గణ నాధుడు...జన నాధుడు

పెద్దలను పిల్లలను అందరినీ భక్తి వైపు నడిపించే ఏకైక పండుగ వినాయక చవితిగా చెప్పాలి. చిన్నతనంలో పిల్లలకు పూజాదికాలు ఏమిటి అన్నవి తెలియవు.;

Update: 2025-08-27 06:14 GMT

పెద్దలను పిల్లలను అందరినీ భక్తి వైపు నడిపించే ఏకైక పండుగ వినాయక చవితిగా చెప్పాలి. చిన్నతనంలో పిల్లలకు పూజాదికాలు ఏమిటి అన్నవి తెలియవు. అయితే వారిని ఆధ్యాత్మిక వైపుగా తొలి అడుగులు వేయించేది గణపతి చతుర్థి అని స్పష్టంగా చెప్పవచ్చు. పెద్దలు చేసే పూజా మందిరం ఆ రోజు పిల్లలకు ఇస్తారు. ఎపుడూ దూరంగా ఉంటూ దేవుడికి దండం పెట్టుకునే పిల్లలు ఆ రోజు తాము కూడా పూజలు చేసేందుకు అవకాశం అందుకుంటారు. ఇంకా చెప్పాలీ అంటే తామే గణపతి విగ్రహం తెచ్చుకుంటారు. పూజా మందిరం వద్ద గణపతిని కొలువు తీరుస్తారు. అన్ని విధాలుగా అలంకరిస్తారు. ఆ మీదట గణపతి పూజ చేయడం ద్వారా విఘ్నేశ్వరుని ఆశీస్సులు నిండుగా పొందుతారు. అలా పూజల వైపు ఆధ్యాత్మికత వైపు పిల్లలను నడిపించే పండుగగా వినాయక చవితిని పేర్కొనాల్సి ఉంటుంది.

తొలి వేలుపుగా :

వినాయకచవితి ప్రతీ ఏటా భాద్రపద మాసం శుక్ల పక్షంలో చవితి నాడు వస్తుంది. ఆ రోజు వినాయకుడి పుట్టిన రోజు. అందుకే ఆయన పండుగగా చేసుకుంటారు. ఇక తెలుగు సంవత్సరాలు చూస్తే కనుక ఉగాదితో చైత్ర మాసం మొదలవుతుంది. ఆ మీదట వరస పండుగలు అనే వినాయకచవితి తోనే ప్రారంభం అవుతాయి. అంటే పండుగలకు శ్రీకారం చుట్టేది వినాయకుడు అన్న మాట. అంతే కాదు వినాయక చవితిని జరుపుకుంటే ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు ఉండవని పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. అందుకే గణపతిని పూజించిన మీదట ఆ ఏడాది అంతా ఎంతో ఆనందంగా భక్తి శ్రద్ధలతో ఇతర పండుగలను జరుపుకుంటారు.

స్పూర్తివంతంగా :

వినాయకచవితి అన్నది ఒక పండుగగా ఆధ్యాత్మిక వేడుకగా చూడడం ఒక ఎత్తు అయితే మరో వైపు ఎన్నో విషయాలలో స్పూర్తిగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా వీధులలో ఉండేవారు అంతా ఒక్కటిగా చేరి గణపతి ఉత్సవాలు నిర్వహిస్తారు అలా ఎవరో కొందరు ఔత్సాహికులు దానిని భుజాల మీద వేసుకుని నాయకత్వం వహిస్తారు. అంటే నాయకత్వ లక్షణాలను మొదట్లోనే అందించే గొప్ప లక్షణం ఈ పండుగ ద్వారా అలవాటు అవుతుంది అన్న మాట. యువకులు ఎంతో మంది తమ నాయకత్వాన్ని ఈ పండుగ ద్వారా నిరూపించుకుని అనంతర కాలంలో మంచి నాయకులుగా తమ రంగాలలో ఎదిగిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.

