విశాఖ విమానాశ్ర‌యం బంద్‌.. రీజ‌నేంటి?

సాధార‌ణ విమానాల నుంచి ఏ ఇత‌ర ప్యాసెంబ‌ర్ విమానాలు కూడా ఈ విమానాశ్ర‌యంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది.

Update: 2026-07-29 19:33 GMT

విశాఖ‌ప‌ట్నంలో ప్ర‌స్తుతం ఉన్న విమానాశ్ర‌యాన్ని వ‌చ్చే నెల 17 నుంచి సాధార‌ణ ప్ర‌జ‌లు, వ్యాపార‌, వాణిజ్య వేత్త‌ల‌కు కూడా మూసివేస్తున్న‌ట్టు కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా గెజిట్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అంటే.. వ‌చ్చే నెల 17 నుంచి ప్ర‌జ‌లు ఎవ‌రూ విశాఖప‌ట్నం విమానాశ్ర‌యానికి వ‌చ్చే అవ‌కాశం లేదు. వ‌చ్చే నెల 17 అర్ధ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత‌.. సాధార‌ణ విమానాల నుంచి ఏ ఇత‌ర ప్యాసెంబ‌ర్ విమానాలు కూడా ఈ విమానాశ్ర‌యంలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌బోవ‌ని స్ప‌ష్టం చేసింది.

ఎందుకు?

విశాఖ విమానాశ్ర‌యం అనేది నిజానికి సాధార‌ణ ప్ర‌జ‌ల కోసం నిర్మించిన విమానం కాదు. అది ర‌క్ష‌ణ శాఖ అవ‌స‌రాల కోసం.. 1940ల‌లో నిర్మించారు. ఆ త‌ర్వాత‌.. దీనిలో తూర్పునావికాద‌ళం, ర‌క్ష‌ణ అనుబంధ విభాగాల విమానాలు మాత్ర‌మే ల్యాండ్ అయ్యేవి. అదేవిధంగా భార‌త వాయుసేన విమాన శిక్ష‌ణ కూడా ఇక్క‌డే నిర్వ‌హించేవారు. అయితే.. త‌ర్వాత కాలంలో ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల కోసం.. మ‌రో ప్ర‌త్యేక విమానాశ్ర‌యం నిర్మించాల‌ని భావించినా.. అది సాకారం కాలేదు. దీంతో ర‌క్ష‌ణ శాఖ అనుమ‌తితో విశాఖ విమానాశ్ర‌యాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం వినియోగించుకుంటోంది.

ఇప్పుడు..

ఇక‌, ఇప్పుడు ఉత్త‌రాంధ్ర‌కే కాదు.. యావ‌త్ ఏపీకి కూడా త‌ల‌మానిక‌మైన విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం అందుబాటులోకి వ‌చ్చింది. దీనిని వ‌చ్చే నెల 1వ తేదీన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స్వ‌యంగా ప్రారంభించ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ విమానాశ్ర‌యాన్ని అంద‌రికీ చేరువ చేయ‌నున్నారు. విశాఖ ర‌వాణా విమానాల‌ను కూడా ఇక్క‌డ నుంచే ఆప‌రేట్ చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే విశాఖ విమానాశ్ర‌యాన్ని వ‌చ్చే నెల 17వ తేదీ నుంచి మూసివేస్తున్న‌ట్టు కేంద్రం ప్ర‌క‌టించింది.

విశాఖ‌లో ఏం చేస్తారు..

ప్ర‌స్తుతం ఉన్న విశాఖ‌ప‌ట్నం విమానాశ్ర‌యాన్ని అలానే ఉంచుతారు. అయితే.. ర‌క్ష‌ణ అవ‌స‌రాలు, ఇత‌ర అత్యవ‌స‌ర ప‌రిస్థితులు తలెత్తిన‌ప్పుడు మాత్ర‌మే దీనిని వినియోగంలోకి తీసుకురానున్నారు. అలాగే, ఎయిర్ ఫోర్స్‌, పోలీసు విమానాలు, ప్రభుత్వ అతిథుల రాకపోకలు సాగించే విమానాలు, లీజ్, వీఐపీ ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఇక్కడి నుంచి నడుస్తాయి. ఇక‌, సాధార‌ణ ప్ర‌జ‌లు కానీ.. వీఐపీలు కానీ, భోగాపురం విమానాశ్రయం నుంచే రాక‌పోక‌లు సాగించ‌నున్నారు.

Tags:    

Similar News