అలాంటి భర్తే కావాలంటూ యువతి పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోల్స్
తాజాగా ఓ యువతి తనకు కాబోయే 'మిస్టర్ పర్ఫెక్ట్' క్వాలిఫికేషన్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట కార్చిచ్చు రేపుతోంది.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోవడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. రీల్స్ చేసి స్టెప్పులు వేయక్కర్లేదు.. ప్రాంక్ వీడియోలు చేయక్కర్లేదు. తనకు ఎలాంటి మొగుడు కావాలో చెప్తూ ఒక లిస్ట్ పెడితే చాలు.. రాత్రికి రాత్రే దేశవ్యాప్తంగా ట్రెండ్ అయిపోవచ్చు. తాజాగా ఓ యువతి తనకు కాబోయే 'మిస్టర్ పర్ఫెక్ట్' క్వాలిఫికేషన్స్ ఇవేనంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట కార్చిచ్చు రేపుతోంది. ఆమె పెట్టిన కండిషన్లు చూసి కొందరు నోరెళ్లబెడితే.. మరికొందరు మాత్రం "అమ్మా.. నువ్వు వెతుకుతోంది భర్తనా? లేక రిమోట్ కంట్రోల్ రోబోనా?" అంటూ ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.
ఆకాశమంత కోరికలు.. అన్నీ ‘రూల్స్’ పక్కా!
ఇంతకీ ఆ అమ్మడు కోరుకుంటున్న భర్తగారి ప్రొఫైల్ ఎలా ఉండాలంటే.. జీతం నెలకు కనీసం రూ.2 లక్షలు..తగ్గడానికి వీల్లేదు సుమా... కటౌట్ కనీసం 6 అడుగుల హైట్ ఉండాలి, చూడటానికి గ్రీకు వీరుడిలా హ్యాండ్సమ్‌గా మెరిసిపోవాలి. బ్యాక్‌గ్రౌండ్ గతం శూన్యమై ఉండాలి. అంటే పెళ్లికి ముందు ఎలాంటి గర్ల్‌ఫ్రెండ్స్ ఉండకూడదు. పెళ్లి తర్వాత కూడా పరాయి స్త్రీల వంక చూడకూడదు. డ్యూటీలు ఏంటంటే వంట వండటం ఖచ్చితంగా రావాలి, ఇల్లు సర్దడంలో భార్యకు అసిస్టెంట్‌గా మారాలి.ఇక్కడివరకు చూస్తే "సరేలే.. ఈ కాలం పిల్లల అంచనాలు ఇలాగే ఉంటాయి" అని సరిపెట్టుకోవచ్చు. కానీ అసలు సిసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది.
భర్త కావాలా? బందీ కావాలా?
భర్తగా వచ్చే వ్యక్తి తన 24 గంటల ‘లైవ్ లొకేషన్’ ఎప్పుడూ భార్యతో షేర్ చేస్తూనే ఉండాలట.. అంటే ఆఫీసులో ఉన్నాడా, ఫ్రెండ్స్‌తో టీ తాగుతున్నాడా.. లేక ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాడా అనేది సెకండ్ల వారీగా భార్యకు డిస్‌ప్లే అయిపోవాలన్నమాట. దీంతో పాటు అప్పుడప్పుడు ఫారిన్ టూర్లకు తీసుకెళ్లడం, షాపింగులు చేయించడం ఎలాగూ కామన్ అనుకోండి.
నెటిజన్ల పంచ్‌లు
"ఇది పెళ్లి సంబంధమా? లేక గూగుల్ మ్యాప్స్ ఉద్యోగ నియామక ప్రకటననా?" అని ఒకరంటే "కార్లకు, బైక్‌లకు జీపీఎస్ ట్రాకర్లు పెడతారు కానీ ఇలా మొగుడికి కూడా ట్రాకర్ వేస్తారా బాబోయ్!" అని ఇంకొకరు తల పట్టుకుంటున్నారు.
నమ్మకం లేని చోట.. బంధం నిలుస్తుందా?
ఈ పోస్టుపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకం, గౌరవం, స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇలా ప్రతి నిమిషం నిఘా పెట్టడం ఏంటని పెళ్లికాని ప్రసాదులు వాపోతున్నారు. మరికొందరేమో "నెలకు రెండు లక్షలు సంపాదిస్తూ 6 అడుగుల ఎత్తు ఉండి, రోజుకు 24 గంటలు లొకేషన్ షేర్ చేసే అమాయకుడు భూమి మీదే దొరకడు.. ఐలాండ్స్ ఏమైనా వెతుక్కోవాల్సిందే" అంటూ సెటైర్లు వేస్తున్నారు.
అయితే ఈ పోస్ట్ నిజంగానే ఆమె సీరియస్‌గా పెట్టిందా? లేక కేవలం వ్యూస్ కోసం.. వైరల్ అవ్వడం కోసం చేసిన 'అటెన్షన్ గ్రాబింగ్' స్టంటా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఈ ‘లైవ్ లొకేషన్’ మొగుడి కాన్సెప్ట్ మాత్రం ప్రస్తుతానికి మీమర్లకు ఫుల్ మీల్స్ పెడుతోంది..