ఐక్యతకు చిహ్నంగా :

వినాయక చవితిని తర తమ భేదం లేకుండా అంతా జరుపుకుంటారు. ఒకరు చిన్న ఒకరు పెద్ద అన్న భావమే ఉండదు. అంతా కలసి ఒక్క చోట చేరి ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు అలా ఆయా వీధూలలో కానీ కాలనీలలో కానీ ఉన్న వారు అందరూ ఒక కుటుంబంగా మంచి అనుబంధంతో ముందుకు సాగడానికి వినాయక చవితి పండుగ ఎంతగానో దోహదపడుతుంది. అలాగే ఒకరి కష్ట సుఖాలలో పాలుపంచుకోవడానికి కూడా ఈ పండుగ వేదికగా మారుతుంది. అలా సమాజంలో ఒక మంచి వాతావరణాన్ని పాదు కొలపడానికి కూడా ఈ పండుగ ఎంతగానో దోహదపడుతుంది అని చెప్పాల్సి ఉంది.

ప్రతిభను వెలికి తీసేందుకు :

ఇక చవితి ఉత్సవాలలోనే అనేక మందిలో లోపల దాగిన ప్రతిభ బయటపడుతుంది. ముందు తన కాలనీలలో తమ వారి వద్ద పది మందిలో ఎలాంటి బిడియం సంకోచం లేకుండా తమ ప్రతిభను చూపించేందుకు సరైన వేదిక కూడా సిద్ధమవుతుంది. అలా అక్కడ అందరితో భేష్ అనిపించుకున్న వారు రానున్న కాలంలో తమ ప్రతిభను పదును పెట్టుకుని ఇష్టమైన రంగాలలో రాణించేందుకు కూడా ఎంతగానో అవకాశాలు ఉంటాయి.

సానుకూల దృక్పధం కోసం :

మానసిక వైద్య నిపుణులు చెప్పేది ఒక్కటే. సానుకూల దృక్పధం అలవాటు చేసుకోవాలని. ఆ విధంగా చూస్తే కనుక వినాయకచవితి పండుగ దానిని అలవరచేందుకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతీ వారికి వారి స్వీయ ప్రతిభ మీద సత్తా మీద నాయకత్వ లక్షణాల మీద ఒక నమ్మకం కలిగిస్తుంది. తాము ఏమిటి అన్నది తెలుసుకుని ముందుకు సాగేందుకు ఎంతగానో దోహదపడుతుంది. ఇక మంచి ఆలోచనలకు మంచి విషయాలను తెలుసుకునేందుకు కూడా చవితి వేడుకలు బాగా దోహదపడతాయి.

ఉత్తమ సమాజానికి శ్రీకారం :

మంచి సమాజం నుంచే మంచి ప్రాంతం రాష్ట్రం దేశం అన్నవి ఏర్పడతాయి. అలాంటి వాటికి తొలి మెట్టుగా ఈ పండుగ ఉంటుంది అందరూ చేతులు కలిపి ఒక్కటిగా కలసి మెలసి ఉండడం అన్నది ఉత్తమ సమాజానికి ఒక నిదర్శనంగా ఉంటుంది. ఒకరి బాధలను ఇబ్బందులను మరొకరు పంచుకుంటూ సాగితే సమాజంలో ఎపుడూ సమస్యలు పెద్దగా కనిపించవు. సంతోషం ఎక్కువగా ఉంటుంది అలాంటి సమాజంతో కూడిన రాష్ట్రమైనా దేశమైనా ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అందువల్ల వినాయకచవితి పండుగను ఆధ్యాత్మిక దృక్పథంతో మాత్రమే కాకుండా లౌకికంగా చూసినా గొప్ప విశేషాలు ఎన్నో తెలుస్తాయి. అందుకే వినాయక చవితి సమాజం చేసుకునే పండుగ. సామూహికంగా జరుపుకునే ఉత్సవం. ఈ పండుగకు ఎటువంటి వివక్ష కానీ తారతమ్యాలు కానీ లేవు అని గట్టిగా చెప్పాల్సి ఉంది.

“తుపాకీ వెబ్‌సైట్ పాఠకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో మీ జీవితాలు సుఖసంతోషాలతో, విజయాలతో నిండిపోవాలని కోరుకుంటున్నాము.”


Tags:    

Similar News