వేర్వేరుగా చూడలేం కాబట్టి.. ఉత్తరాంధ్ర మొత్తానికి ప్రయోజనం చేకూరితే మంచిదే.
అలా కాకుండా..కేవలం విశాఖను మాత్రమే ప్రొజెక్టు చేసే ప్రయత్నం చేస్తే.. శ్రీకాకుళం, విజయనగరంతో పాటు.. ఇటు ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరిలకు ఇబ్బంది తప్పదన్న సూచనలు వస్తున్నాయి. మరోవైపు.. విశాఖకు తాజాగా మిట్టల్ స్టీల్ వచ్చింది. అదేసమయంలో ఇతర ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తే.. వచ్చే పదేళ్లలో విశాఖ ఆర్థిక రాజధానిగా ఎదుగుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఇదేసమయంలో ఇతర ప్రాంతాలను విస్మరించేందుకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది.